బయటపడుతున్న అక్రమాలు
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:32 PM
హెల్త్ పింఛన్లలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆరోగ్య పింఛన్లలో పలు అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ నిర్వహించిన సమావేశాల్లో కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బోగస్‌లపై ఏకరువుపెట్టారు.

మంచానికి, వీల్‌చైర్‌కే పరిమితమైన
పింఛన్లలోనూ భారీగా బోగస్‌లు
ముగిసిన వైద్య బృందాల విచారణ
ప్రభుత్వానికి చేరిన నివేదిక
నేడో, రేపో అనర్హుల తొలగింపు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : హెల్త్ పింఛన్లలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆరోగ్య పింఛన్లలో పలు అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ నిర్వహించిన సమావేశాల్లో కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బోగస్‌లపై ఏకరువుపెట్టారు. దీంతో ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్య పింఛన్లపై ఇతర జిల్లాలకు చెందిన వైద్య బృందాలతో విచారణ చేయించింది. వీల్ చైర్, మంచానికి పరిమిత మైన పింఛన్ లబ్ధిదారులు జిల్లాలో 1,236 మంది ఉన్నారు. ఒక్కొ క్కరు నెలకు రూ.15వేల చొప్పున తీసుకుంటున్నారు. ఈ పింఛన్లు పశ్చిమప్రాంత నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే లబ్ధిదారులకు ముందుగానే సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. ఆ సమయంలో 10 శాతం అందుబాటులో లేకపోగా మిగిలిన వారందరినీ వైద్యబృందాలు పరిశీలించాయి. పింఛన్ పొందేందుకు తీసుకున్న ధ్రువీకరణ పత్రాలతోపాటు వారి ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉందో స్వయంగా పరిశీలించి ఫొటోలను తీసుకొని ఆన్‌లైన్‌లో సెర్ప్‌కు పంపారు. అలా జిల్లావ్యాప్తంగా 1,236 మందిపై విచారణ చేయగా అనేక మంది అన్నీ బాగున్నా వీల్‌చైర్‌కే పరిమితమైనట్లు చూపి పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారని సమాచారం. అలా జిల్లావ్యాప్తంగా 40శాతం మందికిపైగా నెలకు రూ.15 వేల చొప్పున ఒక్కొక్కరు పింఛన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రప్రభుత్వనికి నివేదిక
జిల్లావ్యాప్తంగా విచారణ చేసిన వైద్య బృందాలు నివేదికలను డీఎంహెచ్‌వోకు అందజేశాయి. ఒక్కో పింఛన్‌దారుడికి సంబంధించిన సమగ్ర సమాచారం అందులో పొందుపర్చాయి. ఆయన కలెక్టర్‌కు అందజేయగా పరిశీలన అనంతరం ఆమె రాష్ట్రప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ప్రభుత్వం ఆ విచారణ నివేదికను పరిశీలించి అనర్హులను తొలగించి జిల్లాకు రెండు, మూడు రోజుల్లో ఆ జాబితాను పంపనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు అప్పనంగా నెలవారీ పింఛన్ పొందుతున్న వారిలో ఆందోళన నెలకొంది.