ఎన్టీఆర్ నా జీవితంలో అంతర్భాగం
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:21 AM
ఎన్టీఆర్ నా జీవితంలో అంతర్భాగమని ఆ మహానుభావునితో రాజకీయంగా కలిసి పనిచేయడం నా అదృష్టం.. పైసా ఖర్చు చేయకుండా టీడీపీ నాకు పెద్ద పదవులు ఇచ్చిందని అదీ ఆ పార్టీ గొప్పతనమని రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారులు జనాబ్ మహమ్మద్ షరీఫ్ గుర్తుకు తెచ్చుకున్నారు.

మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహ్మద్ షరీఫ్
అనంతవరంలో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటిక పోటీలు ప్రారంభం
యద్దనపూడి, (మార్టూరు) జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ నా జీవితంలో అంతర్భాగమని ఆ మహానుభావునితో రాజకీయంగా కలిసి పనిచేయడం నా అదృష్టం.. పైసా ఖర్చు చేయకుండా టీడీపీ నాకు పెద్ద పదవులు ఇచ్చిందని అదీ ఆ పార్టీ గొప్పతనమని రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారులు జనాబ్ మహమ్మద్ షరీఫ్ గుర్తుకు తెచ్చుకున్నారు. యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో బుధవారం రాత్రి ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ ఉభయ తెలుగురాష్ట్రాల నాటిక పోటీలను జనాబ్ మహమ్మద్ షరీఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు అధ్యక్షత వహించారు. అతిథులుగా జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, మారెళ్ల వంశీ పాల్గొన్నారు. ఈ సభలో షరీ్‌ఫను కళాపరిషత్ సభ్యులు ఆధ్వర్యంలో మారెళ్లవంశీ శాలువా కప్పి సత్కరించారు. అమరావతి మహిళా రైతులు, పువ్వాడ సుధాకర్, కందిమళ్ల సాంబశివరావుతో పాటు పలువురు గ్రామస్థులు షరీ్‌ఫను సత్కరించారు. తరువాత షరీఫ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి గౌరవాన్ని,ఔన్నత్యాన్ని,ప్రతిష్టను చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.
ఆకట్టుకున్న నాటికలు
ఎన్టీఆర్ కళాపరిషత్ నాటికపోటీలలో తొలుత విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే స్వేచ్ఛ నాటికను ప్రదర్శించారు. వ్యక్తుల జీవితాలలో వారి జీవనవిధానాలలో స్వేచ్ఛ అనేది నిర్ణయాత్మక నియంత్రణ, సంరక్షణతో కూడుకున్న స్వచ్ఛతగా ఉండాలని, మితిమీరిన స్వేచ్ఛ తెగిన గాలిపటం లాంటిదనే సందేశంతో ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకున్నది. తరువాత న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ విజయవాడ వారు ప్రదర్శించిన ఐ ఏట్ ఇండి యా నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడుదశాబ్దాలు అయినా పేదవారు పేదగానే ఉన్నారని, రాజకీయనాయకులు మాత్రమే ధనవంతులుగా ఎదిగారనే, కడుపుమండిన పేదవారు ఆలోచనాధోరణిని ఇతివృత్తంగా నాటికను ప్రదర్శించారు. చివరగా శ్రీసద్గురు కళాసమితి గుంటూరు వారు కమనీయం నాటికను ప్రదర్శించారు. కళాకారుడు తన వారసత్వాన్ని మరో కళాకారునికి అందిస్తున్నట్లే, కళా హృదయులు కూడా తమ కళాభిమానాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నా టిక ప్రదర్శన సాగింది. కళారూపాలు ప్రదర్శించే చోటికే ప్రేక్షకులు రావాలనే సందేశంతో నాటిక ముగుస్తుంది. గు రువారం నాటిక ప్రదర్శ కొనసాగనుంది.