Share News

వైసీపీ పాలనలో రేషన్‌ మాఫియా

ABN , Publish Date - Mar 06 , 2025 | 11:48 PM

ఐదేళ్ల వైసీపీ పాలనలో రేషన్‌ బియ్యం మాఫియా భారీగా పేదల బియ్యాన్ని దోపిడీ చేసిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ధ్వజమెత్తారు. ఆ కాలంలో జరిగిన బియ్యం మాఫియా అక్రమాలపై ప్రభుత్వం నియమించిన సిట్‌ తమ విచారణను వేగవంతం చేసి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వైసీపీ పాలనలో రేషన్‌ మాఫియా
అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనార్దన్‌, అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉగ్ర

సిట్‌ విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే జనార్దన్‌ డిమాండ్‌

బాధితులకు భూపరిహారం అందజేయాలి

ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

ఒంగోలు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి)/కనిగిరి: ఐదేళ్ల వైసీపీ పాలనలో రేషన్‌ బియ్యం మాఫియా భారీగా పేదల బియ్యాన్ని దోపిడీ చేసిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ధ్వజమెత్తారు. ఆ కాలంలో జరిగిన బియ్యం మాఫియా అక్రమాలపై ప్రభుత్వం నియమించిన సిట్‌ తమ విచారణను వేగవంతం చేసి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై ఎమ్మెల్యే జనార్దన్‌ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 50లక్షల టన్నుల బియ్యం రైతుల దగ్గర తీసుకొని పంపిణీ చేస్తే తిరిగి 30లక్షల టన్నులు రీసైక్లింగ్‌ అయ్యేవన్నారు. అప్పట్లో ఎఫ్‌సీఐ గోడౌన్లలో బస్తాకు రూ.5 అద్దె ఉంటే ప్రైవేటు గోడౌన్లలో రూ.4.25 అని అక్కడ నిల్వ ఉంచితే ఆ మాఫియా వేల టన్నుల బియ్యాన్ని మాయం చేశారన్నారు. కాకినాడ, మచిలీపట్నంలతోపాటు కర్నూలు, కోనసీమ, బాపట్ల తదితర జిల్లాల్లో ఇలా ఎక్కువగా జరిగాయని చెప్పారు. కాకినాడలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌లు తనిఖీ సందర్భంగా సుమారు 1,320 టన్నులు అక్రమంగా ఉన్న విషయం బయట పడిందని గుర్తుచేశారు. ఆ సమయంలో అధికారులు సైతం మంత్రులకు సహకరించలేదన్నారు. సిట్‌ విచారణను వేగవంతం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హైవే బాధితులను ఆదుకోవాలి

బాధితులకు భూ పరిహారం అందజేసి కనిగిరి ప్రాంతంపై ప్రాధాన్యత చూపాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి ప్రాంతం అభివృద్ధి, బాధితులకు పరిహారం కోరుతూ గురువారం అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. కనిగిరి ప్రాంతంలో వివిధ రోడ్లు, రైల్వేలైన్‌ ఏర్పాటులో భాగంగా ఎంతోమంది తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కని గిరి నియోజకవర్గంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు సాగేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. మైదుకూరు-సింగరాయకొండ 167బీ హైవే రోడ్డుకు భూసేకరణ సమయంలో జీరో అవార్డు ఇచ్చారన్నారు. వాస్తవంగా అక్కడ పట్టాదారులు ఉన్నారన్నారు. యజమానులకు భూపరిహారం అందజేయలేదన్నారు. దీంతో పట్టాదారులు అంగీకరించకపోవటంతో రోడ్డు పనులకు ఇబ్బందిగా మారిందన్నారు. అలాగే, బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో గుంతచెన్నంపల్లిలో కూడా ఇదేవిధంగా రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో అక్కడ కూడా నిర్మాణానికి ఆటంక ఏర్పడిందన్నారు. ఏర్పేడు-హైదరాబాద్‌ 565 హైవే బైపాస్‌ రోడ్డుకు సంబంధించి 2014లో టెండర్‌ పిలిచినట్టు గుర్తుచేశారు. ఇక్కడ కూడా పట్టాదారులకు పరిహారం చెల్లించకపోవటంతో అదే పరిస్థితి నెలకొందన్నారు. ఊళ్ళపాలెం-వేములపాడు (ఓవీరోడ్డు)కు 2021లో టెండర్‌ పిలిచినా ఇంతవరకు భూసేకరణ చేపట్టలేదన్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్‌ ముందుకు రావటంతో బాధితుల అడ్డుకుంటున్నారన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గంలో కనిగిరి మండలంలోని పేరంగుడిపల్లి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టేందుకు అక్కడ ఏడు గృహాలు ఉన్నప్పటికి నిర్మాణాలు లేవని రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదిక అందించారని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర పేర్కొన్నారు. భూపరిహారం అందకపోవడంతో బాధితులు పనులను అడ్డుకుంటున్నారన్నారు. పరిహారం అందించకపోతే రోడ్లు, రైల్వే పనులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ మంత్రులు తగిన చొరవ చూపి కనిగిరి ప్రాంత బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర కోరారు.

Updated Date - Mar 06 , 2025 | 11:48 PM