రెవెన్యూ దందా..!
ABN , Publish Date - Mar 04 , 2025 | 11:03 PM
సంతనూతలపాడు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయింది. ముఖ్యంగా భూములకు సంబంధించిన వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండుతోంది. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాముళ్లు ఇవ్వకపోతే దరఖాస్తులకు ఏదో రూపంలో కొర్రీలు వేస్తున్నారు.
సంతనూతలపాడు మండల కార్యాలయంలో ప్రతి పనికీ మాముళ్లు
కాసులు పంట పండిస్తున్న భూవ్యవహారాలు
ఇవ్వకపోతే దరఖాస్తులకు కొర్రీలు
విమర్శలు వెల్లువెత్తుతున్నా తీరుమారని వైనం
పొజిషన్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కారును అడ్డుకున్న బాధితుడు
సంతనూతలపాడు, మార్చి 4(ఆంధ్రజ్యోతి) : సంతనూతలపాడు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయింది. ముఖ్యంగా భూములకు సంబంధించిన వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండుతోంది. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాముళ్లు ఇవ్వకపోతే దరఖాస్తులకు ఏదో రూపంలో కొర్రీలు వేస్తున్నారు.
ఎకరా భూమి ఆన్‌లైన్ చేయాలంటే రూ.40 వేల వరకు వసూలు
బ్యాంకుల నుంచి పంట రుణాలు, రైతు భరోసా, రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందాలంటే పట్టాదారు పాసుపుస్తకంతోపాటు ఆయా భూముల వివరాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదై ఉండాలి. భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు, వారసత్వంగా వచ్చిన భూమి, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకం జరిగిన భూములను వారి పేర్ల మీద ఆన్‌లైన్ చేయడానికి ఎకరాకు కనిష్టంగా రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పైగా వసూలు చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.
డబ్బు ఇవ్వకపోతే ప్రదక్షిణలే
రెవెన్యూ సిబ్బంది అడిగినంత మొత్తం ఇవ్వలేకపోతే వారిని నెలలు తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. ఇక కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమపథకాల దరఖాస్తులకు నిర్ణీత రేట్లను నిర్ధారించి వసూలు చేస్తున్నారు. కిందిస్థాయి నుంచి వసూళ్లపర్వాన్ని నడిపిస్తున్నారు. అధికారపార్టీ నేతలే మాముళ్లు సమర్పించుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కార్యాలయంలో జరిగిన సంఘటనే అవినీతికి దర్పణం
ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం జరిగిన సంఘటనే అవినీతికి దర్పణం పడుతోంది. పేర్నమిట్టకు చెందిన తుళ్లూరు సుభాషిణి భర్త బాబూరావు అలియాస్ బోసుబాబు గత జనవరి 30 నుంచి మార్చి 4వ తేదీ వరకు తన స్థలానికి పొజిషన్ ధ్రువీకరణ పత్రం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరుచేయలేదు. తహసీల్దార్‌కు మళ్లీ అర్జీని ఇవ్వబోయినా తీసుకోలేదు. విసిగిపోయిన అతను తహసీల్దార్ కారుకు అడ్డుగా నిరసన తెలిపారు. చివరకు పోలీసుల చేత అతనిని ఆందోళనను నిలిపివేయించారు. ఒక వ్యక్తికి పొజిషన్ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం కోసం దాదాపు నెలరోజులు తిప్పుకోవడం గమనార్హం.
ఐవీఆర్‌ఎస్ సర్వే చేపడుతున్నా లెక్కలేదు
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పలు శాఖల పనితీరుకు సంబంధించి ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తూ అధికారుల పనితీరుపై ప్రజల నుంచి సర్వే చేపట్టింది. తద్వారా వచ్చిన రిపోర్టు సేకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామనుకుంటుంటే సంతనూతలపాడు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది మాత్రం ఏసర్వే అయితే మాకేంటి అనుకుంటూ వసూళ్లలో మాత్రం వెనుకడుగు వేయడం లేదని విమర్శలు వినపడుతున్నాయి.