రీసర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Jan 21 , 2025 | 01:50 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రీసర్వేతో గ్రామాలలో భూసమస్యలకు శాశ్వత పరిష్కరం లభిస్తుందని తహసీల్దార్ పులి శైలేంద్రకుమార్ అన్నారు.
పెద్దారవీడు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రీసర్వేతో గ్రామాలలో భూసమస్యలకు శాశ్వత పరిష్కరం లభిస్తుందని తహసీల్దార్ పులి శైలేంద్రకుమార్ అన్నారు. మండలంలోని ప్రగళ్లపాడులో సోమవారం రీసర్వేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శైలేంద్రకుమార్ మాట్లాడుతూ గతంలో జరిగిన సర్వే మొక్కుబడిగా సాగిందన్నారు. ప్రస్తుతం రైతుల సమక్షంలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా సర్వే చేస్తున్నామన్నారు. ప్రగళ్లపాడులో మొత్తం 148 సర్వే నెంబర్లలో 1804 ఎకరాల భూమిని సర్వే చేయనున్నట్లు తెలిపారు. సర్వేయర్లు, వీఆర్వోలు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి 60 రోజుల వ్యవధిలో సర్వే పూర్తిచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గోపి, సర్వేయర్ గోపాల్‌రెడ్డి, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
చిన్నదోర్నాలలో రీసర్వే ప్రారంభం
పెద్దదోర్నాల : మండలంలోని చిన్న దోర్నాలలో రెవిన్యూ అధికారులు భూముల రీ సర్వే సోమవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా తహసీల్దారు కిన్నెర శాంతి మాట్లాడుతూ రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాధారు పాసుపుస్తకాలు, ఆధారు కార్డు తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహసీల్ధారు సాలమ్మ, ఆర్‌ఐ ప్రసాద్, వీఆర్వో రాణి, సర్వేయరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.