అసంపూర్తిగా సుందరయ్య కాలనీ
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:29 AM
కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని రావిపాడుకు వెళ్లే రోడ్డుపక్కన ఉన్న సుందరయ్యకాలనీ 16 సంవత్స రాలుగా అసంపూర్తిగా ఉంది.

కంభం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని రావిపాడుకు వెళ్లే రోడ్డుపక్కన ఉన్న సుందరయ్యకాలనీ 16 సంవత్స రాలుగా అసంపూర్తిగా ఉంది. ఈ కాలనీలో బేస్‌మెంట్ స్థాయిలోనే పలు నిర్మాణాలు నిలిచిపోయాయి. 2008-09లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పక్కాగృహాల పేరుతో ఇళ్లనిర్మాణం ప్రారంభించింది. దాదాపు 16 ఏళ్లు గడిచినా కాలనీ నిర్మాణాలు పూర్తికాక సమస్యల నడుమ ఆయా కుటుంబాలు జీవనం వెళ్లదీస్తున్నాయి.
2006-07 నుంచి మూడు విడతలుగా ఇందిరమ్మ గృహాలు, రచ్చబండ పథకం ద్వారా జీవో నెంబరు 171 ద్వారా ఈ కాలనీలో 330 పక్కాగృహాలు మంజూర య్యాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడి లబ్ధిదారుల్లో 80 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి, వివిధ నిర్మాణ దశల్లో అసంపూర్తిగా వదిలివేశారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ గానే ఉంటుందని ఇక్కడ పరిస్థితి ని బట్టి తెలుస్తోంది. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కొన్ని గృహాల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తరువాత ప్రభుత్వం మారడం, కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ చేపట్టడంతో మరికొంత జాప్యం ఏర్పడింది. దీంతో నాటి నుంచి నేటి వరకు నిర్మాణాలు పూర్తి కాలేదు. మరో వైపు ఈ స్థలంలో కొంత భాగంపై ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించ డంతో ఆ భూమిలో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అప్పటి నుంచి అధికారులు దీనిపై ఎటూ తేల్చకోవడంతో లబ్ధిదారులు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే లబ్ధిపొందినట్లు ప్రభుత్వ రికార్డుల్లో వీరి పేర్లు ఉండడంతో మరోసారి కొత్తగా ఇళ్లు కూడా మంజూరు కావడం లేదు. దీంతో ఈ లబ్ధిదారులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉంది.
ప్రస్తుతం లబ్ధి పెంచడంతో మళ్లీ ఆశలు
అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అదనపు సహా యం కింద రూ.25వేలు నగదును ప్రకటించింది. దీంతో 80 గృహాల లబ్దిదా రులు ఈ అదనపు సహా యానికి అర్హులుగా గుర్తించి ఇళ్లు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే కాలనీలో మౌలిక వసతలు ఏర్పాటు చేస్తే లబ్ధిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కనీసం ఆ దిశగానైనా అధికారులు చొరవ చూపాల్సి ఉంది.
ఇవీ కాలనీలో సమస్యలు
కాలనీలో విద్యుత్ సౌకర్యం కోసం స్తంభాలు వేసినా వాటికి తీగలు బిగించలేదు. వేసిన ఒక్క బోరు ఎండిపోయింది. ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించి నీటి సరఫరా చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి.
ఈవిషయమై హౌసింగ్ ఏఈ వంశీకృష్ణ స్పందిస్తూ, 330 మందికి గృహాలు మంజూరైనా 83 మంది మాత్రమే రూ.25 వేల పెంపునకు అర్హత సాధించారు. వారు ఇళ్ల నిర్మాణాలు చేపట్టకోవచ్చు.