Share News

ఇంత మోసమా!

ABN , Publish Date - Jan 09 , 2025 | 02:40 AM

సక్రమంగా అనుమతులు తీసుకోకుండా ఎన్నికలకు ముందు హడావుడిగా వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేసిన మాయాజాలం పొదిలి ప్రజలకు శాపంగా మారిం ది. ఏళ్లుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను తీరుస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలికి చివరకు చేతులెత్తేశారు. అధికారులు కూడా నేతల బాటలోనే సాగారు. పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించారు. తీరా ఎంబుక్‌ చేసే సమయంలో పథకం బండారం బయటపడింది.

ఇంత మోసమా!
బిల్లులు రాకపోవడంతో అర్ధంతరంగా నిలిచిన పైప్‌లైన్‌ పనులు

పొదిలిలో వైసీపీ మార్క్‌ మాయాజాలం

ఎన్నికల వేళ హడావుడిగా రక్షిత నీటి పథకం పనులు

ఉత్తుత్తి అనుమతులు

ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ లేకుండానే టెండర్ల ప్రక్రియ

వెంటనే ప్రారంభించిన కాంట్రాక్టర్‌

ఎంబుక్‌ నమోదుకాక లబోదిబో

రూ.10కోట్ల పెట్టుబడి పరిస్థితేమిటో..?

అర్ధంతరంగా ఆగిన పనులు

దర్శి సాగర్‌ కాలువ నుంచి పైపులైన్‌ ద్వారా నీటిని తెచ్చుకోవడం పొదిలి ప్రజల చిరకాల స్వప్నం. దాన్ని తాము నిజం చేస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వం గతంలో డాంభికాలు పలికింది. అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి స్వయంగా పనులు ప్రారంభిస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. చోటామోటా నేతల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ అది తమ కీర్తిగా చెప్పుకున్నారు. అనుకున్నదే తడవుగా కాంట్రాక్టర్‌ పనులను ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఈ పనులకు అసలు ఆర్థికశాఖ అనుమతే లేదన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు నాలుక్కరుచుకున్నారు. దీంతో కాంట్రాక్టర్‌ కాడి కిందేశారు. ఇప్పటివరకు రూ.10కోట్ల మేర ఖర్చుపెట్టినట్లు పేర్కొంటున్న అతను తన పెట్టుబడి కూడా వెనక్కు వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.

పొదిలి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సక్రమంగా అనుమతులు తీసుకోకుండా ఎన్నికలకు ముందు హడావుడిగా వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేసిన మాయాజాలం పొదిలి ప్రజలకు శాపంగా మారిం ది. ఏళ్లుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను తీరుస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలికి చివరకు చేతులెత్తేశారు. అధికారులు కూడా నేతల బాటలోనే సాగారు. పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించారు. తీరా ఎంబుక్‌ చేసే సమయంలో పథకం బండారం బయటపడింది. దీంతో సదరు కాంట్రాక్టర్‌ లబోదిబోమంటూ పనులను అర్ధంతరంగా నిలిపేశారు. వివరాల్లోకి వెళితే.. దర్శి సాగర్‌ కాలువ నుంచి పైపులైన్‌ ద్వారా పొదిలి పెద్దచెరువుకు నీటిని నింపే సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం గత వైసీపీ పాలనలో రూ.50.13కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులకు 2022లో అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో ఇరిగేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగమేఘాల మీద టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. 2023 ఏప్రిల్‌లో మార్కాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అప్పటి సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో భారీ రక్షితనీటి పథకానికి శిలాఫలకం ఆవిష్కరించారు.

అప్పట్లో పెద్దఎత్తున సంబరాలు

ప్రజల ఆకాంక్షల మేరకు రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించి పొదిలి ప్రాంతప్రజల చిరకాలవాంఛ నేరవేర్చామని వైసీపీ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి పర్యటన తరువాత స్థానిక వైసీపీ నాయకులు అత్యుత్సాహంతో రక్షితనీటి పథకం తెచ్చిన ఘనత మాదేనంటూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పెద్దఎత్తున ప్రార్థనలు చేసి నానా హంగామా చేశారు. ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టును రఘురామ పైపుల కంపెనీ దక్కించుకుంది. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థ పైపులైన్‌ నిర్మాణ పనులను చురుగ్గా చేపట్టింది. ఇప్పటివరకు రూ.10 కోట్ల మేర పనులు పూర్తిచేసింది. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. చేసిన పనులకు ఎం-బుక్‌ రికార్డ్‌ చేసే సమయంలో ఈ పైపులైన్‌ వర్క్‌కు అసలు ఆర్థిక శాఖ అనుమతులు లేవని బయటపడింది. దీంతో లబోదిబోమనడం కాంట్రాక్టర్‌ వంతైంది.


ఎంబుక్‌ చేయడం కష్టమే

ప్రభుత్వం ఇచ్చిన జీవో నకలు కిందిభాగంలో ఆర్థిక అనుమతులు ఉన్నట్లు పొందుపరచకపోవడంతో ఎంబుక్‌ రికార్డ్‌ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. మరి ఆర్థిక అనుమతులు లేకుండా టెండర్లు పిలవడంపై అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు తెల్లముఖం వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ప్రక్రియ ఎలా నిర్వహించారని ప్రజలు మండిపడుతున్నారు.

ఎనిమిది నెలలుగా నిలిచిన పనులు

ఎంబుక్‌ నమోదు కష్టం కావడంతో సదరు కాంట్రాక్టర్‌ పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఏడెనిమిది నెలలుగా పనుల్లో కదలిక లేకపోవడంతో పొదిలి ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుత శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సమ్మర్‌ స్టోరేజ్‌ పనులు పూర్తిచేయిస్తామని పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం పశ్చిమప్రాంత ప్రజలను మభ్యపెట్టిందనే విషయం మరోసారి తేటతెల్లమైంది.

Updated Date - Jan 09 , 2025 | 02:40 AM