నిమిషం లేటైనా నో ఎంట్రీ!
ABN , Publish Date - Feb 26 , 2025 | 02:10 AM
జిల్లాలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో అధికారులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నారు.

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నిఘానేత్రాల నీడలో నిర్వహణ
కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిషేధం
ఒంగోలు విద్య, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో అధికారులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్షల్లో కాపీయింగ్, ఇతర అవ కతవకలకు చెక్ పెట్టేందుకు అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు నిఘానేత్రాల నీడలో పరీక్ష లు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి ప్రారంభంకా నున్నాయి 8.30 గంటల నుంచి విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9 గంటల తర్వాత నిమిషం లేటైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఇంటర్మీడియేట్ బోర్డు ఆర్‌ఐవో సైమన్ విక్టర్ తెలిపారు.
67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఇంటర్ పరీక్షలకు మొత్తం 42,439 మంది హాజరుకానున్నారు. అందులో 21,624 మంది ప్రథమ, 20,815 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరికోసం జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 67 మంది చీఫ్‌లు, 67 మంది డిపార్ట్‌మెంట్ అధికారులతోపాటు 1089 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులకు అందుబాటులో ఉండేవిధంగా 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒంగోలులోని ఆర్‌ఐవో కార్యాలయం, విజయవాడలోని ఇంటర్మీడియేట్ బోర్డు ప్రధాన కార్యాలయానికి సీసీ కెమెరాలు అనుసంధానం చేశారు. ఆ కార్యాలయాల నుంచి పరీక్షా కేంద్రాల్లో ఏమి జరుగుతుందో వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఐదు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ఐదింటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కంభం, పెదదోర్నాల, అర్ధవీడు, ఎర్రగొండపాలెం, గిద్దలూరులోని కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి కాపీయింగ్ నిరోధించేందుకు చర్యలు చేపడతారు. కాపీయింగ్ నిరోధించేందుకు మూడు ఫ్లైయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఆర్‌ఐవో, డీఈసీ సభ్యులు, స్పెషలాఫీసర్, కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాష్ట్రస్థాయి బోర్డు అఽఽధికారులు కూడా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు.
హాల్ టికెట్లు మరింత సులభతరం
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈసారి హాల్‌టికెట్లు సులభతరంగా పొందనున్నారు. విద్యార్థులు చదువుతున్న కళాశాలల నుంచి వీటిని పొందవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థి చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్ సంతకంతో సంబంధం లేకుండా పరీక్షకు హాజరుకావచ్చు. విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐవో సైమన్ విక్టర్ హెచ్చరించారు.
సెల్‌ఫోన్లు నిషేధం
పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, పోలీసు, వైద్యసిబ్బంది, స్క్వాడ్ అధికారులు, ఇతర సిబ్బంది ఎవ్వరూ సెల్‌ఫోన్లు తీసుకు రాకూడదు. ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలు కూడా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది అంతా తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలి. పరీక్షలకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఆర్‌ఐవో కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోలు రూంను ఏర్పాటు చేశారు. దానికి 08592-281275 నెంబర్‌ను కేటాయించారు.