సహకరించం!
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:57 AM
జిల్లాలో సహకార శాఖ ఇంకా గాడినపడలేదు. పలు అంశాలలో ప్రస్తుత అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఆ శాఖ అధికారుల నుంచి సహకారం లభించడం లేదు. అటు రాష్ట్ర, ఇటు జిల్లా స్థాయిలోనూ పాలక పెద్దల సూచనలను బేఖాతరు చేస్తున్నారు.
అధికారపక్ష ఆకాంక్షలను పట్టించుకోని సహకార శాఖ అధికారులు
కీలక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా
ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లని వైనం
డీసీసీబీపై విచారణ, డీసీఎంఎస్‌పై చర్యలు
తాజాగా పొగాకు సమాఖ్య వ్యవహారంలోనూ అదే తీరు
మంత్రి స్వామి సీరియస్
జిల్లాలో సహకార శాఖ ఇంకా గాడినపడలేదు. పలు అంశాలలో ప్రస్తుత అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఆ శాఖ అధికారుల నుంచి సహకారం లభించడం లేదు. అటు రాష్ట్ర, ఇటు జిల్లా స్థాయిలోనూ పాలక పెద్దల సూచనలను బేఖాతరు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డీసీసీబీలో అనేక అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిగింది. డీసీఎంఎస్‌లో ఎరువుల వ్యాపారంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు, తాజాగా పొగాకు సమాఖ్యకు ఇన్‌చార్జి చైర్మన్ నియామకం.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా సహకార శాఖ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సూచనలకు విలువ ఇవ్వడం మాట అటుంచి జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న చర్యలపై వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ఒంగోలు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): సహకార శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ ఇంకా పాత పాలనే నడుస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఆ శాఖపై షాడో పెత్తనం చూపిన ఒక అధికారే అంతా తానై వ్యవహరిస్తున్నారు. అయితే శాఖకు సంబంధించి పలు అంశాలు తన దృష్టికి రావడంతో జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి సీరియస్ అయినట్లు తెలిసింది. రెవెన్యూ, పోలీసు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల తరహాలో నిత్యం ప్రజలతో సంబంధం కలిగి ఉండే అవకాశం లేకపోయినా లక్షలాది మంది రైతులకు ప్రాతినిథ్యం వహించే పీఏసీఎస్‌లు, డీసీసీబీ, డీసీఎంఎస్, పొగాకు సమాఖ్య, ఏఎంసీలు ఇతరత్రా సంస్థల పర్యవేక్షణలో సహకారశాఖ కీలకం. ఆయా సంస్థల నిర్వహణలో పాలనా, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణలో ఆ శాఖ అధికారుల జోక్యం అధికం. అంతటి ప్రాధాన్యం కలిగిన సహకారశాఖపై కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది మాసాలు దాటినా నేటికీ జిల్లాలోని అధికారపక్షానికి పట్టు లభించడం లేదు.
ఇప్పటికీ అప్పటి అధికారులే
వివిధ అంశాలలో ఇటు జిల్లాలో, అటు రాష్ట్రస్థాయిలో సహకారశాఖ అధికారులు వారి ఇష్టప్రకారం వ్యవహరిస్తున్నారన్న చర్చ రాజకీయ, సహకార శాఖ వర్గాలలో సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ శాఖల పర్యవేక్షణలో ఉన్న అధికారులే ఇప్పటికీ కొనసాగుతుండటం అందుకు కారణం. గత వైసీపీ ప్రభుత్వంలో పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిన డీసీసీబీ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప ప్రాథమిక విచారణకు కూడా రాష్ట్రస్థాయి అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ విషయంలో కలెక్టర్ స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. సాధారణంగా కలెక్టర్ లేఖకు రాష్ట్ర అధికారుల నుంచి తక్షణ స్పందన ఉండాలి. అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగింది. తీరా విచారణకు అయిష్టంగానే ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వగా అప్పటి సీఈవో మార్పు విషయంలో పెద్ద హైడ్రామా నడిచింది. ఆయనను సరెండర్ చేసే విషయంలో కలెక్టర్‌కు జిల్లా సహకార అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
51 విచారణపై ప్రతిష్టంభన
చివరకు డీసీసీబీపై 51 విచారణకు అనుమతించిన రాష్ట్రస్థాయి అధికారులు విచారణాధికారుల విషయంలో జిల్లాకు చెందిన మంత్రి, కీలకంగా ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే సూచనలు పట్టించుకోలేదు. ఉన్నతాధికారులు సూచించిన విచారణాధికారిని మార్చాలని వారు సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడును కోరగా ఆ మేరకు చర్యలకు ఆయన ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. అయితే నెలరోజులు గడుస్తున్నా మార్పు లేక 51 విచారణపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం ఇన్‌చార్జి సీఈవోగా అప్కాబ్ నుంచి ఒక అధికారిణి పనిచేస్తున్నారు. రెగ్యులర్ సీఈవో నియామకంలోనూ ఉన్నతాధికారులు అలాగే వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అలాగే మరో కీలకమైన జిల్లా మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లో వైసీపీ పాలనలో అనేక అక్రమాలు జరిగాయి. పొగాకు బోర్డు ద్వారా ఎరువుల అమ్మకాల వ్యవహారంలో అనివార్యమైన పరిస్థితుల్లో జిల్లా సహకార శాఖ అధికారులు విచారణకు ఆదేశించినా సరిగ్గా జరగలేదన్న విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ విచారణాధికారి కూడా బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేశారు. అయితే నామమాత్రంగా కేసు పెట్టారు. చివరకు రికవరీ పేరుతో ఆ వ్యవహారాన్ని వదిలేశారు.
అంతా ఆ అధికారి ఇష్టారాజ్యం
ప్రతిష్టాత్మకమైన పొగాకు సమాఖ్యలో రాష్ట్రంలో పొగాకు పండే అన్ని ప్రాంతాల రైతులు సభ్యులుగా ఉంటారు. గత వైసీపీ పాలనలో టీడీపీ మద్దతుగా ఉండే సుమారు పదివేల మంది రైతులను తొలగించి పాలక మండలిని వైసీపీ కైవసం చేసుకుంది. అనంతరం పీఐసీ చైర్మన్‌గా కూడా నాడు చైర్మన్‌గా గెలుపొందిన వైసీపీ నాయకుడినే నియమించారు. నిజానికి పాలక మండలిలో డివిజనల్ కోఆపరేటివ్ అఽధికారి స్థాయి కలిగిన వారు ఎండీగా ఉండాల్సి ఉన్నా కేవలం వైసీపీ నాయకులతోనే పీఐసీ నియామకం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా ఒక వ్యక్తినే నియమించారు. కాగా సదరు వైసీపీ నేత పీఐసీ గడువు ఈనెల 12తో ముగిసింది. పర్సన్ ఇన్‌చార్జిగా ప్రస్తుతం డీసీఏవో ఆఫీసులో అసిస్టెంట్ రిజిస్ర్టార్‌గా పనిచేస్తున్న వ్యక్తిని సహకార శాఖ అధికారి నియమించారు. కీలకమైన ఈ నియామకం విషయంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరికీ సమాచారం తెలియదు. సాధారణంగా ఇలాంటి కీలక నియామకాల విషయంలో అధికారులు కచ్ఛితంగా టీడీపీలోని ముఖ్య ప్రజాప్రతినిధులను సంప్రదించి చేస్తుంటారు. అలాంటి చర్చ జరిగిన దాఖలాలు లేవు. అంతేకాక స్థాయి తక్కువగా ఉండే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ను నియమించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడూ వైసీపీ వారికే పగ్గాలు
జిల్లా సహకార ఆడిట్ ఆఫీసర్ (డీసీఏవో) పరిధిలో జిల్లాలో పలు పీఏసీఎస్‌లలో ఇటీవల విచారణలు జరిగాయి. వైసీపీ వారిని వదిలేసి గతంలో టీడీపీ మద్దతుదారులు గెలుపొందిన సొసైటీల్లో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని రిపోర్టు చేస్తూ నివేదికలు రూపొందించి ఇబ్బందులు పాల్జేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఒంగోలు టుబాకో ప్రాసెసింగ్ సొసైటీకి ఎన్నికలను జిల్లా సహకార శాఖ అధికారులు నిర్వహించారు. ఆ సొసైటీ పాలకవర్గం అంతా వైసీపీ మద్దతుదారులతో నిండిపోయింది. తాజాగా ఒంగోలు కేంద్రంగా ఉన్న రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య (పొగాకు సమాఖ్య) పర్సన్ ఇన్‌చార్జి చైర్మన్ నియామకంలోనూ ఆ శాఖ అధికారుల తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
సహకారశాఖవర్గాల్లో విస్మయం
గతంలో పొగాకు సమాఖ్యకు పాలకవర్గ అధికారిగా డీఆర్ స్థాయి అధికారినైనా నియమించాలి. అవేమీ పట్టించుకోకుండా సహకారశాఖ అధికారులు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజాప్రతినిధుల ఆకాంక్షలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటడంపై సహకారశాఖ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా డీసీసీబీ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి స్వామి, ఇతర ప్రజాప్రతినిధులకు కొంత అవగాహన ఉన్నా తాజాగా పొగాకు సమాఖ్యకు పీఐసీ నియామకం, డీసీసీబీలో రెగ్యులర్ సీఈవో నియామకం ప్రక్రియపై ఎలాంటి సమాచారం లేదని తెలిసింది. రెండు రోజుల క్రితం తన దృష్టికి ఈ అంశం రావడంతో సంబంధిత అధికారులపై మంత్రి డాక్టర్ స్వామి సీరియస్ అయినట్లు సమాచారం. ఇప్పటికైనా సహకారశాఖ నుంచి తగు సహకారం అధికార పక్షానికి లభిస్తుందా లే దా చూడాల్సి ఉంది.