Share News

మున్సిపల్‌ సమావేశం రసాభాస

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:54 AM

మార్కాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభసగా మారింది. ఒకవైపు అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించా లని టీడీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు.

మున్సిపల్‌ సమావేశం రసాభాస

మార్కాపురం, జనవరి (ఆంధ్రజ్యోతి): మార్కాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభసగా మారింది. ఒకవైపు అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించా లని టీడీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. మరోవైపు మున్సి పల్‌ కమిషనర్‌ వ్యవహారశైలిపై వైసీపీ కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అజెండాను ఆమో దించకుండానే మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల కృష్ణ వెను దిరిగి వెళ్లిపోయారు. అజెండాను ఆమోదించాల్సిందే అంటూ టీడీపీ కౌన్సిలర్లు సమావేశ మందిరంలోనే నిరసన చేపట్టారు.

స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలు లో శుక్రవారం సాయంత్రం కౌన్సిల్‌ సమావేశం ప్రా రంభమైంది. ఆరంభం నుంచే టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య చర్చ వాడివేడిగా సాగింది. స్థానిక 33వ వార్డు కౌన్సెలర్‌ నాలి కొండయ్య కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ పాలకవర్గం అభివృద్ధి పనులపై శీతకన్ను వేసిందన్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు అజెండాలో పెట్టినా కొర్రీలు వేసి పట్టణంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు 61 అంశాలతో రూపొందిం చిన అజెండాను తప్పక ఆమోదించాల్సిందేనని పట్టు బట్టారు. అన్ని అంశాలు ఎలా ఉన్నా, 55వ అంశంలో పేర్కొన్న 18 మంది ఒప్పంద కార్మికులను విధుల నుంచి తొలగించేందుకు ససేమిరా ఒప్పుకునేదిలేదని 5వ వార్డు కౌన్సిలర్‌ మంగమూరి శ్రీనివాసులు అడ్డుతగిలారు. ఆయనకు చైర్మన్‌ చిర్లంచర్ల కృష్ణ కూడా మద్దతుగా నిలిచారు. దీంతో చాలాసేపు టీడీపీ కౌన్సెలర్లకు ఛైర్మన్‌కు మధ్య మాట ల యుద్ధం సాగింది. ఐదు మాసాల నుంచి విధులకు హాజరుకాని వారిని ఎలా కొనసాగిస్తారంటూ గట్టిగా నిలదీశారు. తాను ఆ అంశాన్ని అంగీకరించేంది లేదని ఛైర్మన్‌ తెగేసి చెప్పాడు. దీంతో టీడీపీ కౌన్సిలర్ల నుంచి ఒత్తిడి ఎక్కువకావడంతో ఛైర్మన్‌ కృష్ణ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అంజెడాలోని అన్ని అంశాల ను తప్పక ఆమోదించాల్సిందేనంటూ టీడీపీ కౌన్సిలర్లు సుమారు గంటపాటు కౌన్సిల్‌ హాలులో నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్‌ నారాయణరావు చొరవ తీసుకుని వారికి సర్ధిచెప్పి పంపారు.

కమిషనర్‌ తీరుపై మండిపడ్డ వైసీపీ కౌన్సిలర్లు

మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణరావు ఒంటెత్తు పోకడలకు పోతున్నాడని వైస్‌చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌ ధ్వజమెత్తారు. ఆక్రమణల తొలగింపుతో ఒరిగిందేమి లేదన్నారు. తొలగింపు అనంతరం ప్రస్తుతం మళ్లీ కాలువలపై ఆక్రమిస్తున్నారన్నారు. పారిశుధ్యం పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. దోమల ఉదృతి ఎక్కువగా ఉంది ఫాగింగ్‌ చేయమని చెప్పినా పట్టించుకునేవారే లేరన్నారు. కొన్నినెలలుగా ఫాగింగ్‌ మిషన్‌లు మాయం అయ్యిందని ఆరోపించారు. ఈ అంశాలపై కమిషనర్‌ సమాధానం చెప్పాలని ఇస్మాయిల్‌ కోరారు. తన హయాంలో ఇవి జరగలేదని కమిషనర్‌ సమాఽధానం ఇచ్చారు. అదేవిధంగా ఉర్ధూ పాఠశాల తరలింపు, పైప్‌లైన్‌ పనుల గురించి ప్రశ్నించడంతో అవి తన పరిధిలోనివి కావని కమిషనర్‌ అన్నారు. దీంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 27వ వార్డు కౌన్సిలర్‌ కశ్శేటి నగేష్‌ మాట్లాడుతూ 2018లో సుమారు 500 మందికిపైగా టిడ్కో ఇళ్ల కోసం రూ.25 వేల చొప్పున మున్సిపల్‌ కమిషనర్‌ పేరున డీడీలు తీశారన్నారు. ఏడేళ్లు కావస్తున్నా డబ్బులు చెల్లించిన వారికి అటు ఇళ్లు కాని, డబ్బులు కానీ ఇవ్వలేదన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్‌ నారాయణరావు సమాధానం చెప్పారు. కోఆప్షన్‌ సభ్యురాలు గుంటక వనజాక్షి మాట్లాడుతూ మహిళల కోసం మున్సిపా లిటీలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరిన వెంటనే అంజెడాలో చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపా రు. 2వ వార్డు పరిధిలోని ఉర్దూ పాఠశాల కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మరో కోఆప్షన్‌ సభ్యులు పఠాన్‌ అమిరుల్లాఖాన్‌ అధికారులకు నోటీసు అందించారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ చాతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాస్‌, మేనేజర్‌ శ్రీనివాసన్‌, డీఈ లక్ష్మీనారాయణ, ఏఈలు ఉమామహేశ్వరరావు, భూపాల్‌రెడ్డి, పలు విభాగాల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:54 AM