మర్చిపోయావా.. మార్చేస్తున్నావా?
ABN , Publish Date - Feb 25 , 2025 | 01:43 AM
ఎర్రగొండపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ రాజకీయ నడకను వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అనుమానిస్తున్నారా.. లేక యథాప్రకారం అవమానించారా..? ఇది రాజకీయవర్గాల్లోనే కాక ఆ పార్టీలోనూ చర్చనీయాంశమైన అంశం. వైసీపీ శ్రేణుల్లో రకరకాల ఊహగానాలు వెలువడుతుండగా తలపండిన రాజకీయ నాయకులు మాత్రం జగన్ అంతే.. మారడంతే అని వ్యాఖ్యానిస్తున్నారు.
వైపాలెం ఎమ్మెల్యేపై జగన్ కామెంట్
సొంత పార్టీలో విస్తృత చర్చ
బాలినేనితో జతకడతారనే అనుమానం
జిల్లా నేతల నుంచి జగన్‌కు ఫిర్యాదులు
చంద్రశేఖర్ అనుయాయుల్లో నాయకత్వంపై అసంతృప్తి
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
ఎర్రగొండపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ రాజకీయ నడకను వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అనుమానిస్తున్నారా.. లేక యథాప్రకారం అవమానించారా..? ఇది రాజకీయవర్గాల్లోనే కాక ఆ పార్టీలోనూ చర్చనీయాంశమైన అంశం. వైసీపీ శ్రేణుల్లో రకరకాల ఊహగానాలు వెలువడుతుండగా తలపండిన రాజకీయ నాయకులు మాత్రం జగన్ అంతే.. మారడంతే అని వ్యాఖ్యానిస్తున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో చంద్రశేఖర్‌ను ఉద్దేశించి జగన్ కామెంట్ చేశారు. తనతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలంతా పార్టీ కండువాలతో జగన్‌ను అనుసరించారు. చంద్రశేఖర్ మాత్రం వేసుకోలేదు. అది చూసిన జగన్ నీ మెడలో పార్టీ కండువా ఏది అని అడగారు. వెంటనే చంద్రశేఖర్ హడావుడిగా వస్తూ మర్చిపోయానని సమాధానమిచ్చారు. వెనువెంటనే జగన్ మర్చిపోయావా.. మార్చేయాలనుకుంటు న్నావా? అంటూ అందరి ముందే బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీంతో చిన్నబోయిన చంద్రశేఖర్ నిశ్శబ్దంగా వెనక్కు వెళ్లిపోయారు. అయితే తనతోపాటు ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా దళిత వర్గానికి చెందిన చంద్రశేఖర్‌ను అందరిలో జగన్ అలా కించపర్చటం రకరకాల విమర్శలకు తావిచ్చింది. తన వద్ద ఉన్న సమాచారం మేరకు చంద్రశేఖర్ భవిష్యత్తు రాజకీయ నడకపై అనుమానంతోనే ఆ వ్యాఖ్యానం చేశారని వైసీపీ శ్రేణుల్లో కొందరు భావిస్తున్నారు. తోటి నాయకులను ప్రత్యేకించి దళిత నాయకులను చిన్నచూపు చూడటం జగన్‌కు అలవాటేనని అదే ఇక్కడ ప్రతిబింబించిందని వారి అభిప్రాయం.
బాలినేని ప్రభావం..
వైసీపీకి ఇటీవల రాజీనామా చేసి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేనితో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తనకున్న సమాచారంతోనే జగన్ అలా వ్యాఖ్యా నించి ఉంటారని ఎక్కువ మంది భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం వైసీపీ టిక్కెట్ చంద్రశేఖర్‌కు రావడంలో బాలినేని మద్దతే కీలకం. అయితే బాలినేని జనసేనలోకి వెళ్లగానే చంద్రశే ఖర్ కూడా పార్టీ మారే అవకాశాలపై చర్చ జరిగింది. కానీ ఆయన తాను వైసీపీలోనే ఉంటానని ప్రకటించటంతోపాటు అప్పటి నుంచి నియోజకవర్గ, జిల్లాలోనూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు న్నారు. ఇప్పటికీ వైసీపీ పిలుపిచ్చిన కార్యక్రమాల నిర్వహణలో ఆయన జిల్లాలో అందరికంటే ముందున్నారు. అయినా జగన్ అలా అనటంలో ఏదో సమాచారం ఉండే ఉంటుందని వైసీపీలో ఒక వర్గం భావిస్తోంది. అయితే చంద్రశేఖర్ అనుయాయులు, సాధార ణ వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు జగన్‌కు కొందరు చంద్రశేఖర్‌పై ఫిర్యాదులు చేశారనే భావన కూడా వ్యక్తమవుతోంది. దళితవర్గానికి చెందిన చంద్రశేఖర్ ఇలానే ముందుకు సాగితే జగన్ మద్దతుతో జిల్లా పార్టీలో పెత్తనం చెలాయిస్తారన్న భావనతో ఇద్దరు నాయకులు జగన్‌కు చంద్రశేఖర్‌పై పదేపదే ఫిర్యాదులు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం బాలినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలో కలవనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చంద్రశే ఖర్‌పై జగన్ చేసిన కామెంట్ వైసీపీలో దుమారం లేపే అవకాశం లేకపోలేదు.