ఆర్టీసీకి సం‘క్రాంతి’
ABN , Publish Date - Jan 23 , 2025 | 01:54 AM
ఈ ఏడాది సంక్రాంతి ప్రజలకే కాదు.. ఆర్టీసీకి పెద్ద పండుగే అయ్యింది. గత ఐదేళ్లలో సరైన వనరులు లేక, కాలం చెల్లిన బస్సులతో ఎలాగోలా నెట్టుకురాగా.. ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బస్సులను తొలగించడంతోపాటు అవసరమైన డిపోలకు కొత్తవి ఏర్పాటు చేసింది.
పండుగకు 721ప్రత్యేక బస్సు సర్వీసులు
ప్రకాశం రీజియన్‌కు రూ.1.69కోట్ల ఆదాయం
అత్యధికంగా కనిగిరి డిపో నుంచే రాకపోకలు
ఒంగోలు, కార్పొరేషన్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది సంక్రాంతి ప్రజలకే కాదు.. ఆర్టీసీకి పెద్ద పండుగే అయ్యింది. గత ఐదేళ్లలో సరైన వనరులు లేక, కాలం చెల్లిన బస్సులతో ఎలాగోలా నెట్టుకురాగా.. ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బస్సులను తొలగించడంతోపాటు అవసరమైన డిపోలకు కొత్తవి ఏర్పాటు చేసింది. దీంతో పెద్ద పండుగకు నగరాల నుంచి వచ్చే వారంతా ఆర్టీసీ వైపే మొగ్గుచూపారు. అటు ప్రైవేటు ట్రావెల్స్‌లో చార్జీల మోతతో భయపడిన ప్రయాణికులు సాధారణ చార్జీలతోనే ఆర్టీసీలో ప్రయాణించారు. ఈ సంక్రాంతికి జనవరి10 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని ఐదు డిపోల నుంచి721 ప్రత్యేక బస్సులను నడిపారు. రూ.1.69కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో జిల్లాలోని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలుతోపాటు గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, పొదిలి డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపగా, అత్యధికంగా కనిగిరి డిపో నుంచే తిరిగాయి. వచ్చిన ఆదాయంలో అత్యధికంగా కనిగిరి డిపో నుంచే రావడం విశేషం. మొత్తంగా ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నా ఆర్టీసీకి ఈ సంక్రాంతి ఆదాయ వనరులు పెంచింది.
60 వేల మంది ప్రయాణికులు..
ఈ ఏడాది సంక్రాంతికి సుమారు 60వేల మంది జిల్లాలోని తమ సొంతూర్లకు వచ్చి తిరిగి వెళ్లారు. జిల్లాకేంద్రమైన ఒంగోలు నుంచి 168 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయగా 9,756 మంది ప్రయాణించారు. కనిగిరి డిపో నుంచి 253 ప్రత్యేక బస్సులు నడపగా 27,737 మంది రాకపోకలు సాగించారు. మార్కాపురం డిపో నుంచి 122 బస్సులలో 9,013 మంది, పొదిలి నుంచి 108 బస్సులలో 9,692 మంది, గిద్దలూరు నుంచి 70 బస్సులలో 2,908మంది ప్రయాణించారు. కనిగిరి, ఒంగోలు, మార్కాపురం డిపోలనుంచి అధికంగా ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మొత్తం 721 ప్రత్యేక బస్సులు 4,68,534 కి.మీ రాకపోకలు సాగించగా రూ.1,69,30,555 ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. గతేడాది సంక్రాంతికి 504 బస్సులు 3,40,601 కి.మీ నడపగా, రూ.1,23,97,820 ఆదాయం వచ్చిందని తెలిపారు.
ప్రయాణికులకు కృతజ్ఞతలు
మురళీబాబు, ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఆర్‌ఎం
సంక్రాంతి పండుగకు ఆర్టీసీలో ప్రయాణించి ఆదాయవనరులు పెంచిన ప్రయాణికులకు జిల్లా రీజియన్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రైవేటు ట్రావెల్స్‌ను కాదని సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీతోనే అని నమ్మిన ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసిన సిబ్బందిని అభినందిస్తున్నాం. సాధారణ చార్జీలతోనే రీజియన్‌లో రూ.1.69 ఆదాయం రావడం సంతోషంగా ఉంది. అందుకోసం ముందుగా ప్రయాణికులతోపాటు, ఆయా డిపో మేనేజర్లు, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్త్తున్నాం. సమష్టి కృషితో ఇలాగే భవిష్యత్‌లో ఆర్టీసీని అన్నివిధాలా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళతాం.