పొగాకు కొనుగోళ్లకు సన్నాహాలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:42 AM
దక్షిణాది ప్రాంతంలో ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేనెల తొలివారంలో వేలం కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈనెల 25న గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో జరుగనున్న పాలకమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వచ్చేనెల తొలివారంలో వేలం ప్రారంభించే అవకాశం
25న బోర్డు పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం
దక్షిణాదిలో భారీగా పెరిగిన సాగు
ఒంగోలు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): దక్షిణాది ప్రాంతంలో ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేనెల తొలివారంలో వేలం కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈనెల 25న గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో జరుగనున్న పాలకమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో పొగాకు మార్కెట్‌కు దిక్సూచిగా ఉండే కర్ణాటకలో ధరలు బాగున్నా మార్కెట్ మందకొడిగా సాగుతోంది. ఇంకా దాదాపు 40శాతం వరకు పొగాకు అక్కడి రైతుల వద్దనే ఉంది. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతాల్లోని వేలం కేంద్రాలలో త్వరితగతిని కొనుగోళ్లను చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్ వస్తుండటంతో ఆ వైపు బోర్డు అధికారులు దృష్టి సారించారు.
అధికంగా సాగు, ఉత్పత్తి
ఒంగోలు కేంద్రంగా ఉన్న పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంత రెండు రీజియన్ల పరిధిలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 11 వేలం కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుత సీజన్ (2024-25)కు సుమారు 64 వేల హెక్టార్లలో పంటసాగు, 105 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. అదే గతేడాది 59వేల హెక్టార్లలో సాగుకు, 89 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇచ్చారు. ఆ ప్రకారం గత ఏడాది కన్నా 5వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం, 16 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అధికంగా బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతోపాటు ఈ సీజన్‌లో పంట సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. పంట ఉత్పత్తి కూడా అదేస్థాయిలో అధికంగా వచ్చింది. బోర్డు అధికార వర్గాల అంచనా ప్రకారం దక్షిణాదిలో ప్రస్తుత సీజన్‌లో సుమారు 89 వేల హెక్టార్లలో పంట సాగు కాగా దాదాపు 161 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి కానుందని అంచనా. అంటే పొగాకు బోర్డు అనుమతించిన దానికన్నా సుమారు 25వేల హెక్టార్లలో అధికంగా సాగు జరగ్గా 56 మిలియన్ కిలోలు అధికంగా పంట ఉత్పత్తి రానుంది. ఈ పంట మొత్తం అమ్మకాలు జరగాలంటే దాదాపు ఏడెనిమిది నెలలు పట్టే అవకాశం ఉంది.
వేలంను త్వరగా ప్రారంభించాలి
కర్ణాటకలో ప్రస్తుత సీజన్‌లో 100 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా కాగా ఇప్పటివరకు 60 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది. గరిష్ఠ ధర కిలో రూ.337 పలుకుతున్న మార్కెట్ మాత్రం స్పీడ్‌గా లేదు. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో వీలైనంత త్వరగా కొనుగోళ్లు ప్రారంభిస్తేనే ఈ ఏడాది చివరి వరకు వేలం ప్రక్రియ కొనసాగుతుంది. ఇదేవిషయాన్ని పలువురు రైతు ప్రతినిధులు బోర్డు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు దాదాపు ఎనిమిదేళ్ల నుంచి బోర్డు ఈడీగా కొనసాగుతున్న అద్దంకి శ్రీధర్‌బాబు మార్చి 11న ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించనున్నారు. ఆతర్వాత సీజన్ కొనుగోళ్లను ప్రారంభించాలన్న ఆలోచన కూడా అటు అధికారులు, ఇటు రైతు ప్రతినిధులు నుంచి వచ్చింది. దీంతో వచ్చేనెల తొలివారంలో వేలంకేంద్రాలు ప్రారంభించడం మంచిదన్న అభిప్రాయం ఎక్కువమంది వ్యక్తం చేస్తుండటంతో బోర్డు అధికారులు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు ప్రధాన అజెండాగా ఈనెల 25న పొగాకు బోర్డు సమావేశం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో జరుగనుంది.