చందలూరులో ఆధ్యాత్మిక శోభ
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:54 PM
చందలూరు ప్రజలు శతాబ్దాలుగా కొలుస్తూ తమ ఆరాధ్య దైవంగా, ఇంటి ఇలవేల్పుగా భావించే మహాలక్ష్మి అమ్మవారి కొలుపు మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది.

వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి కొలుపు
వేలాదిగా పాల్గొన్న భక్తులు,
పంగులూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : చందలూరు ప్రజలు శతాబ్దాలుగా కొలుస్తూ తమ ఆరాధ్య దైవంగా, ఇంటి ఇలవేల్పుగా భావించే మహాలక్ష్మి అమ్మవారి కొలుపు మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. గురువారం అమ్మవారికి గొట్టిపాటి, కసుకుర్తి వంశస్తులు మోయనం సమర్పించారు. అమ్మవారికి వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గ్రామంలో జరిగిన అమ్మవారి గ్రామోత్సవంలో వేలాదిమంది పాల్గొని భక్తి పారవశ్యంతో పూలు, ఆకులు చల్లుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు. కొలువుదీరిన పురం నుంచి మేళతాళాలతో కదిలిన అమ్మవారి కొలుపు ఉత్సవంలో వేలాది మంది భక్తులు అమ్మవారికి అభిముఖంగా పురవీధులలో అడుగులో అడుగు వేస్తూ వెనుకకు నడిచిన తీరు అబ్బురపరిచింది. గ్రామంలో కిక్కిరిసిన జన సందోహంతో పగలు, రాత్రి కొనసాగుతున్న అమ్మవారి గ్రామోత్సవం, కోలాట ప్రదర్శన, ప్రత్యేక వాయిద్యాలతో రాత్రివేళ పురవీధులలో విద్యుత్ ప్రభ ఊరేగింపు, రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో సుందరంగా శోభిల్లుతున్న ప్రధాన ఆలయాలు, రాత్రివేళ కనువిందుచేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలతో చందలూరులో ఆధ్యాత్మిక సందడి నెలకుంది.
నేడు గ్రామంలో పాలవెల్లి మహోత్సవం
చందలూరులో జరిగే మహాలక్ష్మి అమ్మవారి కొలుపు ఉత్సవంలో 9వ రోజు జరిగే పాలవెళ్లి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమ్మవారిని బాల స్వరూపిణిగా అలంకరించి బాల మూల మంత్ర జపం చేసి 11 మంది ముత్తయిదువులకు పూలు, గంధం, కుంకుమ అర్పించి బాలభోగాన్ని నిర్వహించడం కార్యక్రమ ప్రత్యేకత. శుక్రవారం తెల్లవారుజామున బాలస్వరూపిణిగా కొలువుదీరిన అమ్మవారికి పొంగించిన పాలపై నెయ్యితో కలిపిన మధుర పదార్థాన్ని నివేదనగా సమర్పించిన అనంతరం 11 మంది ముత్తయిదువులకు పూలు, గంధం, కుంకుమ అర్పించి, పాలు, నెయ్యితో తయారు చేసిన మధుర పదార్థాన్ని భోజనంగా వడ్డిస్తారు. భాలభోగ కార్యక్రమ అనంతరం బాలాత్రిపుర సుందరి మూలమంత్రంతో శుక్రవారం ఉదయం గ్రామోత్సవం నిర్వహిస్తారు. బాల స్వరూపంతో అమ్మవారిని దర్శిస్తే గ్రహపీడలు తొలగిపోతాయని పురాణ కాలం నుంచి ప్రజల నమ్మకం. నేడు జరిగే ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరిస్తారని బ్రహ్మశ్రీ వేద మూర్తివర్యులు చల్లా సత్యనారాయణశాస్ర్తి తెలిపారు. ఈ ఉత్సవంలో సూర్య బలిజ వంశస్తులు నేతి కాగడాలు పట్టి ప్రజలకు శాంతి చేకూరాలని, గ్రామ సౌఖ్యాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేయడం పరిపాటి. శతాబ్దాల కిందట కొలువుదీరిన మహాలక్ష్మి అమ్మవారి కొలుపు మహోక్షత్సవంలో ప్రధాన ఘట్టం పాలవెళ్లి అనంతరం శనివారం గ్రామ పొంగళ్ల కార్యక్రమంతో ఉత్సవం ముగియనుంది.