Share News

నాటి పాపాలకే నేటి శిక్షలు

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:35 AM

అధికార మదంతో నాడు వైసీపీ నేతలు చేసిన అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, పాపాలకు నేడు శిక్ష అనుభవిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు విమర్శించారు

నాటి పాపాలకే నేటి శిక్షలు

ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి (ఆంధ్రజ్యోతి) 14 : అధికార మదంతో నాడు వైసీపీ నేతలు చేసిన అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, పాపాలకు నేడు శిక్ష అనుభవిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు విమర్శించారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు వైసీపీ నాయకులు బరితెగింపు, రాజకీయాలు చేసి నేడు తగు మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. నాడు గన్నవరం ఎమ్మెల్యేగా వంశీ అనేక అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై పట్టపగలు రౌడీ మూకల్ని పంపిదాడి దాడి చేయించారన్నారు. అక్కడి టీడీపీ నేతల వాహనాలు తగుల బెట్టించడం దేశం మొత్తం చూసిందన్నారు. అయితే ఇది ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు కన్పించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రశేఖర్‌కు విషయ పరిజ్ఞానం తక్కువ, వితండవాదం ఎక్కువ అని విమర్శించారు. మైక్‌ ముందు నిల్చొని ఇష్టానుసారం మాట్లాడుతే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడితే అరెస్టు చేయరా..? అని ప్రశ్నించారు. పుల్లలచెరువు మండలంలో వైసీపీ నాయకుడు గడ్డం సుబ్బయ్య సిద్దన్నపాలెం గ్రామాన్ని తనపేరు మీద రిజిస్ట్రర్‌ చేయించుకొని బ్యాంక్‌లోతాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నాడన్నారు. ఇది ప్రశ్నించివారిని గ్రామం నుంచి వెలివేయించాడన్నారు. ఇలాంటి వ్యక్తిని అరెస్టు చేయకుండా, సన్మానాలు చేస్తారా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి కజ్జాకోరులు, రౌడీ మూకల్ని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ వెనుకేసుకోని రావడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కులం అడ్డుపెట్టుకొని రాజకీయాలుచేస్తారా..? అని ప్రశ్నించారు.

అభివృద్ధి కనిపించడం లేదా..?

కోట్లాదిరూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నా, మీడియాకు ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తప్పుడు ప్రకటనలిస్తున్నారని ఎరిక్షన్‌బాబు విమర్శించారు. ఎర్రగొండపాలెంలో సాయిబాబా మందిరం వరకు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు వేయించినట్లు తెలిపారు. ఆ రోడ్డు నుంచే నిత్యం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఇంటికి వెళుతున్నాడన్నారు. ఆ రోడ్డుపై తిరుగుతూనే రోడ్లు వేయలేదని ఎమ్మెల్యే ప్రచారం చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గం నుంచి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్‌ , ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆవాసం ఉండే వసతిగృహ భవనాల మర్మత్తులకు నిధులు మంజూరు చేయలేదేన్నారు. ఆయన ఇంటి పక్కనే ఎస్సీ హాస్టల్‌ ఉంటే నాడు ఆవైపు కన్నెత్తి చూడలేదన్నారు. పాఠశాలల అభివృద్ధి పేరుతో నాడు నేడు పథకంలో కోట్లు దండుకున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఎక్కడ రోడ్లపై తట్టెడు మట్టి పోయలేదని వీళ్లు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారన్నారు. దోర్నాలకు డిగ్రీ కళాశాల మంజూరైతే స్థలం మంజూరు చేయించలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దోర్నాల మార్కెట్‌ యార్డు స్థలాన్ని డిగ్రీ కళాశాలకు మంజూరు చేయించినట్లు తెలిపారు.

మెగా జాబ్‌మేళాతో యువతకు మేలు

వెనుకబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గ్రామాల్లో నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో ఎర్రగొండపాలెం కేంద్రంగా మెగా జాబ్‌ మేళాను ఏర్పాటు చేయించినట్లు టీడీపీ ఇన్‌చార్జ్‌ ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. ఎర్రగొండపాలెంలోని అంబేద్కర్‌, బాబుజగ్జీవన్‌రామ్‌ ఆడిటోరియంలో శుక్రవారం మెగా జాబ్‌ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి పర్యాయం జరిగిన జాబ్‌మేళాలో 160 మందికి ప్రవేటు కంపెనీ లలో ఉద్యోగాలు పొందారన్నారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించేందుకు భవిష్యత్‌లో ఎంత ఖర్చుఅయిన భరించి జాబ్‌ మేళాలు ఏర్పాటు చేయిస్తానన్నారు. జాబ్‌ మేళాలో ఇంటర్వూకు 270 హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ ఉపాధి కల్పనాధికారి రాజారావు, జేడీఏ శ్రీకాంత్‌, ఎర్రగొండపాలెం ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ ఎన్‌.మల్లిఖార్జుననాయుడు, ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎంఈవో ఆంజనేయులు, జవహర్‌నాలెడ్జ్‌ కో-ఆర్డినేటరు పి.ప్రదీప్‌, ఎర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పుల్లలచెరువు మండల టీడీపీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాదు, త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షులు మేకల వలరాజు, ద్వితీయశ్రేణి టీడీపీ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ గుమ్మా ఎల్లయ్య, వేగినాటి శ్రీను, బీవీ.సుబ్బారెడ్డి, మేడికొండ లక్ష్మినారాయణ, మెడబలిమి అచ్యుతరావు, కాకర్ల కోటయ్య, కాశికుంట సర్పంచి మంత్రునాయక్‌, మాజీ సర్పంచి సత్యనారాయణగౌడ్‌, ఆళ్ల నాసరరెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్‌ మస్తాన్‌వలి పాల్గొన్నారు. ప్రవేటు కంపెనీల మేనేజర్లు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:35 AM