Share News

మూడు జలాశయాలు... రూ.4,400 కోట్లు!

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:15 AM

కూటమి ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌పై దృష్టి సారించింది. పథకాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తోంది. సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి కేంద్రం నుంచి మరో మూడేళ్లు అనుమతి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. భూగర్భ జలాలను వినియోగించకుండా ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించింది.

మూడు జలాశయాలు... రూ.4,400 కోట్లు!
మూడు వనరుల నుంచి నీటి తరలింపు మార్గాలను కంప్యూటర్‌లో పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు

జలజీవన్‌ మిషన్‌ పనులపై సిద్ధమవుతున్న ప్రతిపాదనలు

లైన్‌ ఎస్టిమేషన్లపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల కసరత్తు

వనరుల సద్వినియోగంతోపాటు అదనంగా పనులు

ప్రతి ఇంటికీ కొళాయి.. భూగర్భ జలం వాడకుండా నీరు

రోజుకు ఒక్కొక్కరికి 55 లీటర్ల సరఫరా

ఏడాదికి 3.2 టీఎంసీలు అవసరం

కందుకూరు నియోజకవర్గానికీ వెలిగొండ నుంచే నీరు

కూటమి ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌పై దృష్టి సారించింది. పథకాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తోంది. సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి కేంద్రం నుంచి మరో మూడేళ్లు అనుమతి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. భూగర్భ జలాలను వినియోగించకుండా ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించింది. ఉన్న జలాశయాల్లో ఏ ప్రాంతానికి ఎక్కడి నుంచి సరఫరా చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది. దీంతో వారం రోజులుగా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని మూడు ప్రధాన జలాశయాల నుంచి 1,629 ఆవాసాలతోపాటు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గంలోని 202, బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని 59 హ్యాబిటేషన్లకు నీటి సరఫరాకు రూ.3,750 కోట్లు అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పనులు సాగక రద్దుచేసిన రూ.412 కోట్ల విలువైన 1,102 పనులను తిరిగి చేపట్టేందుకు మరో రూ.650 కోట్లు అవసరమన్న భావనకు వచ్చారు. అలా మొత్తం జలజీవన్‌ పథకం పునర్‌వ్యవస్థీకరణ కోసం మొత్తం రూ.4,400కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఒంగోలు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షిత తాగునీటి సరఫరాపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్‌ మిషన్‌లో ఈ అంశం ప్రధానంగా 2022 నుంచి అమలు చేస్తుండగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగలేదు. కేంద్రం ఇచ్చిన గడువు 2025 మార్చితో ముగియనుంది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి కేంద్రం నుంచి మరో మూడేళ్ల అనుమతి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ పథకంలో ప్రధాన లక్ష్యాలను పరిశీలిస్తే ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా ఏడాది పొడవునా నీటి సరఫరా, భూగర్భ జలంతో అవసరం లేకుండా జలాశయాల నుంచి ప్రతి మనిషికి రోజుకు 55 లీటర్లు అందిస్తారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతా ల్లో 4,58,026 కుటుంబాలు ఉండగా 60శాతం ఇళ్లకు మాత్రమే కొళాయిలు ఉన్నాయి. ఈ పథ కంలో కొళాయి లేని ఇల్లు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలజీవన్‌ పునర్‌వ్యవస్థీకరణలో వెలిగొండ అత్యంత కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు ఆధారంగానే జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాలతోపాటు దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాల్లోని 1,179, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలోని 202 ఆవాసాలకు నీటిని సరఫరా చేస్తారు. ఇందుకోసం రూ.2,500 కోట్లు అవసరమని అంచనా. ఇందులో గత వైసీపీ ప్రభుత్వం నాలుగు నియోజకవర్గాలకు రూ.1,290 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేయక రద్దయిన వాటిని కూడా కలిపి చేస్తారు. వెలిగొండ రిజర్వాయర్‌లో గతంలో రూ.73కోట్లతో తాగునీటి కోసం చేపట్టిన ఇన్‌టెక్‌ వెల్‌ నిర్మాణం, ఫిల్టర్‌బెడ్‌లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఆ ఇన్‌టెక్‌ వెల్‌ నుంచి రిజర్వాయర్‌లో నీటిని ఫిల్టర్‌ బెడ్‌లోకి తీసుకొని అక్కడి నుంచి మూడు విడివిడి పైపులైన్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని తరలిస్తారు.

రామతీర్థం, గుండ్లకమ్మల నుంచి

రామతీర్థం రిజర్వాయర్‌ నుంచి కొండపి నియోజకవర్గంలోని మండలాలతోపాటు ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని చీమకుర్తి, ఎస్‌ఎన్‌పాడు మండలాల్లో ఉన్న 315 హ్యాబిటేషన్లకు రూ.800 కోట్లతో, గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని మద్దిపాడు, ఎన్‌జీపాడు, ఒంగోలు నియోజకవర్గంలోని ఒంగోలు రూరల్‌, కొత్తపట్నం మండలంలోని 135 హ్యాబిటేషన్లకు బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలోని కొరిశపాడు, అద్దంకి మండలాల్లోని మరో 50 కలిపి 194 హ్యాబిటేషన్లకు రూ.405 కోట్లతో పథకాన్ని ప్రతిపాదిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరై పనులు చేపట్టని, అలాగే కొద్దిపాటి పనులు మాత్రమే జరిగిన రూ.412 కోట్ల విలువైన 1,102 పనులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దుచేసింది. ఆ గ్రామాలలో తిరిగి ఆ పనులను తాజా లెక్కల ప్రకారం చేపట్టనుంది. అందుకుగాను రూ.650 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అలా మొత్తంగా రూ.4,400కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ మేరకు గుర్తించిన పనులు ఎలా చేయాలి? ఏ గ్రామానికి ఎక్కడి నుంచి ఏమార్గంలో పైపులైన్లు వేయాలి? అన్న దానిపై ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు లైన్‌ ఎస్టిమేషన్లు తయారు చేస్తున్నారు. అందులో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటర్‌ ట్యాంకులు, ఫిల్టర్‌ బెడ్లు, పైపులైన్లు ఇతరత్రా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ అదనంగా చేయాల్సిన పనులను ప్రతిపాదిస్తున్నారు.


మార్చి ఆఖరుకు పూర్తిస్థాయి నివేదిక

ఈ నెలాఖరులోపు అంచనాలు, మార్చి ఆఖరులోపు ప్రాజెక్టు పూర్తిస్థాయి రిపోర్టులు రూపొందించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. కాగా ఈ తరహాలో జిల్లా మొత్తానికి కూడా ఏడాది పొడవునా నీటి సరఫరాకు కేవలం 3.20టీఎంసీలు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. అందులో వెలిగొండ నుంచి 2టీఎంసీలు, రామతీర్థం నుంచి 0.75 టీఎంసీలు, గుండ్లకమ్మ నుంచి 0.50టీఎంసీలు అవసరంగా గుర్తించారు. ఆమేరకు నీటి లభ్యతకు ఏమాత్రం ఢోకా ఉండదని భావిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ పథకాలు పూర్తయ్యాక భూగర్భ జలాల వాడకం పూర్తిగా నిలిపేసే అవకాశాలు ఉన్నట్లు అధికారవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Updated Date - Jan 07 , 2025 | 01:15 AM