గంజాయి గుప్పు .. గుప్పు
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:34 AM
గంజాయి అక్రమ రవాణా విక్రయ దారులపై ఉక్కుపాదం మోపుతాం, ఎంతటి వారినైనా కటకటాల్లోకి పంపిస్తాం, ఇది నిత్యం కళాశాలలో నిర్వహించే అవగాహన సదస్సులో పోలీసు అధికారులు చెప్పే మాట.

గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): గంజాయి అక్రమ రవాణా విక్రయ దారులపై ఉక్కుపాదం మోపుతాం, ఎంతటి వారినైనా కటకటాల్లోకి పంపిస్తాం, ఇది నిత్యం కళాశాలలో నిర్వహించే అవగాహన సదస్సులో పోలీసు అధికారులు చెప్పే మాట. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్న మాట. అయితే ప్రజాప్రతినిధుల, పోలీసు అధికారుల మాటలకు వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉంటోంది. పట్టపగలే గంజాయి మత్తులో కొందరు విద్యార్థులు ఉంటున్నారు. గంజాయి వినియోగం గిద్దలూరు ప్రాంతంలో విస్తృతంగా కనిపిస్తోంది. నాటి వైసీపీ ప్రభు త్వం అరాచక కార్యకలాపాలపై పట్టించు కోకపోవడం, చూసీచూడనట్లు వ్యవహరిం చడం వలన నేడు ఈ దుస్థితి ఏర్పడింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పోలీసుల కళ్లు గప్పి విక్రయాలు జరుపుతున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్లు, పలు కళాశాలల వద్ద విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల అర్భన్ సీఐ కె.సురేష్ ఒక మహిళతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసులు చర్యలు అడపా దడపా చేపడుతున్నప్పటికీ చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మత్తు సాగుతోంది.
పట్టించుకునే వారేరీ ?
గంజాయి విక్రయదారులపై పోలీసుల పూర్తిస్థాయి నిఘా కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. అందువల్లే ఈ ప్రాంతంలో గంజాయి సరఫరా జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు విద్యార్థులు కూడా జత అవుతున్నారు. గంజాయి రోజూ విజయవాడ, నెల్లూరు, గుంటూరు నుండి రైళ్లు, బస్సుల ద్వారా దిగుమతి అవుతున్నట్లు సమాచారం. ఇలా వచ్చాక ముందుగానే ఎంచుకున్న ప్రాంతాలకు వెళ్ళి విక్రయిస్తు న్నారు. అలాగే వీరివద్ద నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గంజాయి స్మగ్లర్లతో స్థానిక గంజాయి విక్రయదారులు కూడా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.