Share News

ఎన్నికల నిధులు దుర్వినియోగంపై చర్యలు నిల్‌

ABN , Publish Date - Mar 09 , 2025 | 01:18 AM

గత ఎన్నికల నిర్వహణ కోసం విడుదలైన నిధుల్లో భారీగా దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు కరువయ్యాయి. ఎంతో నిబద్ధతతో సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు తుంగలో తొక్కి నిధులను స్వాహా చేశారు.

ఎన్నికల నిధులు దుర్వినియోగంపై చర్యలు నిల్‌

ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు

నిబంధనలు బేఖాతర్‌

ప్రభుత్వ సొమ్మును వాడుకున్న వైనం

బకాయిలు అందక నిర్వాహకుల ఇబ్బందులు

దర్శి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : గత ఎన్నికల నిర్వహణ కోసం విడుదలైన నిధుల్లో భారీగా దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు కరువయ్యాయి. ఎంతో నిబద్ధతతో సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు తుంగలో తొక్కి నిధులను స్వాహా చేశారు. ఎన్నికల సందర్భంగా అవస రాల కోసం కొనుగోలు చేసిన పర్నిచర్‌ను ఎత్తుకెళ్లారు. భోజనాలు, షామియా నాలు ఇతర సదుపాయాలు సమకూర్చిన నిర్వాహకుల్లో ఇంకా కొంతమందికి బిల్లులు పూర్తిగా చెల్లించలేదు. ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ నిధుల దుర్విని యోగంపై పట్టించుకు న్న నాథుడే లేడు.

దర్శి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సుమారు రూ.1.70 కోట్లు విడుదలయ్యాయి. ఇతర నియోజకవర్గాలతో పోల్చితే దర్శికి ఎక్కువ నిధులు కేటాయించారు. వాటిని ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులు కొంతమంది ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. కొంత మొత్తాన్ని వారి అనుచరుల ఖాతా ల్లోకి జమచేసి ఏవేవో పనులు చేసినట్లు బిల్లులు చూపించుకున్నారు. వాస్తవంగా పనులు చేసిన నిర్వాహకులకు పూర్తిగా నగదు చెల్లించకుండా వెళ్లిపోయారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్న వ్యక్తులు అనేకసార్లు జిల్లా కేంద్రానికి కూడా వెళ్లి అర్జీలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదు. దీంతో వారు ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు.

ఫర్నిచర్‌ను ఎత్తుకెళ్లారు!

ఎన్నికల సందర్భంగా కొనుగోలు చేసిన ఫర్నిచ ర్‌ను ఒక అధికారి ఇక్కడ నుంచి బదిలీపై వెళ్తూ ఎత్తుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఉన్నతాధికారులు వస్తారన్న ఉద్దేశంతో ప్రత్యేక నిధులతో ఏసీలు, కంప్యూటర్లు, లక్షలాది రూపాయల విలువచేసే ఫర్నిచర్‌ను కొనుగోలు చేశారు. దానికి లెక్క చెప్పకుండా ఒక అధికారి ఎత్తుకెళ్లారు. ఎన్నికల నిధుల దుర్వియోగం, ఫర్నిచర్‌ మాయం జరిగిన విషయాలపై రిటర్నింగ్‌ అధికారిని వివరణ కోరగా ఆవిషయాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, సహాయకులు ఆ విషయాలను చూశారని చెప్పారు. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించిన అధికారులంతా ఆతర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వ సొమ్ము దర్జాగా వాడుకున్న అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికా రులు సైతం ఉదాసీన వైఖరి అవలంబించటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 09 , 2025 | 01:18 AM