నల్లవాగు భూమిపై గ్రానైట్ వ్యాపారుల పాగా
ABN , Publish Date - Jan 28 , 2025 | 11:50 PM
ప్రభుత్వ వాగు భూములను కొందరు కొంతకాలం నుంచి అక్రమించుకొని ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తున్నారు. కొందరు గ్రానైట్ వ్యాపారులు ప్రభుత్వ భూముల్లో పాగా వేసి గ్రానైట్ వ్యర్థాలను ఇష్టానుసారం పడేస్తున్నారు. ఎంతో విలువైన వాగు భూములు ఆక్రమణకు గురి కావడంతో ముందు మందు రైతులకు తీవ్ర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న నల్ల వాగుకు సంబందించి సర్వే నెంబరు 789/ఏ, 789/బీ, 761లో 54 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కొంత కాలం నుంచి కొణిదెనకు చెందిన కొందరు అక్రమించుకుని తమ ఆధీనంలో పెట్టుకొన్నారు.
కొణిదెన గ్రామంలో 54 ఎకరాల ప్రభుత్వ భూమి పరాధీనం
జోరుగా ప్రభుత్వ వాగు భూముల అమ్మకాలు, కొనుగోళ్లు
ఇష్టారాజ్యంగా వాటిలో గ్రానైట్ వ్యర్థాలు
వారిపై చర్యలకు గతంలో మంత్రి ఆదేశాలు
పట్టించుకొని అధికారులు
బల్లికురవ, జనవరి 28 (ఆంద్రజ్యోతి) : ప్రభుత్వ వాగు భూములను కొందరు కొంతకాలం నుంచి అక్రమించుకొని ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తున్నారు. కొందరు గ్రానైట్ వ్యాపారులు ప్రభుత్వ భూముల్లో పాగా వేసి గ్రానైట్ వ్యర్థాలను ఇష్టానుసారం పడేస్తున్నారు. ఎంతో విలువైన వాగు భూములు ఆక్రమణకు గురి కావడంతో ముందు మందు రైతులకు తీవ్ర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న నల్ల వాగుకు సంబందించి సర్వే నెంబరు 789/ఏ, 789/బీ, 761లో 54 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కొంత కాలం నుంచి కొణిదెనకు చెందిన కొందరు అక్రమించుకుని తమ ఆధీనంలో పెట్టుకొన్నారు. కొందరు పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ భూమిని కొందరు గత కొన్ని నెలల నుంచి అమ్మకాలు చేస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలు నిర్వహించే కొందరు వ్యాపారులు ఈ భూమిని కొంత కొనుగోలు చేసి కొంత అక్రమించుకొని పెద్ద ఎత్తున వ్యర్థాలను పడవేస్తున్నారు. ఫ్యాక్టరీలలో వచ్చే డస్టును ప్రభుత్వ వాగు భూమిలోకి పెడుతున్నారు. దీంతో నల్లవాగు రోజు రోజుకూ కుంచించుకుపోతోంది. ఎంతో విలువ కలిగిన ప్రభుత్వ భూమి అక్రమణకు గురైన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామ స్థాయిలో పనిచేసే అధికారులు కూడా కొందరు ప్రభుత్వ భూముల అమ్మకాల విషయం తెలిసిన మామూళ్ల మత్తులో పట్టించుకోలేదనే అరోపణలు వినిసిస్తున్నాయి. రోడ్డు పక్కనే ఉన్న వాగు భూమిలో వ్యర్థాలను వేయడం వలన గాలులకు వచ్చే దుమ్ముతో పంటలు కూడా సరిగా పండే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. పైప్‌లైన్‌లను ఏర్పాటు చేసి మరీ వ్యర్థాలను వాగు భూమిలోకి పెడుతున్నారని ఇలా అయితే మున్ముందు వాగు భూమి కనుమరుగవుతుందని రైతులు తెలిపారు. నల్లవాగు నీటిపై ఆధారపడి ఎత్తిపోతల పథకం కూడా ఉందని పంటలకు నీరు సక్రమంగా రావాలంటే నల్లవాగును పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. వాగు భూమిని అక్రమించుకున్న వారు కొందరు లక్షలు తీసుకొని మరొకరికి అమ్మకాలు చేయడంతో వివాదాలు కూడా తలెత్తుతున్నాయని పలువురు అంటున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే వాగు భూములను పరిశీలించి అక్రమణలబారి నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
వ్యర్థాలు వేసే వారిపై చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు
బల్లికురవ మండలంలో ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ వ్యర్థాలు వేసే వారికి నోటీసులు ఇచ్చి వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి రవికుమార్ గతంలో అధికారులను ఆదేశించారు. అయినా నేటికీ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. రెండు నెలల కిందట బల్లికురవ ప్రజా వేదిక కార్యక్రమానికి వచ్చిన మంత్రి ప్రభుత్వ భూముల్లో వ్యర్థాలు వేస్తున్న వారికి నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.