Share News

రైతుల్లేరు.. జనం రారు!

ABN , Publish Date - Feb 11 , 2025 | 01:30 AM

బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలను నియంత్రించేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాల్లోనూ రైతు బజార్లను ఏర్పాటు చేసింది. అయితే అవి లక్ష్యానికి దూరంగా నడుస్తున్నాయి.

రైతుల్లేరు.. జనం రారు!
ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్‌ వద్ద రైతు బజార్‌లో ఖాళీగా ఉన్న షాపులు

పేరుకే రైతు బజార్లు

అంతా వ్యాపారులదే రాజ్యం

ఉన్నత ఆశయంతో ఏర్పాటు

ప్రస్తుతం లక్ష్యానికి దూరం

రైతులు పండించిన కూరగాయలు దళారులకే విక్రయం

సాధారణ మార్కెట్‌ మాదిరిగానే ధరలు

ఫలితంగా అన్నిచోట్లా తగ్గిన కొనుగోళ్లు

50శాతానికి పైగా దుకాణాలు ఖాళీ

బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలను నియంత్రించేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాల్లోనూ రైతు బజార్లను ఏర్పాటు చేసింది. అయితే అవి లక్ష్యానికి దూరంగా నడుస్తున్నాయి. అంతా ప్రైవేటు వ్యాపారుల కనుసన్నల్లోనే దళారులే రైతుల అవతారమెత్తి కూరగాయలు అమ్ముతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉత్పత్తులను తెచ్చే రైతులు హోల్‌సేల్‌ వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే అమ్ముకుని వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

ఒంగోలు కలెక్టరేట్‌/మార్కాపురం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు ప్రజలకు తక్కువ రేట్లకే అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన రైతు బజార్లు రోజురోజుకూ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. కొనుగోలుదారులు రావడం తగ్గిపోతుండటంతో షాపులు ఖాళీ అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందుచూపుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని లాయర్‌పేట, దిబ్బల రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్‌లలో వీటిని తెరిచారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యర్రగొండపాలెంలోనూ ప్రారంభించారు. రైతులు పండించిన కూరగాయలు నేరుగా ఆయా బజార్లకు తీసుకొచ్చి విక్రయించుకోవడమే వీటి ప్రధాన లక్ష్యం. తదనుగుణంగా అప్పట్లో అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్కెట్‌ కంటే అక్కడ కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. రానురాను రైతులు ఆ కేంద్రాలకు దూరమయ్యారు. కొంత మంది చిరువ్యాపారులు నేరుగా రైతుల వద్దనే కొను గోలు చేసి వాటిలో విక్రయిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయా రైతు బజార్లలో సగం షాపులు ఖాళీగా ఉన్నాయి. మార్కెట్‌లో మాదిరిగానే రైతు బజార్లలో ధరలు ఉండటం, మళ్లీ చిరు వ్యాపారులు వీధి వ్యాపారులకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో రైతు బజార్లలో ఉన్న షాపులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో రైతు బజారులో 50 నుంచి 70 షాపుల వరకు ఉండగా 30మంది మాత్రమే విక్రయాలు చేస్తున్నారు. అవిపోను ఖాళీగా ఉన్న మిగిలిన వాటిలో కూరగాయలకు వచ్చే బాక్సులు, సైకిళ్లు, వివిధ రకాల వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు.

పెరిగిన తోపుడు బండ్ల వ్యాపారులు

జిల్లా కేంద్రమైన ఒంగోలులో తోపుడు బండ్ల వ్యాపారం పెరిగింది. ఈ కాలనీ, ఆ కాలనీ అన్న తేడా లేకుండా ఉదయం సమ యంలో విస్తృతంగా కూరగాయల అమ్మకాలు చేస్తున్నారు. ఇంకోవైపు రోడ్లపై చిన్నచిన్న దుకాణాల్లో కూడా కూరగాయల వ్యాపారం విస్తరించింది. దాని వల్ల ఇప్పుడు నడిబొడ్డున ఉన్న రైతు బజార్లలో కొనుగోళ్లు తగ్గిపోయా యి. తోపుడు బండ్ల వ్యాపారుల వద్ద కూర గాయలు తాజాగా ఉండటం, ఇంటి వద్దకే వస్తుండటంతో జనం వాటి కొనుగోలుకు ఆసక్తిచూపుతున్నారు. రైతుబజార్లలో అమ్మకాలు తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది.


ఆటోల్లోనూ అమ్మకాలు

ఆటోల్లో కూడా కూరగాయలు తెచ్చి అమ్ముకునేవారు కూడా పెరిగిపోయారు. కొంతమంది రైతుల వద్దనే నేరుగా కొనుగోలు చేసి కాలనీల్లో అమ్మకాలు చేస్తున్నారు. కొందరు చిన్నచిన్న సెంటర్లలో రోడ్డుపై కూరగాయలు పోసుకుని అమ్ముతున్నారు. మార్కెట్‌, రైతుబాజర్లకంటే తక్కువ ధరలకే కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణంగా రైతు బజార్లలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా కొనుగోలు చేసేవారు. అయితే ప్రస్తుతం ఇళ్ల వద్దకే వస్తుండటంతో మహిళలు ఏ రోజుకారోజు ఆటోల వద్ద, తోపుడు బండ్ల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - Feb 11 , 2025 | 01:30 AM