ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:16 PM
ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని జిల్లా ఎస్పీ దామోదర్ చెప్పారు. సోమవారం ఆయన గిద్దలూరు పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
జిల్లా ఎస్పీ దామోదార్
గిద్దలూరు పోలీస్‌స్టేషన్ తనిఖీ
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని జిల్లా ఎస్పీ దామోదర్ చెప్పారు. సోమవారం ఆయన గిద్దలూరు పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించారు. కేసులపై ఆరా తీశారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, పోలీసు పాత క్వార్టర్స్, సిబ్బంది పనితీరు, విధులు ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, ప్రాపర్టీని అధికారుల అనుమతితో డిస్పోజల్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. ప్రజలకు సీసీ కెమెరాల పట్ల అవగాహన కల్పించి వారు వాటిని ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రిపూట ముమ్మరంగా గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారినపడితే 1930కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. అనంతరం పాత పోలీసుస్టేషన్ వద్ద పోలీసు పెట్రోలింగ్ బంకు కోసం కేటాయించిన స్థలాన్ని జిల్లా ఎస్పీ దామోదర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, స్పెషల్ బ్రాంచి ఇన్ స్పెక్టర్ రాఘవేంద్రరావు, సీఐలు కె.సురేష్, రామకోటయ్య, మల్లికార్జునరావు, ఎస్సై ఇమ్మానియేలు పాల్గొన్నారు.