నేటి నుంచి అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలు
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:38 PM
సంక్రాంతి క్రికెట్ పోటీలకు రావినూతల సిద్ధమైంది. బుధవారం నుంచి అంతర్‌రాష్ట్ర పోటీలు ప్రారంభమవుతున్నాయి. టర్ప్ పిచ్‌పై జరిగే ఈ పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్‌ఎ్‌ససీఏ నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి చెందిన గ్రామాలలో ముందు వరుసలో ఉన్న రావినూతలకు ప్రతి సంవత్సరం జరిగే సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకువచ్చాయి. క్రికెట్ క్రీడపై ఉన్న అభిమానంతో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిని దాటి అంతర్ రాష్ట్ర పోటీలు నిర్వహించే స్థాయికి ఎదిగింది.

సిద్ధమైన రావినూతల స్టేడియం
గ్రామీణ ప్రాంతంలో 18 ఏళ్లుగా నిర్వహణ
రూ.ఆరు కోట్ల విలువైన స్టేడియం
మేదరమెట్ల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి క్రికెట్ పోటీలకు రావినూతల సిద్ధమైంది. బుధవారం నుంచి అంతర్‌రాష్ట్ర పోటీలు ప్రారంభమవుతున్నాయి. టర్ప్ పిచ్‌పై జరిగే ఈ పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్‌ఎ్‌ససీఏ నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి చెందిన గ్రామాలలో ముందు వరుసలో ఉన్న రావినూతలకు ప్రతి సంవత్సరం జరిగే సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకువచ్చాయి. క్రికెట్ క్రీడపై ఉన్న అభిమానంతో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిని దాటి అంతర్ రాష్ట్ర పోటీలు నిర్వహించే స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో సుమారు రూ.6 కోట్ల విలువైన స్టేడియం రావినూతలకు ఆస్తిగా మిగిలింది. ఇక్కడ 31 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్న పెవిలియన్. స్టేడియం చుట్టూ ప్రహారీ నిర్మాణం, టర్ప్ పిచ్ ఏర్పాటుకు అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు, పూర్వ కార్యదర్శి దివంగత పుట్టా వెంకట్రావు, అసోసియేషన్ సభ్యులు ఎంతగానో కృషి చేశారు.
1991లో ఆర్‌ఎస్‌సీఏ ఏర్పాటు
1991లో రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆర్‌ఎస్‌సీఏ) ఏర్పాటైంది. ఆ సమయానికి ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా లేదు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ 1995లో ఏర్పాటైంది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో ఎక్కడా టర్ప్ పిచ్ లేని సమయంలో రావినూతల స్టేడియంలో టర్ప్ పిచ్‌పై పోటీలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే ఇన్నేళ్లూ క్రమం తప్పకుండా క్రికెట్ పోటీలు నిర్వహించిన సంస్థ లేదు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సహకారం లేకుండానే స్డేడియాన్ని ఇంతగా అభివృద్ధి చేయడం క్రికెట్ పట్ల అసోసియేషన్ సభ్యులకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
ఆటగాళ్లకు పండుగే
రావినూతలలో జరిగే అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఆటగాళ్లు సంక్రాంతి పండుగను సైతం వదులుకుని రావడానికి ఇష్టపడతారు. దీనికి కారణం ఇక్కడ ఆర్‌ఎ్‌ససీఏ ఆతిథ్యం, గ్రామస్థుల ఆదరాభిమానాలే కారణం అని క్రీడాకారులు అంటున్నారు. భారత జట్టుకు ఆడిన వేణుగోపాలరావు, నోయల్ డేవిడ్, బీసీసీఐ సెలక్టర్‌గా పనిచేసిన ఎంఎ్‌సకే ప్రసాద్, రంజీల్లో ఆడిన కల్యాణ్ కృష్ణ, ఏజీ ప్రదీప్, ప్రవీణ్, వంశీలతోపాటు పలు రాష్ట్రాలలో రంజీ పోటీలలో పాల్గొన్న ఆటగాళ్లు రావినూతలలో సంక్రాంతి క్రికెట్ పోటీలలో ఆడడం విశేషం.
ఏసీఏతో ఒప్పందం
ఆర్‌ఎ్‌ససీఏలో ఉన్న టర్ప్ పిచ్, పెవిలియన్, ఇండోర్ స్టేడియం, ఆటగాళ్ల వసతి గదులు, ఇతర వనరులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వినియోగించుకుని మరింత అభివృద్ధి చేసేందుకు ఆర్‌ఎ్‌ససీఏ, ఏసీఏల మధ్య ఒప్పందం జరిగింది. అందులో భాగంగా ఏసీఏ అండర్-12, అండర్-14, అండర్-19 బాల, బాలికల జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించడంతోపాటు బాలిక క్రికెట్ శిక్షణ కేంద్రంగా ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్‌తో చేసుకున్న ఒప్పందంతో భవిష్యత్‌లో రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ స్టేడియానికి మరిన్ని అదనపు హంగులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్థాయని అసోసియేషన్ సభ్యులు, గ్రామస్థులు భావిస్తున్నారు.
నేటి నుంచి సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు
సిద్ధమైన రావినూతల స్టేడియం
రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భ్రమర సంక్రాంతి కప్-2025, 31వ అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ ప్రొటెం స్పీకర్, రిటైర్డ్ డీఐజీ తెన్నెటి కృష్ణ ప్రసాద్, మా జనరల్ సెక్రటరీ, సినీ నటుడు రఘుబాబు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, రాష్ట్ర మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ (సత్య), భ్రమర టౌన్ షిప్ చైర్మన్ గళ్ల రామచంద్రరావు, భారత బ్యాడ్మంట్ సమాఖ్య మాజీ కార్యదర్శి కరణం చెంచు పున్నయ్య చౌదరి, జవహర్ నర్సింగ్ హోం డాక్టర్ బందా జవహర్ హాజరవుతారని ఆర్‌ఎ్‌ససీఏ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు(బాబు) తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందే జట్లకు వరుసగా మొదటి బహుమతి రూ.3లక్షలు, రెండవ బహుమతి రూ.2లక్షలు, మూడవ బహుమతిగా రూ.లక్ష అందించనున్నట్లు తెలిపారు.