Share News

నీరుగారిన తొట్ల లక్ష్యం

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:17 AM

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి వాటర్‌షెడ్లు, నీటితొట్లు నిర్మించారు.

నీరుగారిన తొట్ల లక్ష్యం

కంభం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి వాటర్‌షెడ్లు, నీటితొట్లు నిర్మించారు. దీంతో వేసవిలో మూగజీవాల దాహార్తి తీరింది. తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత నీటితొట్లను పట్టించుకోక పోవడం తో అనేక తొట్లు శిథిలావస్థకు చేరాయి. మరి కొన్ని దట్టంగా పెరిగిన చిల్లచెట్ల మధ్య మరుగున పడిపోయాయి. దీంతో లక్షలాధి రూపాయల ప్రజాధనం వృథా అయింది. మూగజీవాల కోసం నిర్మించిన తొట్లు వినియోగానికి దూరంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఏ ఒక్క తొట్టిలో కూడా నీరు నింపే దాఖలాలు లేవు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచే ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నిప్పులు చెరిగే ఎండలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు రోజురోజుకు పెరిగే కొద్ది కుంటలు, చెరువులు ఎండిపోయి బోర్లు అడుగంటే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో మూగజీవాల దాహం తీరేదెలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి టీడీపీ హయాంలో నిర్మించిన నీటితొట్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరాయి. దీంతో వేసవిలో మేతకు వెళ్లేమూగజీవాలకు నీరు దొరికే మార్గం కనిపించడం లేదు. కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలా ల్లోని అన్ని పంచాయతీలలో, గ్రామాలలో 800కు పైగా పశువుల నీటితొట్లు నిర్మించినా అవి శిథిలం కావడంతో నీటిని నిలువ చేసే మార్గం లేకుండా పోయింది. ఈ వేసవిలో నీటి తోట్లు లేకపోతే మూగజీవాలు విలవిలలాడతాయని పశుపోషకులు వాపోతున్నారు.

కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఎండ తీవ్రతను గుర్తించి పశువులకు తాగునీటి కల్పనపై దృష్టి సారించాలని పశుపోషకులు కోరుతు న్నారు. శిథిలావస్థలో ఉన్న తొట్లను బాగు చేయించాలని పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన చోట కొత్త నీటితొట్లను నిర్మించడమే కాకుండా, బోర్ల మరమ్మతులు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 01:17 AM