పెళ్లికి వేళాయే...!
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:31 PM
పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ‘మాఘమాసం ఎప్పుడు వస్తుందో’ అంటూ వేచి ఉండేవారి ఎదురు చూపులు ఫలించేలా మంచి ముహూర్తాలను తెచ్చేసింది. నేడు(ఈనెల 31న) తొలిరోజే మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు.

మాఘమాసంలో బలమైన ముహూర్తాలు
నేటి నుంచి నెలపాటు వివాహాల సీజన్
గిద్దలూరు టౌన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ‘మాఘమాసం ఎప్పుడు వస్తుందో’ అంటూ వేచి ఉండేవారి ఎదురు చూపులు ఫలించేలా మంచి ముహూర్తాలను తెచ్చేసింది. నేడు(ఈనెల 31న) తొలిరోజే మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన, మహోన్నతమైన ఘట్టం. అటువంటి పెళ్లికి చక్కటి ముహూర్త బలం ఉండే నెల ఏదీ అంటే ఎవరైనా ఠక్కున చెప్పేది మాఘమాసమే. ఈ మాసంలో ఉన్న బలమైన ముహూర్తాలు మరే మాసంలో ఉండవని పండితులు, పురోహితులు చెబుతున్నారు. అందుకే ఈ మాసానికి అందరూ అంతటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసంలో బలమైన ముహూర్తాలలో పెళ్లిళ్లు చేసుకుంటే దాంపత్య జీవితం నిండు నూరేళ్లతోపాటు సుఖసంతోషాలతో ఉంటారని పురోహితులు చెబుతున్నారు. ఈ నెల 31న మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి 28తో ముగియనున్న ఈ మాఘమాసంలో ఏకంగా 11 మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నాయి. వివాహ బంధంలోని అడుగు పెట్టేందుకు యువతీ యువకులు సిద్ధమవుతుండగా, వివాహ వేడుకలకు కల్యాణ మండప యజమానులు, పురోహితులు, క్యాటరింగ్, పూలమండపాల వారు ఎవరి పనిలో వారు బిజీ అయ్యారు.
గిద్దలూరు ప్రాంతంలో ప్రైవేటు కల్యాణ మండపాలు, లాడ్జి గదులు దాదాపు బుక్కయ్యాయి. కల్యాణ మండపాలను అలంకరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పూలమండపాల అలంకరణలు వేలల్లో పలుకుతున్నాయి. క్యాటరింగ్, పురోహితులు, షామియానా, కారు ట్రావెల్స్, ఫొటో, వీడియోగ్రాఫర్లు వారి సేవలకు ధరలు కూడా పెంచేశారు.
ఇదీ మాఘమాసం విశిష్టత
ఉత్తరాయన పుణ్యకాలంలో వచ్చే అత్యంత పవిత్రమైన మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు ముఖ నక్షత్రంలో సంచరించడం వలన దీనిని మాఘమాసం అంటారు. మాఘం అంటే పాపాలను పోగొట్టేది అని అర్థం. కార్తీక స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘస్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్నో శుభకార్యాలకు అనువైనది. సూర్యారాధన ఎంతో ముఖ్యమైనదిగా చెబుతారు.
ముహూర్తాల తేదీలు
ఈ మాఘమాసంలో ఈనెల 31, ఫిబ్రవరి నెల 2, 7, 8, 14, 15, 18, 20, 21, 22, 23 తేదీల వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ మాసంలో హడావుడిగా తేదీలు నిర్ణయించుకుని ఆయా రోజుల్లో పెళ్లిళ్లు చేయడం కష్టం అవుతుందని పలువురు చెబుతున్నారు.
మంచి ముహూర్తాలు
రాజు, పురోహితుడు, గిద్దలూరు
మాఘమాసంలో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అన్ని నక్షత్రాల వారికి బలమైన ముహూర్తాలు వచ్చాయి. ఆ తరువాత వచ్చే మాసాలలో వివాహాలు అంతంత మాత్రంగా జరుగుతాయి.