Share News

సదరమ్‌ సర్టిఫి‘కేట్ల’పై విచారణ

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:57 AM

వివిధ రకాల వ్యాధుల పేరుతో సదరమ్‌ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వారిని విచారణ చేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం మూడు కేంద్రాలను ఎంపిక చేసింది.

సదరమ్‌ సర్టిఫి‘కేట్ల’పై విచారణ

మండలాలవారీగా నోటీసుల జారీకి సిద్ధం

ఇతర జిల్లాల వైద్యాధికారులతో పరిశీలన

వచ్చేనెల నుంచి రిమ్స్‌, మార్కాపురం, గిద్దలూరు

ఏరియా ఆస్పత్రులలో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు

రేపటితో ముగియనున్న ఆరోగ్య పింఛన్లపై విచారణ

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : వివిధ రకాల వ్యాధుల పేరుతో సదరమ్‌ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వారిని విచారణ చేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం మూడు కేంద్రాలను ఎంపిక చేసింది. ఒంగోలులోని రిమ్స్‌తోపాటు మార్కాపురం, గిద్దలూరు ఏరియా వైద్యశాలలో లబ్ధిదారుల సదరమ్‌ సర్టిఫికెట్లను ఇతర జిల్లాల నుంచి వచ్చే వైద్యాధికారులు పరిశీలన చేయనున్నారు. జిల్లాలో కేన్సర్‌, దివ్యాంగులు, మూగ, చెవిటి, అంధ తదితర రకాల సర్టిఫికెట్లతో పింఛన్లు పొందుతున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ సానుభూతిపరులకు ఇష్టం వచ్చినట్లుగా సర్టిఫికెట్లు జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏడునెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బోగస్‌ లబ్ధిదారులపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరోగ్య ఫించన్ల లబ్ధిదారులు విచారణ చేపట్టారు. జిల్లాలో ఐదు బృందాలు ఇంటింటికి వెళ్లి విచారణ చేయగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఆరోగ్య పింఛన్లపై ముగుస్తున్న విచారణ

ఆరోగ్య పింఛన్లపై చేపట్టిన విచారణ శుక్రవారం ముగియనుంది. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆ విచారణ బృందాలు నివేదికలు ఇవ్వనున్నాయి. వాటిని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు వైద్యశాఖ అధికారులు అందజేస్తారు. ఈ నేపథ్యంలో మిగిలిన పింఛన్లపై వైద్యశాఖ దృష్టి కేంద్రీకరించింది. లబ్ధిదారులకు జిల్లాలోనే సదరమ్‌ సర్టిఫికెట్లు ఇవ్వడంతో ఇప్పుడు ఆ విచారణ ఆ అధికారులతో కాకుండా ఇతర జిల్లాల వైద్యాధికారులు చేయనున్నట్లు తెలిసింది. అందుకోసం ఇప్పటికే మండలాల వారీగా జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. డీఆర్‌డీఏ నుంచి అవసరమైన జాబితాలను కూడా వైద్యశాఖ అధికారులు తెప్పించుకొని మండలాల వారీ పరిశీలించినట్లు తెలిసింది. ఆ ప్రకారం ఎంపిక చేసిన మూడు కేంద్రాల్లో వైద్యాధికారులు సర్టిఫికెట్లను పరిశీలన చేయడంతోపాటు అవసరమైతే ఆయా ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మరోసారి వైద్యపరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఆ పరీక్షలు స్థానిక డాక్టర్లు చేస్తే ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉండటంతో ఇతర జిల్లాల వైద్యాధికారులను అందుకోసం నియమించినట్లు సమాచారం.

Updated Date - Jan 30 , 2025 | 01:57 AM