ఏఎంసీ పాలక మండళ్ల రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:55 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేసినట్లు తెలిసింది. జిల్లాస్థాయిలో ఏకాభి ప్రాయం కుదరకపోవడం, ఇతర రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు ప్రక్రియను పూర్తిచేసినట్లు సమాచారం.
లోక్‌సభ నియోజకవర్గం యూనిట్‌గా రాష్ట్రస్థాయిలోనే ప్రక్రియ పూర్తి
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేసినట్లు తెలిసింది. జిల్లాస్థాయిలో ఏకాభి ప్రాయం కుదరకపోవడం, ఇతర రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు ప్రక్రియను పూర్తిచేసినట్లు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని.. ఆ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సామాజికవర్గాలను, ఏఎంసీల పరిధిలో ఉండే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లకు తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. తొలుత కలెక్టర్, ఆ తర్వాత ఇన్‌చార్జి మంత్రి జోక్యం చేసుకొన్నప్పటికీ జిల్లాలో రిజర్వేషన్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. అయినప్పటికీ ఒకట్రెండు స్థానాలు మినహా మిగిలిన వాటికి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఒక జాబితాను రూపొందించారు. అయితే ఈలోపు రాష్ట్రస్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేసి జిల్లాకు సమాచారం పంపుతు న్నారు. నేడో రేపో ఆ మేరకు ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఏఎంసీల రిజర్వేషన్‌ల జాబితా కలెక్టర్‌కు అందనుంది. అందిన సమాచారం మేరకు.. ఒంగోలు ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. గిద్దలూరు బీసీ జనరల్‌కు, కొండపి బీసీ మహిళకు, పొదిలి బీసీ మైనార్టీకి, కంభం ఎస్టీ మహిళకు రిజర్వు చేసినట్లు తెలిసింది. దర్శి, కనిగిరి ఏఎంసీ చైర్మన్ పదవులను జనరల్ మహిళకు, ఎర్రగొండపాలెం, మార్కాపురం ఏఎంసీ చైర్మన్ పదవులను జనరల్ కేటగిరీకి రిజర్వు చేసినట్లు సమాచారం. సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు ఏఎంసీని బాపట్ల లోక్‌సభ కింద రూపొందించిన రిజర్వేషన్‌ల జాబితాలో చేర్చారు. మద్దిపాడు ఓసీ జనరల్, అద్దంకి ఎస్సీ జనరల్, సంతమాగులూరు జనరల్, పర్చూరు జనరల్ మహిళ, చీరాల బీసీకి కేటాయించినట్లు తెలిసింది.