శీనారెడ్డిపై కఠిన చర్యలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:28 AM
డ్వామా పీడీగా కె.శీనారెడ్డి పనిచేసిన కాలంలో జిల్లాలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకు బాధ్యుడైన శీనారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం లేఖ రాశారు.

ప్రభుత్వానికి సిఫారసుచేస్తూ కలెక్టర్ లేఖ
ఆయన కాలంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదిక
డ్వామాలో 70మందికిపైగా సిబ్బందిపై చర్యలకు పీడీకి ఆదేశం
ఒంగోలు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : డ్వామా పీడీగా కె.శీనారెడ్డి పనిచేసిన కాలంలో జిల్లాలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకు బాధ్యుడైన శీనారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం లేఖ రాశారు. అదేసమయంలో శీనారెడ్డి అక్రమాలలో భాగస్వాములైన, ఆయన ద్వారా లబ్ధిపొందిన డ్వామాలోని 70మందికిపైగా వివిధ స్థాయిల్లోని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పీడీ జోసఫ్‌కుమార్‌ను ఆమె ఆదేశించారు. శీనారెడ్డి కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నియమించిన పూర్వపు డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆయన హయాం.. అక్రమాల మయం
గత వైసీపీ పాలనలో నాలుగున్నరేళ్లపాటు డ్వామా పీడీగా శీనారెడ్డి పనిచేయగా, నాటి వైసీపీ ప్రజాప్రతినిధులకన్నా మిన్నగా అధికారపార్టీ నాయకుని వలే పెత్తనం చెలాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వనిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా డ్వామా కార్యకలాపాల్లో వ్యవహరించారు. తనకు ఇష్టమొచ్చిన వారిని అందలమెక్కిస్తూ, గిట్టని వారిని వేధింపులకు గురిచేయడంతోపాటు భారీగా అవినీతి, అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్‌తోపాటు, మరి కొందరు లిఖితపూర్వకంగా పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు. నాలుగు నెలల క్రితం తొలుత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆశించిన స్థాయిలో ఆ విచారణ సాగలేదని భావించిన ఫిర్యాదుదారులు మరోసారి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి డాక్టర్ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లు అటు సీఎంవోలోనూ, ఇటు ఉపముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో శీనారెడ్డి వ్యవహారంపై విచారణ చేసి, నివేదించాలని ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్‌కు నవంబరులోఆదేశాలుఅందాయి. తదనుగుణంగా అప్పటి ఎఫ్‌ఎస్‌వోగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎంవీ లోకేశ్వరరావు నేతృత్వంలో ఆడిట్ అధికారి శివనారాయణరెడ్డి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణలతో త్రిసభ్య కమిటీని నియమించారు. వారు రెండు నెలలపాటు డ్వామా కార్యాలయంలో అనేక ఫైళ్లను పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శీనారెడ్డిని, ప్రధాన ఫిర్యాదుదారుడైన ఈదర మోహన్, మరో నలుగురు ఫిర్యాదుదారులు, మరో 44 మంది వివిధ స్థాయిలలోని డ్వామా సిబ్బందిని ప్రత్యక్షంగా విచారించారు. మొత్తం 71 అంశాలు ఫిర్యాదుల్లో ఉండగా, అన్నింటినీ విచారించే ప్రయత్నం వారు చేశారు. కొన్ని ఫైళ్లు డ్వామా కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం, మరికొన్నింటిని ప్రస్తుత సిబ్బంది సక్రమంగా ఇవ్వకపోవడం వంటి ప్రతికూల పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు. చివరకు మొత్తం 70కిపైగా తమకు అందిన ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ 26 ముఖ్యమైన అంశాలలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తూ 110 పేజీల రిపోర్టును దానికిఅనుబంధంగా 2,193 పేజీల డాక్యుమెంట్లను కలెక్టర్‌కు అందజేసింది. వాటిలో శీనారెడ్డి అవినీతికి పాల్పడి లబ్ధిపొందడంతోపాటు, పెద్ద ఎత్తున ప్రజాదనం దుర్వినియోగం అయ్యేందుకు కారణమయ్యారని నివేదికలో పేర్కొన్నారు.
నిబంధనలు తుంగలో తొక్కి..
డ్వామాలో 2014-19 మధ్య ఫైనాన్స్ మేనేజరుగా కూడా పనిచేసిన శీనారెడ్డి అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన భార్య పేరుతో అద్దె వాహనాన్ని చూపించి నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు తీసుకున్నాడని తమ పరిశీలనలో గుర్తించినట్లు కమిటీ పేర్కొంది. 2019-24 మధ్య పీడీగా పనిచేసిన కాలంలో కొంతకాలం ఆయన వాహ నానికి నెలవారీ అద్దె రూ.45వేలు మాత్రమే తీసుకునే అవకాశం ఉండగా, రూ.60వేలు డ్రా చేసినట్లు పేర్కొంది. అలాగే కమిటీ గుర్తించిన మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. త్రిపురాంతకం మండలంలో రూ.3.18 కోట్లు సిబ్బంది స్వాహా చేశారని సామాజిక తనిఖీ బృందం గుర్తించి నివేదిక ఇస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా శీనారెడ్డి క్లీన్‌చిట్ ఇచ్చారు. వివిధ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయకుండానే చేసినట్లు చూపించి పెద్దఎత్తున ఉపాధి నిధులు స్వాహా చేశారని17మంది సిబ్బందిని రాష్ట్రస్థాయి తనిఖీ బృందాలు గుర్తించి సస్పెన్షన్‌కు సిఫారసు చేశాయి. అయితే అధికారుల అనుమతి లేకుండా కొద్దిరోజులకే వారిని తిరిగి ఉద్యోగాలలో శీనారెడ్డి నియమించారు. ఏపీవో సుభాషిణి, సుపరింటెండెంట్ పి.వెంకటస్వామిలను కలెక్టర్ అనుమతి లేకుండా ఏపీడీలుగా నియమించారు.
ఇష్టారాజ్యంగా బిల్లులు
దాసరి సురేష్ అనే కంప్యూటర్ ఆపరేటర్‌ను అర్హత లేని పోస్టులో నియమించగా జిల్లా మొత్తం డ్వామా కార్యకలాపాలను శీనారెడ్డి కాలంలో అతనే అజమాయిషీ చేశాడని పేర్కొన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ విధులకు హాజరుకాపోయినా ఆయనకు జీతాలు చెల్లింపు చేయగా, సుహారీ క్యాటరింగ్ అనే బోగస్ క్యాటరింగ్ ద్వారా డ్వామాకు సంబంధించిన పలురకాల బిల్లులు చెల్లించారు. ఒంగోలు సీఎల్‌ఆర్‌సీ టెండర్‌లలో రూ.10లక్షలను చిరుద్యోగి చల్లా శేషారావు బ్యాంకు నుంచి డ్రా చేయగా, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దోర్నాల మండలంలో ఒకే వ్యక్తి చేతి వేలిముద్రతో భారీగా దొంగ మస్టర్‌లు వేసి, ఉపాధి నిధులు తినేసినా శీనారెడ్డి పట్టించుకో లేదు.
అక్రమ డిప్యుటేషన్లు.. కోట్లల్లో స్వాహా
డ్వామా పీడీ కార్యాలయంలో అవసరానికి మించి భారీగా అక్రమ డిప్యుటేషన్‌లు వేయడంతోపాటు పలు మండలాల్లో సోషల్ ఆడిట్ బృందాలు కోట్లు రూపాయలలో అక్రమాలు జరిగినట్లు నివేదించిన వాటన్నింటిని రద్దుచేయడంతోపాటు లక్షలు స్వాహా చేసిన సిబ్బందికి రూ.500, రూ.3వేలు లోపు నామమాత్రపు ఫైన్లు వేసి, తిరిగి వారిని విధుల్లో నియమించారు. కొనకనమిట్ల మండలం ఏపీవోను దాదాపు రూ.51లక్షలు స్వాహా చేశారని సస్పెండ్ చేసి, నామ మాత్రం రికవరీ చేసి మళ్లీ అదే పోస్టులో నియమించారు. బ్యాంకు అకౌంట్‌లలో వివిధ పద్దుల కింద ఉన్న మొత్తాలకు సంబంధించిన వడ్డీ సొమ్మును పై అధికారుల అనుమతి లేకుండా తెప్పించి, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించారు. అలాగే ఒక బ్యాంకులో ఉన్న డిపాజిట్‌లను మరొక బ్యాంకుకు వ్యక్తిగత లబ్ధి కోసం ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బదలాయింపు చేశారని, అనేక మండలాల్లో ఎం బుక్‌లు ఏ ఒక్కటీ సక్రమంగా లేవని జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల పేరుతో చేసిన పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, వాటన్నింటిలోనూశీనారెడ్డి భాగస్వామ్యం ఉందని తేల్చారు.
కఠిన చర్యలకు సిఫారసు
ఇలాంటి అంశాలన్నింటినీ సమగ్రంగా తెలియజేస్తూ వాటికి కమిటీ ఇచ్చిన ఆధారాలను కూడా ఉటంకిస్తూ శీనారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ లేఖ రాశారు. అలాగే డ్వామాలో ఉద్యోగులుగా ఉండి, వివిధ అంశాలలో శీనారెడ్డితో భాగస్వామ్యం ఉన్నట్లుగా భావించడంతోపాటు ఆయన చేసిన, అవకతవకల ద్వారా లబ్ధిపొందిన 70 మందికిపైగా వివిధ స్థాయిలలోని డ్వామా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పీడీ జోసఫ్‌కుమార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అందులో ఒంగోలు ఇన్‌చార్జి ఏపీడీగా ఉన్న పీ.వెంకటస్వామి, టంగుటూరు ఏపీవో సుభాషిణి, డ్వామా పీడీ కార్యాలయంలో పనిచేస్తున్న దాసరి సురేష్, సాధనాల సురేష్ వంటి వారితోపాటు 12మంది ఏపీవోలు,మరో 50మందికిపైగా ఈసీలు, టీఏలు, ఇతరత్రా సిబ్బంది ఉన్నారు.