అలంకారప్రాయంగా సంపద తయారీ కేంద్రాలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:38 AM
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కార్యరూపం దాల్చడం లేదు.

కంభం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం కుంటుపడుతోంది. దీనికి తోడు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలనలో డంపింగ్ కేంద్రాలను పట్టించుకోకపోవడంతో లక్షలు వెచ్చించి నిర్మించిన ఘన వ్యర్ధ పదార్థాల నుండి సంపద తయారీ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. కంభం మండలంలో 14 పంచాయతీలు ఉండగా అందులో కంభం, చిన్నకంభం, జంగంగుంట్ల, ఎల్.కోట, ఔరంగ బాద్, రావిపాడు, దర్గ, యర్రబాలెం, లింగాపురం, నర్సిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలలో చెత్తసంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. కందులాపురం, తురిమెళ్ల పెద్దనల్లకాల్వ పంచాయతీ లలో స్థలం చూపక పోవడంతో నిర్మాణాలు చేపట్ట లేదు. ప్రభుత్వం నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలలో చెత్తను వేసి వ్యర్థాలను కుళ్లబెట్టి వాన పాముల ద్వారా గుల్లగా చేసి వర్మి కంపోస్టు తయారీ చేయాల్సి ఉంది. వీటి నిర్వహణకు సంబంధించి ఉపాధి హామీ అధికారులు సిబ్బందిని నియ మించి గ్రామాలలో అక్కడక్కడా తొట్లు నిర్మించాల్సి ఉంది. ఈ విషయంలో ఉపాధిహామీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఈ పథకం అటకెక్కింది. దీనికితోడు రోడ్లకు ఇరువైపులా వ్యర్థాలను పడ వేస్తున్నారు. కుప్పలు కుప్ప లుగా చెత్త పేరుకు పోవడంతో వాహనదారులకు అసౌకర్యంగా ఉండడమే కాక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చెత్తకు నిప్పుపెట్టడంతో పొగతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పరిశుభ్రత, పంచా యతీలకు ఆదాయం సమ కూరు తుందనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రాలను నిర్మించారు. అయితే పథకం అమలులో అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటి కైనా అధికారులు స్పందించి లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద కేంద్రాలను ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.