పెరిగిన భూముల విలువ
ABN , Publish Date - Feb 02 , 2025 | 01:32 AM
భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం రిజిస్ట్రేషన్ చార్జీలపై పడింది. శనివారం నుంచి పెరిగిన విలువలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేశారు. గత నెల 31న అత్యధికంగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి
ఒక్కరోజు ఆదాయం రూ.4.14 కోట్లు
ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం రిజిస్ట్రేషన్ చార్జీలపై పడింది. శనివారం నుంచి పెరిగిన విలువలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేశారు. గత నెల 31న అత్యధికంగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఒక్కరోజు 739 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా రూ.4.14కోట్లు ఆదాయం వచ్చింది. జిల్లాలో మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా జనవరిలో రూ.642 కోట్ల ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు వలన 20 శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఉన్న భూముల విలువలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. 2019 ఆగస్టులో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములకు మాత్రమే విలువలు పెంచగా, 2023 జూన్‌లో నగర పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు ఒంగోలు నగరం, కొన్ని ముఖ్యమైన గ్రామాలలో భూముల విలువను పెంచారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20శాతం పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
పెరిగిన ధరలు ఇలా..
త్రోవగుంట ప్రాంతంలో ఎకరా రూ.16.50లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.17.50 లక్షలకు పెరిగింది. కొప్పోలు ప్రాంతంలో ఎకరా ప్రస్తుతం రూ.24లక్షలు ఉండగా రూ.26లక్షలకు పెంచారు. ముక్తినూతలపాడు ప్రాంతంలో ఎకరా రూ.40లక్షలు కాగా రూ.42 లక్షలకు పెంచారు. టంగుటూరులో ఎకరా రూ.12లక్షలు ఉండగా రూ.13లక్షలకు పెరిగింది. అల్లూరులో రూ.8 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచారు. ఒంగోలు నగరంలో లాయర్‌పేట, గోపాల్‌నగరం, రాజాపానగల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో చదరపు గజానికి రూ.వెయ్యి చొప్పున భూముల విలువ పెరిగింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చినట్లు జిల్లా రిజిస్ర్టార్ ఎ.బాలాంజనేయులు తెలిపారు.