Share News

జీజీహెచ్‌కు జబ్బు

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:30 AM

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)కి జబ్బు చేసింది. దానిని బాగు చేసేందుకు ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. సర్కారు ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా.. ఇక్కడ మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే రోగులకు అత్యవసరం (క్యాజువాలిటీ)లో వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి.

జీజీహెచ్‌కు జబ్బు

‘అత్యవసరం’కి అనారోగ్యం

క్యాజువాలిటీలో అందుబాటులో ఉండని వైద్యులు

హౌస్‌ సర్జన్‌లు, నర్సులతోనే నెట్టుకొస్తున్న వైనం

మెరుగైన వైద్యం కోసం ప్రైవేటుకు సిఫారసు

సమీక్షలకే పరిమితమవుతున్న వైద్యాధికారులు

పేదల పెద్దాసుపత్రిలో రోగులకు లభించని భరోసా

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)కి జబ్బు చేసింది. దానిని బాగు చేసేందుకు ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. సర్కారు ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా.. ఇక్కడ మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే రోగులకు అత్యవసరం (క్యాజువాలిటీ)లో వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. డ్యూటీ డాక్టర్లు, స్పెషలిస్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. జీజీహెచ్‌లో అన్ని వ్యాధులకూ స్పెషలిస్ట్‌ వైద్యులు ఉన్నప్పటికీ మెరుగైన సేవలు మృగ్యమయ్యాయి. పెద్దాసుపత్రిలో వైద్యం లభించక, ప్రైవేటు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చులు భరించలేక పేదలు అల్లాడుతున్నారు.

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : పేదల పెద్దాసుపత్రిగా ఉన్న జీజీహెచ్‌లో మొక్కుబడి వైద్యసేవలు లభిస్తుండటంతో జనం ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 8గంటల వరకు రోగుల నాడి పట్టుకుని పరీక్షించే వారే కరువయ్యారు. ఆయా స్పెషలిస్ట్‌ డాక్టర్లు డ్యూటీలో ఉండకపోగా క్యాజువాలిటీ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఇక్కడ డాక్టర్‌లుగా కొనసాగుతున్న కొందరుఎక్కువగా సొంత ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు అత్యధిక శాతం రోగులను చూడకుండానే గుంటూరు జీజీహెచ్‌కు, మరికొన్ని రకాల అత్యవసర వైద్యసేవలకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 8 నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకూ డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండాలి. వారు ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయా జబ్బును గుర్తించి సంబంధిత స్పెషలిస్ట్‌ డాక్టర్‌కు సమాచారం అందిస్తే వారు ప్రత్యేక సేవలు అందించాలి. స్పెషలిస్ట్‌ డాక్టర్లు రోజుకు ఒకరు చొప్పున సాయంత్రం 4 నుంచి ఉదయం 8గంటల వరకూ పూర్తి సమయం అత్యవసర వైద్య విభాగంలోనే ఉండాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. జీజీహెచ్‌లో విధుల్లో ఉండే డ్యూటీ నర్సులు, హౌస్‌ సర్జన్‌లు అత్యవసరంగా వచ్చేవారికి ప్రాఽథమిక చికిత్స చేసి ప్రైవేటుకు తరలించడం సర్వసాధారణమైంది.

క్యాజువాలిటీలో విధులు ఇలా...

సాధారణ వ్యాధులకు ఓపీ సేవలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అందుతున్నాయి. ఆయా వ్యాధులను బట్టి అక్కడి వైద్యులు పరీక్షలు చేసి మందులు రాసి ఇస్తారు. అవసరమైతే ఆస్పత్రిలో చేర్చుకుంటారు. అత్యవసర విభాగమైన క్యాజువాలిటీలో సిబ్బంది 24గంటలూ పనిచేయాలి. మూడు షిఫ్ట్‌లలో ఒక మెడికలాఫీసర్‌, వారికి సహాయకులుగా రకు క్యాజువాలిటీ విధులు నిర్వర్తించాలి. అత్యవసర కేసులు అయిన గుండెపోటు, రోడ్డుప్రమాదం, అగ్నిప్రమాదం, ఇతర ప్రమాదాలు, ఊపిరితిత్తులు, మొదడు సమస్యలు, పక్షవాతం, ఇలా పలు అత్యవసర వైద్య సేవలకు సంబంధించి బాధితులు ఆసుపత్రికి రాగానే పరీక్షించి సంబంధిత డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి. వారు వచ్చి తగిన పరీక్షలు చేసి వైద్యం అందించి రోగి ప్రాణాలు కాపాడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒక రోగిని అర్ధగంటలో పరీక్షించి అవసరమైన వైద్య సహాయం చేయాల్సి ఉండగా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే వారిని బెడ్‌పై ఉంచి నాలుగు గంటలైనా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా నేను కాదంటే నేను కాదు అంటూ తప్పించుకుంటున్నారు. అందరూ కలిసి సమన్వయంతో అందించాల్సిన అత్యవసర వైద్యసేవలను గాలికొదిలేస్తున్నారు. దీంతో ప్రతి అరగంటకు ఒక రోగి అత్యవసర విభాగానికి వస్తుండగా, అక్కడ బెడ్‌లు ఖాళీ ఉండటం లేదు. దీంతో మిగతా వారు ప్రైవేటు ఆసుత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తుంది.

భయపెట్టి బయటకు పంపుతున్నారు

రొప్పుతూ క్యాజువాలిటీకి వచ్చే రోగులను అక్కడి సిబ్బంది భయపెట్టి బయటకు పంపుతున్నారనేది కొందరి వాదన. ముఖ్యంగా 108లో జీజీహెచ్‌కి వచ్చి స్ర్టెచర్‌పై పడుకోబెట్టగానే అంబులెన్స్‌ సిబ్బంది నుంచి నర్సులు, డాక్టర్లు, ఇతర సహాయకులు రోగి తరఫు బంధువులను ఆందోళనకు గురిచేసి బయటకు పంపడం నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఇక్కడ సరైన వైద్యం అందదు, సౌకర్యాలు లేవని బయట ఆసుపత్రికి పొమ్మని సలహా ఇస్తున్నారు. అప్పటికీ రోగి బంధువులు వినకపోతే సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే తదితర పరీక్షలకు తీసుకెళ్లే సమయంలో అటెండర్‌ స్థాయి సిబ్బంది సైతం ఇదే మాటలు చెప్పడంతో వారు వణికిపోతున్నారు. చివరకు ప్రైవేటుకే వెళ్తామని అనేలా రోగి బంధువులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. వారే స్వయంగా అంబులెన్స్‌లకు ఫోన్‌ చేసి పిలిపించి, తమకు నిరంతర సంబంధాలు ఉండే ప్రైవేటు ఆసుపత్రికి పంపుతున్నారు. అక్కడి వారు వీరికి పెద్దమొత్తంలో కమీషన్‌ ఇస్తున్నట్లు విమర్శలున్నాయి.


సమీక్షలకే పరిమితమవుతున్న అధికారులు

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు తమ విధులను పక్కనపెట్టి అడ్మినిస్ట్రేషన్‌ బాధ్యతలకే పరిమితమైనట్లు సమాచారం. ప్రత్యేకించి సూపరింటెండెంట్‌, ఇతర వైద్యాధికారులు నిరంతరం వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడి అవసరమైన సేవలపై దృష్టి సారించాల్సి ఉంది. అంతేకాకుండా డాక్టర్లకు తగు ఆదేశాలు జారీచేసి, ప్రతి రోగికి మెరుగైన వైద్యసేవలు లభించేలాచర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలకు ఇబ్బందికలగకుండా చూడాలి. అయితే ఒంగోలులోని జీజీహెచ్‌లోని వైద్యాధికారులు మాత్రం తమ చాంబర్‌ వదిలి బయటకు రాని పరిస్థితి. ప్రతిరోజూ సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లు, నివేదికలు తప్ప పేదల ఆరోగ్యంపై పెద్దగా దృష్టి సారించడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. దీంతో డాక్టర్లు, నర్సులు, క్షేత్రస్థాయి సిబ్బంది సైతం వాచ్చామా.. పోయామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల ఆరోగ్యానికి భరోసా లభించడం లేదు. ఇప్పటికైనా జీజీహెచ్‌లో పేదలకు మెరుగైన వైద్య సేవలు లభించేలా జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

మా దృష్టికి వచ్చింది... పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం..

డాక్టర్‌ టి.జమున, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

క్యాజువాలిటీలో వైద్యసేవలు సక్రమంగా లేవనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై రెండు, మూడురోజుల్లో చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. దీంతోపాటు ఎంఎన్‌వో సిబ్బంది కూడా తగినంత మంది లేరు. దీనిపై పూర్తిస్థాయిలో చర్యలు చేపడతాం. వైద్యుల కొరతపై డీఎంఏకు తెలియజేశాం. రోగులకు సేవలందించడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారని పేషెంట్‌ తాలూకా బంధువులు కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. అలా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు, సిబ్బందిని హెచ్చరించాం. సమన్వయలోపం లేకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించాం.

Updated Date - Feb 12 , 2025 | 01:30 AM