Share News

కచ్చితమైన సమాచారం కావాలి

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:10 AM

ఎస్సీల్లోని ఉపకులాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం అందించాలని ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధికారులను కోరారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఆయన సోమవారం ఉదయం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు.

కచ్చితమైన సమాచారం కావాలి
అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న మిశ్రా, వేదికపై కలెక్టర్‌ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ తదితరులు

ఎస్సీ ఉపకులాల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం

ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా

ఒంగోలునగరం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎస్సీల్లోని ఉపకులాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం అందించాలని ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధికారులను కోరారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఆయన సోమవారం ఉదయం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై గణాంకాలతో సమగ్రంగా వివరాలను అందజేయాలని కోరారు. రాజకీయంగా కూడా ఎస్సీల స్థితిగతులను కమిషన్‌ పరిశీలిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్రప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా స్థాయిలో ఎస్సీల్లోని 59 ఉప కులాల పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులంతా తమ తమ శాఖల్లో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల వివరాలు, కేడర్‌, ఉపకులాల వారీగా కచ్చితమైన సమాచారం అందించాలని కోరారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ పూర్వపు ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాలు ఉండగా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ బాపట్ల జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో ఐదు మండలాలను కలిపారని తెలిపారు. ప్రస్తుత ప్రకాశంలో 38 మండలాలు ఉన్నాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వపు జిల్లాలో 33,97,448 మంది జనాభా ఉండగా అందులో ఎస్సీలు 7,87,861 మంది ఉన్నారని వివరించారు. అందులో పురుషులు 3,97,861 మంది, స్త్రీలు 3,90,619 మంది ఉన్నారన్నారు. ఎస్సీ అక్షరాస్యత జనాభా మొత్తం 4,10,946 కాగా అందులో పురుషులు 2,40,551 మంది, స్త్రీలు 1,70,395 మంది ఉన్నారని తెలిపారు. ఎస్సీల అఽక్షరాస్యత శాతం 59.75 ఉండగా అందులో పురుషుల శాతం 69,50 కాగా స్ర్త్లీల శాతం 49.86గా ఉందన్నారు. ఎస్సీల్లోని అన్ని ఉపకులాల్లో కలిపి ఉద్యోగులు 36,669 మంది ఉన్నారని, అందులో మాలలు 21,789 మంది, మాదిగలు 14,770 మంది, ఇతర ఉపకులాలు వారు 160మంది ఉన్నారని వివరించారు. రాజకీయంగా మునిసిపాలిటీల్లో మాల కులంలో 23మంది, మాదిగలలో 13మంది వివిధ హోదాల్లో ఉన్నారని తెలిపారు. పంచాయతీల్లో మాలలు 1,386 మంది, మాదిగలు 1,867మంది ఇతర ఉప కులాల్లో ఐదుగురు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారని ఆమె కమిషన్‌ చైర్మన్‌కు వివరించారు.

Updated Date - Jan 07 , 2025 | 01:10 AM