Share News

స్వర్ణోత్సవ సంబరం

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:04 AM

కక్షలు, కార్పణ్యాలు పురివిప్పి బుసలు కొట్టిన చోట విద్యా కుసుమాలు విరబూశాయి.. అక్షర పరిమళాలు వెదజల్లాయి.. దాతల సహకారం, అధ్యాపకుల కృషితో ప్రజలు విద్య ప్రాముఖ్యతను గుర్తించారు. ఇందులో భాగంగానే మద్దిపాడు కడియాల యానాదయ్య జూనియర్‌ కళాశాల, ఉన్నత పాఠశాల ఏర్పాటయ్యాయి.

స్వర్ణోత్సవ సంబరం
కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

మద్దిపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 75 వసంతాలు

అదే ప్రాంగణంలోని కడియాల యానాదయ్య కళాశాలకు 50 ఏళ్లకుపైనే చరిత్ర

అప్పట్లో దాతల సహకారంతో ఏర్పాటు

రేపు పూర్వ విద్యార్థుల నేతృత్వంలో రెండు విద్యాసంస్థల ఉత్సవాలు

మద్దిపాడు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి)

కక్షలు, కార్పణ్యాలు పురివిప్పి బుసలు కొట్టిన చోట విద్యా కుసుమాలు విరబూశాయి.. అక్షర పరిమళాలు వెదజల్లాయి.. దాతల సహకారం, అధ్యాపకుల కృషితో ప్రజలు విద్య ప్రాముఖ్యతను గుర్తించారు. ఇందులో భాగంగానే మద్దిపాడు కడియాల యానాదయ్య జూనియర్‌ కళాశాల, ఉన్నత పాఠశాల ఏర్పాటయ్యాయి.

1950లో హైస్కూలు, 1969లో కళాశాల ఏర్పాటు...

మద్దిపాడులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1950లో ఏర్పడి ప్రస్తుతం 75 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. అక్కడే ఉన్న కడియాల యానాదయ్య జూనియర్‌ కళాశాల 1969లో ప్రారంభమైంది. స్థల దాతలు ఆరె రాఘవయ్య, ఆరె చెంచయ్య, ఆరె శ్రీరాములు, ఆరె రంగయ్య, ఆరె వెంకటసుబ్బయ్యలు తమ భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులు కడియాల యానాదయ్య కుటుంబ సభ్యులు కళాశాల స్థాపనకు కావాల్సిన కార్పస్‌ ఫండ్‌ లక్ష రూపాయలను అందజేశారు. దీంతో కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటైంది. అప్పటినుంచి గ్రామపెద్దలు కొందరు కమిటీగా ఏర్పడి కళాశాల అభ్యున్నతికి కృషిచేశారు. అప్పటినుంచి దినదినప్రవర్థమానమై వెలుగొందింది. మద్దిపాడు మండల విద్యార్థులేకాక అద్దంకి, మేదరమెట్ల, పంగుళూరు, మార్టూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు కళాశాలలో చేరి విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు.

ముస్తాబవుతున్న విద్యాప్రాంగణం

హైస్కూలు, కళాశాల స్వర్ణోత్సవాలు ఈ నెల 9వ తేదీ జరగనున్నాయి. ఈ వేడుకకు విద్యాప్రాంగణం ముస్తాబవుతోంది. పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూ అన్ని హంగులు సమకూరుస్తున్నారు. వాస్తవానికి 2019లోనే కళాశాల స్వర్ణోత్సవాలు జరుపుకోవాల్సి ఉంది. అనివార్య కారణాలు ముఖ్యంగా అప్పుడు వచ్చిన కొవిడ్‌ కారణంగా స్వర్ణోత్సవాలు జరగలేదు. అదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1950లో ఏర్పడి ప్రస్తుతం 75 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. దీంతో కళాశాల స్వర్ణోత్సవాలను కూడా నిర్వహించాలని నిర్ణయించి అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


దేశ, విదేశాల్లో పూర్వ విద్యార్థులు

కళాశాలలో చదివి డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, విదేశాలలో ఉన్నత ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరపడిన వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో అద్దేపల్లి నాగరాజు, మారెళ్ల మాధవి, కారెంపూడి శ్రీనివాసరావు తదితరులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పేరుప్రఖ్యాతులు గడించారు. కళాశాల అభివృద్ధికి దివంగత సీనియర్‌ జర్నలిస్ట్‌ బీసీ నారాయణ కుమారుడు ప్రవాస భారతీయుడు బత్తిన సతీ్‌షబాబు ఏటా బాలికలకు ప్రోత్సాహకాలు అందించి వారి విద్యాభివృద్ధికి చేదోడుగా నిలుస్తున్నారు. అంతేగాక కళాశాల అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యారు. అలాంటి వారందరినీ సమీకరించి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని హైస్కూలు ప్రధానోపాధ్యాయులు పెద్దిరెడ్డి కోటిరెడ్డి ఆరునెలలుగా అవిరళ కృషి చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు కోటిరెడ్డి సైతం ఈ కళాశాల పూర్వవిద్యార్థే కావటం విశేషం. ఆయన అటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను, కడియాల యానాదయ్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ను అభ్యసించారు.

తొలుత దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం ప్రారంభం

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రధానోపాధ్యాయులు కోటిరెడ్డి పెద్దిరెడ్డి ఆదిలక్ష్మి ఫౌండేషన్‌ ద్వారా మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకోలేని విద్యార్థినులక్డు భోజన సౌకర్యం కల్పించటంతో హాజరు శాతం పెరిగింది.

1987-92 బ్యాచ్‌ పూర్వవిద్యార్థుల సహకారంతో మోరపాకుల వెంకటసుబ్బారావు కళావేదికను ఏర్పాటు చేశారు. ఆ బ్యాచ్‌ విద్యార్థిని చుంచు కళ్యాణి కళావేదిక ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు తనవంతు సహకారాన్ని అందజేశారు. ఆదివారం జరగబోయే వేడుకలకు సంతనూతలపాడు శాసనసభ్యులు బీఎన్‌ విజయ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. అదేవిధంగా ఎంతోమంది ప్రముఖులు, పూర్వ విద్యార్థులు సైతం ఇందులో పాల్గొని దీనిని ఒక ఆనందకరమైన కుటుంబ పండుగలా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

Updated Date - Feb 08 , 2025 | 01:04 AM