జనరంజకం.. ఉల్లాసభరితం
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:37 PM
ఒంగోలు పీవీఆర్ మునిసిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యక్రమాలు జనరంజకంగా కొనసాగుతున్నాయి. నిత్యం విభిన్న అంశాలతో ఏర్పాటుచేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం కార్యక్రమాలలో భాగంగా సాయంత్రం టంగుటూరుకు చెందిన టంగుటూరు రాంబాబు బృందంచే నాదస్వర కచ్చేరి ఆకట్టుకుంది.

అలరించిన మహిళల కోలాటం
సందేశాత్మకంగా విద్యార్థుల ప్రదర్శనలు
చిత్రలేఖన పోటీలో పాల్గొన్న చిన్నారులు
రైతు భారతాన్ని ఆవిష్కరించిన చిన్నారులు
ఒంగోలు కల్చరల్, జనవరి 25(ఆంధ్రజ్యోతి) : ఒంగోలు పీవీఆర్ మునిసిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యక్రమాలు జనరంజకంగా కొనసాగుతున్నాయి. నిత్యం విభిన్న అంశాలతో ఏర్పాటుచేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం కార్యక్రమాలలో భాగంగా సాయంత్రం టంగుటూరుకు చెందిన టంగుటూరు రాంబాబు బృందంచే నాదస్వర కచ్చేరి ఆకట్టుకుంది.
సాంకేతికత అభివృద్ధికి తోడ్పడాలి
సాంకేతిక పరిజ్ఞానం మనిషి, సమాజ అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలే తప్ప వినాశనానికి దారితీయకూడదని చాటిచెప్పే విధంగా స్థానిక నారాయణ పబ్లిక్ స్కూలు, గాయత్రి గ్రామర్ స్కూలు విద్యార్థులు ప్రదర్శించిన నాటిక విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుత పరిస్థితులలో చిన్న వయసు నుంచే ఏవిధంగా సెల్‌ఫోన్‌కు బానిస అవుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఏవిధమైన అనర్థాలు జరుగుతున్నాయి అనే అంశాన్ని విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. సాంకేతిక పరిజ్ఞానం అవసరమే కానీ దానిని మంచిమార్గంలో ఉపయోగించుకోవాలనే సందేశంతో ఈ నాటిక ప్రదర్శితమైంది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి.
కళాపరిషత్ కార్యక్రమాలలో భాగంగా విశాఖపట్నానికి చెందిన తెలుగు కళా సమితి కళాకారులచే నిశ్శబ్దమా నీ ఖరీదెంత సాంఘిక నాటిక ప్రదర్శితమైంది. పి.టి.మాధవ్ రచించగా చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ నాటికలో నటీనటులు తమ పాత్రలకు అనుగుణంగా చక్కటి హావభావాలను ప్రదర్శించి మెప్పించారు.
నగరానికి చెందిన పలువురు విద్యార్థులు కళాపరిషత్ ప్రాంగణంలో రైతు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. రైతు భారతాన్ని ఆవిష్కరిస్తూ గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా వారు ఈ ప్రదర్శన నిర్వహించారు.
అదేవిధంగా నిత్యం జరిగే చర్చాగోష్టిలో భాగంగా పర్యావరణ రహిత ఒంగోలు అనే అంశంపై స్వల్పకాలిక చర్చను ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు నిర్వహించగా ఈ చర్చలో పలువురు మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని పర్యావరణాన్ని కాపాడటానికి కృషిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా శనివారం ఉదయం నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో పెద్దసంఖ్యలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు పర్యవేక్షించి, ప్రదర్శన సంస్థలకు ప్రదర్శనా పారితోషికం, జ్ఞాపికలను బహూకరించారు.