ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:43 AM
ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చిరంజీవి హెచ్చరించారు.

మార్కాపురం రూరల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చిరంజీవి హెచ్చరించారు. మండలంలోని రాయవరం గ్రామంలో తహసీల్దార్ చిరంజీవి ఆధ్వర్యంలో సోమ వారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి వచ్చిన భూ సమస్య లను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో ప్రజల భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలి పారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థాన ఈవో శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తర్లుపాడు : మండలంలోని పోతలపాడు గ్రామం లో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ భూములు దేవాలయాల భూమిగా చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు వివిధ భూసమస్యల పై అర్జీలు ఇచ్చారు. పోతలపాడు గ్రామానికి చెందిన సర్వే నెంబర్-34, 200, 24, 26, 29లో సుమారు 48 ఎకరాలు నిర్మమమేశ్వరుడి ఆలయ భూములుగా ఉండటంతో రైతులు అర్జీలను సమర్పించారు. కొన్నేళ్లుగా తమ పట్టా భూములు దేవుడి పేరుతో ఆన్‌లైన్‌లో ఉన్నా యని గాయం వెంకటరెడ్డి, రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి, రాచకొండ వెంకటయ్య, మెరుగు బాలగురవయ్య, బత్తుల గోపయ్య, ఆది లక్షమ్మ, కంచెర్ల జానకి రామయ్యలు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పోతలపాడులో ఎక్కువగా భూసమస్యలు ఉండడంతో 30 మంది వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఫత్తేపురంలో కూడా గతంలో జరిగిన రీసర్వేలో ఒకరి భూముల మరొకరి పేరుతో కొందరికి ఉన్న భూమి కంటే ఎక్కువగా మరికొందరికి తక్కువ భూములుగా ఉన్నట్లు పలు సమస్యలపై 17 అర్జీలను తహసీల్దార్ విజయ్‌భాస్కర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి అర్జీకి 45 రోజుల్లో పరిష్కారం చూపుతామన్నారు. దేవుడి పేరుతో ఉన్న భూములను మరలా రైతుల పేరుతో ఆన్‌లైన్ చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదికను పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రసీదులు ఇవ్వనంటూ సర్వేయర్ హడావుడి
భూ సమస్యలపై వచ్చే ప్రతి అర్జీకి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రతి అర్జీకి రసీదు ఇవ్వనంటూ పోతలపాడు గ్రామ సర్వేయర్ విష్ణు భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో అర్జీదారులు, సర్వేయర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. సర్వే సమస్యపై ఎక్కువగా అర్జీలు వస్తుండడంతో అర్జీలు ఇవ్వనని సర్వేయర్ చెప్పాడు. దీంతోపాటు దేవుడి పేరుతో ఉన్న భూమల అర్జీలకు రసీదు ఇవ్వనంటూ భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో వాగ్వాదం జరుగుతుండగా, రైతులు ఈ అంశాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కలగజేసుకొని, ప్రతి అర్జీకి కచ్చితంగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. గ్రామంలో సర్వేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, సచివాలయంలో కూడా సర్వేయర్ విష్ణు విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని తహసీల్దార్‌కు పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం రూరల్ : మండలంలోని బోయలపల్లి గ్రామంలో సోమవారం తహసీల్దారు ఏ బాల కిషోర్ ఆధ్వర్యంలో రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ఈ రెవిన్యూ సదస్సులో మొత్తం 12 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రజల, రైతుల సమస్యల పరిష్కారానికే గ్రామ రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ప్రజలు, రైతులు ఈ రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విఆర్వోలు ఓబయ్య, చెన్నయ్య, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.