పల్లెల్లోనూ మాయదారి మట్కా
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:15 AM
మార్కాపురం, గిద్దలూరు, కంభంలలో కీలకమైన రంగాలకు చెందిన పలువురు వ్యక్తుల అండదండలతో నిర్వాహకులు బహిరంగంగానే మట్కా ఆడిస్తున్నారు..!

కంభం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం, గిద్దలూరు, కంభంలలో కీలకమైన రంగాలకు చెందిన పలువురు వ్యక్తుల అండదండలతో నిర్వాహకులు బహిరంగంగానే మట్కా ఆడిస్తున్నారు..! వందల నుంచి లక్షల స్థాయికి ఈ జూదం పెరిగిపోతున్నది. పోలీసులు కొద్దిరోజుల కిందట మట్కాపై దృష్టి సారించి అరెస్టులు కూడా చేశారు. అయితే తెరవెనుక వ్యక్తులను నియంత్రించ గలిగితే దీనికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. చిన్న చేపలను పట్టుకుని పెద్ద చేపలను వదిలివేస్తే ఇలాగే విస్తరించే ప్రమాదం ఉంది. మట్కా ఎక్కువగా వెనుకబడిన ప్రాంతాలలోనే నడుస్తుంది. గిద్దలూరు, కంభం, మార్కాపురం, చీరాలలో ఎక్కువగా నడుస్తోంది. చిన్నపాటి బుక్కర్లు రూ.10 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తుంటారు. అలా సేకరించిన మొత్తాన్ని కీలక వ్యక్తికి అప్పగిస్తారు. అతను నంద్యాల, అక్కడి నుండి గుంతకల్లుకు, చివరకు బొంబాయిలోని ప్రధాన నిర్వాహకులకు ఆ సొమ్ము చేరుతుంది. ఉదయం నుంచి సాయంత్రం లోగా డబ్బులు చెల్లిస్తే అర్ధరాత్రి ఫలితాలు వస్తాయి. ఎవరికైనా డబ్బులు వేస్తే ఆప్రాంతంలోని బుక్కర్ల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తారు. ఎక్కువ మొత్తంలో అయితే రెండు రోజుల సమయం పడుతుంది. పోలీసులు ఎక్కువగా చిన్నపాటి బుక్కర్లనే అరెస్టు చేస్తుంటారు. ఈ సమయంలో కీలకమైన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లి కొన్నాళ్లు బయటకు రావడం లేదు. ప్రస్తుతం గుంతకల్లు నుంచి నంద్యాల నుంచి వినుకొండ వరకు బుక్కర్లు రైలు ప్రయాణం సాగిస్తూ సెల్‌ఫోన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం. పట్టణాలకే పరిమితమైన బుక్కర్లపైనేకాక భారీ ఎత్తున నగదు సేకరించే కీలక వ్యక్తులపై దృష్టి పెట్టి వారిని నిరోధిస్తేనే మట్కాను అదుపుచేసే వీలుంటుంది.
పేద, మధ్యతరగతి వారే లక్ష్యం
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ చూపి కొందరు స్వార్ధపరులు ఈ ప్రాంతానికి మట్కా జూదాన్ని మూ డు దశాబ్ధాల క్రితమే పరిచయం చేశారు. కొద్ది మొత్తం మట్కాలో పెడితే వందలు, వేలు సంపాదిం చవచ్చని ఆశల వల విసురుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల నుంచి రోజూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఈ ఉచ్చులో చిక్కుకుని కష్టార్జితాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. దీంతో కుటుంబాలు గుళ్ల అవుతున్నాయి. తొలుత బస్టాండ్లు, టీస్టాల్స్ వద్ద జరిగేది. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది.
జూదం ఇలా
మొదటి అంకెను ఓపెనింగ్ అని, రెండో అంకెను క్లోజింగ్ అని పిలిచేవారు. బొంబాయి నుండి చార్టులు వచ్చేవి. వ్యవహారమంతా ల్యాండ్‌ఫోన్ల ద్వారా నడిచేవి. ప్రస్తుతం సెల్‌ఫోన్ ద్వారా మట్కా కొనసాగిస్తున్నారు. పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతూనే ఉంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
మట్కా వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తాం. ఎక్కడైనా మట్కా, ఇతర జూద కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో మట్కా నిర్వహించే ప్రాంతాలపై దాడులు నిర్వహించి అరెస్టులు చేశాం. ఇంకా మట్కా సెల్‌ఫోన్‌ల ద్వారా నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మట్కా విషయంపై సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. - మల్లికార్జున్, సీఐ కంభం