వసతులు మెరుగు పడాల్సిందే
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:44 AM
వసతిగృహాల్లోని విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్యను అందించడంతో పాటు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.

ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి హామీ
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వసతిగృహాల్లోని విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్యను అందించడంతో పాటు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం రాత్రి పట్టణంలోని వెనుకబడిన తర గతుల బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. వసతిగృహంలోని విద్యార్థులతో ఆయన మాట్లాడారు. భోజన సదుపాయాలు, విద్యను బోధించే విధానం, మెనూ ప్రకారం ఏ విధంగా భోజనం అందిస్తున్నారని ఆరా తీశారు. కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారిన ఎమ్మెల్యే విద్యార్థుల పుస్తకాలు తీసుకుని వారు ఏ విధంగా చదువుతున్నారో ప్రశ్నలు వేసి జవాబు రాబట్టారు. భవిష్యత్తులో వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను పరిశీలించారు. పలు తరగతులలో ఆరుబయట విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో తక్షణమే మరమ్మతులు చేయాలన్నారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. భవనంలో పెచ్చులూడుతున్న గోడలను చూసి మరమత్తులు చేయించాలని ఆదేశించారు. తనిఖీలో ఏఎస్‌డబ్ల్యూ సుబ్బారావు, వార్డెన్ రోజా, కౌన్సిలర్లు లొక్కు రమేష్, టీడీపీ నాయకులు పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, బిల్లా రమేష్, వాడకట్టు రామాంజ నేయులు, ఉన్నారు.
రూ.6 కోట్లతో వసతి గృహాల ఏర్పాటు
నియోజకవర్గంలో రూ.6 కోట్లతో వసతి గృహాలను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలో పలు సంక్షేమ హాస్టళ్ల అవసరం దృష్ట్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగా రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంజూ రైన నిధులను స్థలపరిశీలన పూర్తయిన తరువాత నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రూ.1.95 కోట్లతో ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరలో పనులు చేపట్టను న్నట్లు తెలిపారు. త్వరలో అన్ని వసతి గృహాలను అభివృద్ధి చేస్తామన్నారు.