ఆశ్రమాలకు ఆదరణ
ABN , Publish Date - Mar 02 , 2025 | 10:37 PM
నేటి ఆధునిక యుగంలో వృద్ధాశ్రమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వీటిని స్థాపించారు. కొన్నిచోట్ల పూర్తి సేవాభావంతో వృద్ధాశ్రమాలను నిర్వహిస్తుండగా, ఇంకొన్నిచోట్ల నెలనెలా కొంత నగదు తీసుకుని వృద్ధులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
వృద్ధులకు ఎంతో ఆసరాగా ఉంటున్న వైనం
ప్రస్తుత కాలంలో వృద్ధాశ్రమాలకు పెరుగుతున్న పండుటాకుల సంఖ్య
సమయానికి అన్నీసమకూరుస్తుండడంతో ఆనందంగా గడుపుతున్న వయసు మళ్లిన వారు
చీరాల, మార్చి2 (ఆంధ్రజ్యోతి) : నేటి ఆధునిక యుగంలో వృద్ధాశ్రమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వీటిని స్థాపించారు. కొన్నిచోట్ల పూర్తి సేవాభావంతో వృద్ధాశ్రమాలను నిర్వహిస్తుండగా, ఇంకొన్నిచోట్ల నెలనెలా కొంత నగదు తీసుకుని వృద్ధులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అయితే ఒక్కో కుటుంబానికి ఒక్కో కారణం ఉంటుంది.. ఒక్కో గాథ ఉంటుంది.. ఒక్కో బాధ ఉంటుంది.. ఇంకొందరికి తల్లిదండ్రులపై ప్రేమ ఉన్నా దగ్గరకు చేరదీసే వీలు ఉండదు.. ఇలా రకరకాల వారు నేటి సమాజంలో పెరిగిపోతున్నారు.
గణనీయంగా పెరుగుతున్న వృద్ధాశ్రమాలు
వయోప్రాయంలో ఉన్న తల్లిదండ్రులు కొందరికి తప్పక, మరి కొందరికి భారంగా భావించి ఒంటరిగా వదిలేయడమో లేక ఆశ్రమాల్లో చేర్చడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వృద్ధాశ్రమాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. కని, అల్లారు ముద్దులా పెంచి ప్రయోజకుల్ని చేస్తుంటే, వయోప్రాయంలో ఉన్న తల్లిదండ్రుల యోగక్షేమాలు, ఆలనాపాలనా చూడాల్సిందిపోయి, గాలికి వదిలి ఒక్కసారిగా తెగిన గాలిపటంలా ఏకాకుల్ని చేసి ఆశ్రమాల్లోకి పంపుతున్నారు. యోగ క్షేమాలు చూసేవారు లేక ఆశ్రమాల్లో చేరితే ఫర్వాలేదు గానీ, అన్ని ఉండి, అందరూ ఉండి కూడా ఆశ్రమాల్లో ఏకాకులవుతున్న వారి పరిస్థితి దయనీయం. ఈ క్రమంలో అనాథల్లా ఉన్న వృద్ధులకు ఆశ్రమాలు నీడ నివ్వడం ఒకింత మంచిదే అయినా, అందరూ ఉండి ఆశ్రమాల్లో చేర్చడం బాధాకరమని కొందరు అంటున్నారు. చీరాల పరిధిలో సుమారు 5 ఆశ్రమాలు ఉండగా అన్నింట్లో కలుపుకుని సుమారు 300 మందికిపై వృద్ధులు కాలాన్ని గడుపుతున్నారు.
ఆశ్రమాల్లో ఆనందం
ఆశ్రమాల్లో చేరిన వారు కొంతమేర ఆనందంగా ఉంటున్నారు. విధి వారిని వంచించి ఆశ్రమాలకు పరిమితం చేస్తుంటే నిర్వాహకులు వారికి కల్పించే ఆదరణ, అంతా ఒకరి బాధలు ఒకరికి చెప్పుకుని దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే అందరూ కలిసి భోజనం చేయడం, మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ, ఆ పాత మధురాలు చిత్రాలను టీవీల ద్వారా వీక్షిస్తు ఆనందిస్తున్నారు. ఈక్రమంలో కుటుంబాలకు దూరమైన వారికి ఒకింత ఆశ్రమాలు ఎంతో ఉపయోగకరమనే చెప్పాలి.
ఎవరూలేక.. తప్పక...
బుద్దూరి పద్మ, కారంచేడు
భర్త కొంతకాలం కిందట చనిపోయారు. సంతానం లేరు. వయసు పైబడింది. నా అనేవారు లేక తప్పక ఆశ్రమంలో చేరాను. బాధలోనే ఆనందాన్ని వెతుక్కొని ఇక్కడ అందరితో ఉంటున్నా.
సోదరితో కొంచెం అలక
అన్నం లక్ష్మీకాంతం, చెరుకుపల్లి
మేము 9 మంది అక్కాచెల్లెళ్లం, నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరూ రోజువారీ కూలీలే. ఎవరికీ భారం కాకూడదని ఆశ్రమంలో చేరా. వాళ్లు గుర్తుకు వస్తే ఏడుపు వస్తుంది. అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడేదానిని. రెండేళ్ల కిందట మా చెల్లెలు నాకు ఇష్టం లేని సంబంధంతో కుమారుడికి పెళ్లి చేసిందని ఫోన్ మాట్లాడడం మానేశా.