ఎన్టీఆర్ పార్కు అభివృద్ధికి వేగంగా అడుగులు
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:32 PM
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’ పేరుతో చేపట్టిన వినూత్న కార్యక్రమానికి స్పందన లభిస్తోంది

‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’తో మార్పు మొదలు
37వ డివిజన్‌లో సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి
ఒంగోలు, కార్పొరేషన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’ పేరుతో చేపట్టిన వినూత్న కార్యక్రమానికి స్పందన లభిస్తోంది ఈనెల28న ఒంగోలు నగరంలోని 37వ డివిజన్‌లో గల చెన్నకేశవస్వామి లేఅవుట్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలపై.. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన సూచనలతో కార్పొరేషన్ అధికారులు కదిలారు. ఇరవై రోజుల్లో పార్కులో సమస్యలు పరిష్కరిస్తామని దామచర్ల హామీ ఇవ్వడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా, కార్యక్రమం జరిగిన 48 గంటల్లోనే అధికారులు పార్కులో పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం కమిషనరు డాక్టర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ చెన్నుపాటి వేణుతోపాటు పార్కు అభివృద్ధి కమిటీతో కలిసి పరిశీలించారు. పార్కు ఆవరణలోని మైదానం లెవలింగ్‌తోపాటు, వాకర్స్ కోసం మట్టితో ట్రాక్, అలాగే పార్కులో వర్షం కురిసినపుడు నీరు నిల్వ లేకుండా బయటకు వెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై కమిషనరు పరిశీలించారు. ఇంజనీర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసమస్యల పరిష్కారం చర్చవేదిక ద్వారా పలు సమ్యలపై దృష్టి సారించామన్నారు. తొలుత ఎమ్మెల్యే సూచనలతో పార్కు అభివృద్ధి, అక్కడి నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డివిజన్‌లోని అన్ని కాలనీల నుంచి వచ్చిన అర్జీలను ప్రాధాన్యత ప్రకారం, నిధుల సౌలభ్యతను బట్టి పరిష్కరిస్తామని చెప్పారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఫిబ్రవరి మొదటి వారంలో వార్డుకో వారం కార్యక్రమాన్ని నిర్వహించి, పారిశుధ్యం సమస్య, దోమల నివారణ, అలాగే పింఛన్, రేషన్ కార్డులు, ఖాళీ స్థలాల్లో మురుగునీరు నిల్వ, వ్యర్థాలు ఉండటం వంటి తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ప్రధానంగా వీలైనంత త్వరలోనే సైడు కాలువలు నిర్మిస్తామని చెప్పారు. డివిజన్‌లో సమస్యల పరిష్కారం కోసం రూ.10 కోట్లు అవసరమున్నట్లు గుర్తించామని, వాటికి ప్రతిపాదనలు తయారు చేసి ఆమోదం లభించాక దశల వారీగా పనులు చేపడతామని వివరించారు. కార్పొరేటర్ చెన్నుపాటి వేణు మాట్లాడుతూ ఈనెల 28న జరిగిన చర్చా వేదికలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే, కార్పొరేషన్ అధికారులతో మాట్లాడుతున్నామని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ చెంచయ్య, డీఈ అనీల్, ఎన్టీఆర్ పార్కు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు చెన్నుపాటి ప్రసాద్, కుర్రా భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.