ఊరట అంతంతే!
ABN , Publish Date - Mar 01 , 2025 | 01:49 AM
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. సూపర్ సిక్స్ పథకాలకు అగ్రతాంబూలం ఇచ్చారు. వాటి పరిధిలోకి వచ్చే అన్నింటికీ ఎక్కువ నిధులు కేటాయించారు. ప్రధానంగా రైతులు, మహిళలు, పేద వర్గాల ప్రయోజనమే లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకెళ్తోంది.
సంక్షేమానికి పెద్దపీట
రైతులు, పేదలకు సూపర్ సిక్స్ పథకాలతో భారీ లబ్ధి
వెలిగొండకు ఆశించిన స్థాయిలో లేని కేటాయింపులు
జలజీవన్, సూక్ష్మ సేద్యంకు ప్రాధాన్యం
దొనకొండ కారిడార్‌పై నమ్మకం
కేశవ్ బడ్జెట్‌పై జిల్లావాసుల్లో మిశ్రమ స్పందన
పెదవి విరుస్తున్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. సూపర్ సిక్స్ పథకాలకు అగ్రతాంబూలం ఇచ్చారు. వాటి పరిధిలోకి వచ్చే అన్నింటికీ ఎక్కువ నిధులు కేటాయించారు. ప్రధానంగా రైతులు, మహిళలు, పేద వర్గాల ప్రయోజనమే లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకెళ్తోంది. అయితే జిల్లాలో అత్యంత ప్రధానమైన వెలిగొండ ప్రాజెక్టుకు మాత్రం ఈ బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లభించలేదు. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈసారి నిధుల కేటాయింపు తగ్గింది. ఇతర ప్రాజెక్టులకీ పెద్దగా కేటాయింపులు కనిపించలేదు. రాష్ట్రంలో నాలుగు అభివృద్ధి కారిడార్లను గుర్తించగా అందులో దొనకొండ ఉంది. దీంతో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుపై ఆశలు రేకెత్తుతున్నాయి. తాజా బడ్జెట్‌పై జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి నాయకులు బ్రహ్మాండం అంటుండగా.. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెదవి విరుస్తున్నాయి.
ఒంగోలు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర (2025-26) వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే సంక్షేమ, అభివృద్ధి అంశాలతో జిల్లాకు భారీగానే లబ్ధి చేకూరనుంది. ప్రత్యేకించి సూపర్ సిక్స్ హామీల అమలు ద్వారా రైతులు, మహిళలు, ఇతర పేదవర్గాల్లోని లక్షలాది కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందనున్నాయి. అయితే జిల్లా ప్రజలు ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతవాసుల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో కేటాయింపులు లభించలేదు. మొత్తం సుమారు రూ.3.22 లక్షల కోట్లకుపైగా భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో ఇప్పటికే ఉన్న పింఛన్‌లు, దీపం, రేషన్ సరుకులు, గృహ నిర్మాణం, ఎన్టీఆర్ వైద్యసేవలు వంటి సంక్షేమ పథకాలను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల హామీలలో భాగంగా ప్రతి రైతుకు రూ.20వేల వంతున అన్నదాత సుఖీభవ, చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేల ప్రకారం తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాలకు నగదు జమ, మత్య్సకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.10వేల భృతి రూ20వేలకు పెంపు, ఎస్సీ,ఎస్టీలు, చేనేతపై ఆధారపడిన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, బీసీలకు వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా జిల్లాలోని ఆయా వర్గాల ప్రజలకు భారీగా లబ్ది అందనుంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతోపాటు విస్తారంగా మైక్రో ఇరిగేషన్ అమలు వల్ల జిల్లాలో ఆరకొర సాగునీటి వనరులతో అవస్థలు పడుతున్న రైతులకు మేలు చేకూరనుంది. జలజీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగించడంతో పాటు భారీగా రాష్ట్రవాటా నిధులను సమకూర్చుకునేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చూపడం జిల్లాలో నీటి కోసం అల్లాడుతున్న ప్రజానీకానికి ఊరట కలిగిస్తున్నాయి. దొనకొండ పారిశ్రామిక కారిడార్ విషయం బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించడం ఉపశమనం కలిగిస్తోంది.
వెలిగొండకు నిరాశే
బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవు. కేవలం రూ.309 కోట్లను మాత్రమే కేటాయించారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో రూ.వెయ్యి కోట్లు కేటాయించి రూ.850 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. చివరి ఏడాది అయిన 2023-24 లో ఆ ప్రభుత్వం అతి తక్కువగా రూ.101 కోట్లు కేటాయించి కేవలం రూ.26 కోట్లు మాత్రమే వెచ్చించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. 2024-25 బడ్జెట్‌లో సుమారు రూ.393.49 కోట్లు కేటాయించింది. అందులో పనుల కోసం సుమారు రూ.248 కోట్లు కేటాయించగా రూ.250కోట్లకుపైగా ఖర్చు చేశారు. దీంతో 2025-26 బడ్జెట్‌లో కేటాయింపులు భారీ ఉంటాయని, 2026 జూన్‌కు నీరు ఇస్తామన్న సంకేతాలు ప్రభుత్వ పెద్దలు ఇచ్చారు. అలా నీరు ఇవ్వాలంటే నిర్వాసితులకు కనీసం రూ.800 కోట్లు, పనుల కోసం రూ.300 నుంచి రూ.400 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.
ఇలాగైతే పనులు ముందుకెలా?
వెలిగొండకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని ప్రజలు ఆశించారు. కానీ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు అన్ని వర్గాలను నిరాశపరిచింది. కేవలం రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్ కన్నా కూడా దాదాపు 25శాతం నిధులు తగ్గించి వేశారు. నిర్వాశితులకు గత బడ్జెట్‌లో కేటాయింపు చూపి ఖర్చుచేయని రూ.80 కోట్లు చూపించగా పనుల కోసం రూ.191 కోట్లు కేటాయించారు. అంత పెద్ద ప్రాజెక్టుకు కీలకమైన ప్రస్తుత తరుణంలో ఇంత తక్కువగా నిధులు కేటాయిస్తే పనులు ఎలా ముందుకు సాగుతాయి, నిర్దేశిత కాలంలో నీరు ఎలా ఇవ్వగలరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ.13 కోట్లు కేటాయించగా ఈసారి రూ.15.50 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోని కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి గత బడ్జెట్‌లో రూ.1.50 కోట్లు మాత్రమే కేటాయించగా ఈ సారి రూ.8.65 కోట్లకు పెంచారు.
గతేడాది కన్నా తక్కువే
పాలేరు రిజర్వాయర్‌కు ఏమాత్రం కేటాయింపులు లేకపోగా మధ్యతరహా ప్రాజెక్టులైన రాళ్లపాడు, మోపాడు, కంభం ట్యాంకులు, ఒంగోలు సీఈ పరిధిలో ఉన్న పోతురాజు కాలువ అభివృద్ధి పనులకు నిధుల ఊసే కనిపించలేదు. మొత్తం ఇక్కడి సీఈ పరిధిలో బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కోరుతూ అధికారులు నివేదించగా ఇంచుమించు రూ.1,100 కోట్లు కేటాయింపు అవకాశం ఉన్నట్లు సంకేతాలు తొలుత అందాయి. కానీ బడ్జెట్‌లో రూ.507.16 కోట్లు మాత్రమే ఇచ్చారు. అందులోనూ సాగర్ కుడికాలువ మొత్తం, అలాగే ఎడమ కాలువ పరిధిలోని రాష్ట్రంలో ఉన్న ప్రాంత పర్యవేక్షణ ఇక్కడి సీఈ పరిధిలోనే ఉండగా వాటికి సంబంధించి కేటాయింపు రూ.137 కోట్లు మాత్రమే ఉంది. ఉమ్మడి జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ, కొరిశపాడు ఎత్తిపోతల ఇతరత్రా అన్నింటికి కలిపి రూ.369 కోట్లు మాత్రమే కేటాయించారు. అదే గతేడాది రూ.441.14 కోట్లు కేటాయింపు చేశారు.