రామతీర్థం సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:25 AM
పెరుగుతున్న నీటి అవసరాలకు అనుగుణంగా రామతీర్థం ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం పెంపు కోసం ప్రణాళికలు రూపొందించాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ జలవనరులశాఖ అఽధికారులను కోరారు.

జలవనరుల శాఖ అధికారులతో బీఎన్ భేటీ
గుండ్లకమ్మలో చెక్‌డ్యాంలు, ఇతర పనులపై సమీక్ష
ఒంగోలు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : పెరుగుతున్న నీటి అవసరాలకు అనుగుణంగా రామతీర్థం ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం పెంపు కోసం ప్రణాళికలు రూపొందించాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ జలవనరులశాఖ అఽధికారులను కోరారు. నియోజకవర్గంలో జలవనరులశాఖ పరిధిలో ఉన్న రామతీర్థం రిజర్వాయర్, ఎన్‌ఎస్‌పీ ఆయకట్టు కాలువలు, గుండ్లకమ్మలో చెక్‌డ్యాంల నిర్మాణాల ప్రతిపాదనలపై స్థానిక మంగమూరురోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం ఆ శాఖ అధికారులతో ఆయన సమావేశమై చర్చించారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ వరలక్ష్మి, డిప్యూటీ ఎస్‌ఈ రామకృష్ణ ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రామతీర్థం ప్రాజెక్టుకు దిగువన ఉన్న 70వేల ఎకరాల ఎన్‌ఎస్‌పీ ఆయకట్టు స్థిరీకరణ, ఒంగోలు ఎస్‌ఎస్ ట్యాంకుతోపాటు ఇతర గ్రామాల్లోని తాగునీటి చెరువులను పరిగణనలోని తీసుకొని 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎన్ తెలిపారు. అనంతర కాలంలో కందుకూరుతోపాటు కనిగిరి, తాళ్లూరు, కొండపి, ప్రాంతాలు.. కేవీపాలెం తాగునీటి పథకాలకు రామతీర్థం నుంచి నీటిని ఇచ్చేలా ఏర్పాటు చేశారని చెప్పారు. దీనికితోడు రిజర్వాయర్‌లో పూడిక కూడా రావడంతో నిల్వ కొంత తగ్గిందన్నారు. దీంతో రామతీర్థం అసలు ఉద్దేశమైన సాగర్ ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం నెరవేరడం లేదన్న అభిప్రాయాన్ని అధికారుల ఎదుట బీఎన్ వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రామతీర్థం సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.50 టీఎంసీలకు అదనంగా మరోక టీఎంసీ పెంచి 2.50 టీఎంసీల నిల్వ చేసేలా ప్రతిపాదనలు రూపొందించారన్న ఎమ్మెల్యే బీఎన్ తాజా అంచనాల ప్రకారం ఆ నివేదికను సిద్ధం చేయాలని సూచించారు.
సాగర్ కాలువల పరిస్థితిపై చర్చ
ఎన్‌ఎస్‌పీ చీమకుర్తి డివిజన్ పరిధిలో కాలువలు పలుచోట్ల అధ్వానంగా ఉండి నీరు పారుదల సక్రమంగా లేకపోవడంపై ఎమ్మెల్యే విజయకుమార్ అధికారులతో చర్చించారు. ఈ డివిజన్‌లో వచ్చే ఏడాది నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా అత్యవసరం కింద రూ.7.50 కోట్లతో పనులను ప్రతిపాదించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే గుండ్లకమ్మలో ప్రాజెక్టు దిగువ భాగంలో కీర్తిపాడు, చీర్వానుప్పలపాడుల వద్ద ప్రతిపాదించిన చెక్‌డ్యాంల నిర్మాణ ప్రతిపాదనలపై కూడా ఈ భేటీలో చర్చించారు. మద్దిరాలపాడు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిపై హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వాటి విషయంలో గతంలోనే ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు నివేదించగా పలు వివరణలు కోరారని, వాటిపై కూడా సమగ్ర రిపోర్టు పంపినట్లు ఎస్‌ఈ వరలక్ష్మి తెలిపారు.