అర్ధంతరంగా ఆగిన రైతుబజారు
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:38 PM
దర్శి ప్రాంతంలో కూరగాయలు, పండ్లు, పూల తోటలు సాగుచేసే రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు వీలుగా పట్టణంలోని కురిచేడు రోడ్డులో నిర్మాణం చేపట్టిన రైతుబజారు ఏడాదిగా మధ్యలోనే నిలిచిపోయింది. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో నిధులు విడుదల చేయలేదు.

ఏడాదిగా నిలిచిపోయిన పనులు
గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం
కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
దర్శి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): దర్శి ప్రాంతంలో కూరగాయలు, పండ్లు, పూల తోటలు సాగుచేసే రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు వీలుగా పట్టణంలోని కురిచేడు రోడ్డులో నిర్మాణం చేపట్టిన రైతుబజారు ఏడాదిగా మధ్యలోనే నిలిచిపోయింది. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో నిధులు విడుదల చేయలేదు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు వదిలేశారు. ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారటంతో సంబంధిత కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. అప్పటినుంచిరైతుబజారు నిర్మాణం అలాగే ఉన్నది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గోడలు వెక్కిరిస్తున్నాయి.
దర్శి ప్రాంతంలో ముమ్మరంగా కూరగాయలు, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, డ్రాగిన్ తదితర పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వారు నిల్వ చేసుకొని విక్రయించుకునే అవకాశంలేక పొలాల్లో నుంచే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైతులకు ఎంతో ఉపయోగం కల్గే రైతుబజారు నిర్మాణం మధ్యలో నిలచిపోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుబజారు నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ ద్వారా రూ.80 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఇందులో 50 రూములు నిర్మాణం చేపట్టారు. అందులో 42 రూములు కూరగాయలు పండించే రైతులకు, మిగిలిన రూములు ఇతర పంటలు పండించే రైతులకు కేటాయించేందుకు వీలుగా షాపుల నిర్మాణం చేపట్టారు. అయితే, గోడలు నిర్మించి వదిలేయటంతో మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో రైతుబజారు నిర్మాణానికి చర్యలు తీసుకుంటారని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యను గుర్తించి రైతుబజారు నిర్మాణ పనులను పునఃప్రారంభించాలని కోరుతున్నారు.