ఒంగోలు నగర శివారు ప్రాంతాలలో దొంగలు హల్‌చల్
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:51 PM
ఒంగోలు నగరంలో దొంగలు హల్‌చల్ చేశారు.గురువారంరాత్రి శివారు ప్రాంతాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు.

త్రోవగుంటలో చోరీ.. కొప్పోలు రోడ్డులో దొంగలు సంచారం
ఒంగోలు క్రైం,ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): నగరంలో దొంగలు హల్‌చల్ చేశారు.గురువారంరాత్రి శివారు ప్రాంతాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. కర్నూలురోడ్డులోని ఆంధ్రకేసరినగర్‌లో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి సుమారుగా రూ. 10 లక్షలు విలువైన సొత్తును అపహరించుకెళ్లారు. అదేవిధంగా త్రోవగుంటలోని అంబేడ్కర్ నగర్‌లో బొచ్చు అంజమ్మ ఇంటి తాళాలు పగులకొట్టి 4 సవర్లు బంగారం ఆభరణాలు అపహరించుకెళ్లారు. ఇదే విధంగా బుధవారం అర్ధరాత్రి ముగ్గురు దొంగలు కొప్పోలు రోడ్డులోని డ్రీమ్స్ నగర్‌లో హల్‌చల్ చేశారు. అయితే అక్కడ ఓ కారు రావడం చూసి దొంగలు పరారయ్యారు. శివారు ప్రాంతాలలో గస్తీ తగ్గడంతో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రకేసరి నగర్‌లో భారీ చోరీ
తాళం వేసి ఉన్న ఇళ్లే దొంగల టార్గెట్
రూ.10లక్షల విలువైన సొత్తు అపహరణ
ఇంటిని పరిశీలించిన సీఐ
ఒంగోలు క్రైం, ఫిబ్రవరి13(ఆంధజ్యోతి): తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడి సుమారు రూ.10 లక్షల విలువైన సొత్తును దొంగలు అపహరించుకుని వెళ్లారు. ఈ సంఘటన స్థానిక కర్నూలు రోడ్డులోని ఆంధ్రకేసరి నగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి తుమ్ముకూరి పాండురంగారావుకు ఆరోగ్యం బాగలేక భార్యతో కలిసి ఈ నెల 8న మార్కాపురంలో కుమార్తె వద్దకు వెళ్లారు. శుక్రవారం ఉదయం పక్క ఇంటి వారు పాండురంగారావుకు ఫోన్ చేసి ఇంటి తలుపులు పగలకొట్టి ఉన్నాయని చెప్పారు. దీంతో ఆయన వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం పెకలించి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు లోపల బీరువాను పగలకొట్టి సుమారు 20 సవర్లు బంగారు ఆభరణాలు, కిలో వెండి సామగ్రి, రూ.50 వేల నగదును అపహరించుకెళ్లారు. చోరీకి గురైన సొత్తు సుమారు పదిలక్షలు రూపాయల విలువ ఉండవచ్చని అంచనా. తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వగా వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో వెళ్లి ఆధారాలు సేకరించారు. ఇంటి పరిసరాలను సీఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో పరిశీలించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.