Share News

దర్శిలో ముమ్మరంగా రిజిస్ర్టేషన్లు

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:08 PM

భూములు, స్థలాల విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెరుగుతుండటంతో దర్శి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో మూడు రోజులుగా ముమ్మరంగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. గతంలో క్రయవిక్రయాల కోసం ఒప్పందాలు చేసుకున్న వ్యక్తులు భూముల విలువలు పెరగకముందే రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని ఎగబడడంతో కార్యాలయం కిటకిటలాడింది.

దర్శిలో ముమ్మరంగా రిజిస్ర్టేషన్లు
రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద ఎదురుచూస్తున్న ప్రజలు

నేటి నుంచి భూముల విలువ పెంపు

రెండురోజుల నుంచి కార్యాలయం కిటకిట

సొమ్ము చేసుకుంటున్న సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు

దర్శి, జనవరి 31(ఆంధ్రజ్యోతి) : భూములు, స్థలాల విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెరుగుతుండటంతో దర్శి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో మూడు రోజులుగా ముమ్మరంగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. గతంలో క్రయవిక్రయాల కోసం ఒప్పందాలు చేసుకున్న వ్యక్తులు భూముల విలువలు పెరగకముందే రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని ఎగబడడంతో కార్యాలయం కిటకిటలాడింది. రాత్రి 8 గంటలకు కూడా రద్దగానే ఉంది. ఈ అవకాశాన్ని కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటరు,్ల స్టాంపు వెండర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ర్టేషన్‌కు వచ్చిన వ్యక్తులతో కొంతమంది డాక్యుమెంట్‌ రైటర్లు ఫీజులో అదనపు సొమ్ము మాట్లాడుకున్నారు. కొంతమంది రిజిస్ర్టేషన్‌ అయ్యేందుకు సమస్య ఉందని చెబుతూ అఽధికంగా కూడా వసూళ్లు చేశారు. గడువు దాటితే ఇబ్బంది పడాల్సి వస్తుందని రిజిస్ర్టేషన్లు చేయించుకునే వ్యక్తులు డాక్యుమెంట్‌ రైటర్ల మాటలు నమ్మి అడిగిన మేరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.


రెండు రోజుల్లో రెండొందలకుపైనే...

దర్శిలో గురువారం అధికసంఖ్యలో 105 రిజిస్ర్టేషన్లు జరిగాయి. శుక్రవారం కూడా సుమారు వంద రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఇటీవలకాలం వరకు రోజులకు పది లేక పదిహేను రిజిస్ర్టేషన్లు మాత్రమే జరిగేవి. ఒక్కసారిగా రిజిస్ర్టేషన్ల సంఖ్య మూడంకెలకు చేరటంతో అక్కడ పనిచేస్తున్న వారికి పండగలా మారింది.

దస్తావేజుల ధరకు రెక్కలు

స్టాంపువెండర్లు దస్తావేజులను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. రూ.100 స్టాంపును రూ.200 పైగా విక్రయిస్తున్నారు. కొంతమంది రూ.250 నుంచి రూ.300 వరకు తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయంపై సబ్‌ రిజిస్ర్టార్‌ ఎం శ్రీనివాసరావును వివరణ కోరగా ఈ విషయాలు తమ దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jan 31 , 2025 | 11:08 PM