Share News

పల్లె పండగ పనుల బిల్లుల చెల్లింపులో జాప్యం

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:27 PM

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలలో పల్లె పండగ పేరుతో పెద్ద ఎత్తున సిమెంట్‌ రోడ్లు, మురుగు కాలవలు, రైతులుకు గోకులం షెడ్లను నిర్మించింది. అధికారులు పనులు చేసిన వెంటనే వారంవారం బిల్లుల చెల్లింపులు అని చెప్పడంతో గ్రామాల్లో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు లక్షలు పెట్టుబడులు పెట్టి శరవేగంగా పనులు చేపట్టారు.

పల్లె పండగ పనుల బిల్లుల చెల్లింపులో జాప్యం
బల్లికురవ మండలంలో మూడు నెలల కిందట వేసిన సీసీ రోడ్డు

పలు గ్రామాలలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, గోకులం షెడ్ల నిర్మాణం

నెలలు గడుస్తున్నా అందని డబ్బులు

కాంట్రాక్టర్ల లబోదిబో

మండలంలో సుమారు. రూ.4 కోట్ల నిధులతో నిర్వహణ

బల్లికురవ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలలో పల్లె పండగ పేరుతో పెద్ద ఎత్తున సిమెంట్‌ రోడ్లు, మురుగు కాలవలు, రైతులుకు గోకులం షెడ్లను నిర్మించింది. అధికారులు పనులు చేసిన వెంటనే వారంవారం బిల్లుల చెల్లింపులు అని చెప్పడంతో గ్రామాల్లో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు లక్షలు పెట్టుబడులు పెట్టి శరవేగంగా పనులు చేపట్టారు. కానీ పనులు చేసి నెలలు అవుతున్నా నేటికీ బిల్లులు చెల్లింపులు లేకపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. అధికారులు దగ్గరుండి నాణ్యతతో సిమెంట్‌ పనులు చేయించారని, వెంటనే బిల్లులు చెల్లించకపోతే నష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పనులు చేపట్టిన కొత్త కాంట్రాక్టర్లు తమ బిల్లులు ఎప్పుడు వస్తాయో అని ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రతి శుక్రవారం బిల్లుల జమ అవుతాయని చెప్పడంతో వారాలు మారుతున్నా బిల్లులు రావడం లేదని అంటున్నారు.

మండలంలోని 21 గ్రామ పంచాయతీకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలకు గాను 39 పనులకు సుమారు రూ.4కోట్ల నిధులను ఉపాధి కింద మంజూరు చేసింది. నవంబర్‌లో వేసిన రోడ్లకు కూడా ఇంత వరకు బిల్లులు చెల్లింపులు జరగలేదు. ఇప్పుడు పనులు చేసిన వారు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. తాము పనులు చేసిన వెంటనే క్వాలిటీ అధికార్ల బృందం కూడా వచ్చి తనిఖీలు చేసిందని అయినా బిల్లులు రాలేదని చెప్తున్నారు. మండలంలో పాడి రైతులకు 17 గోకులం షెడ్లు కూడా మంజూరు కాగా, కొందరు రైతులు పెట్టుబడులు పెట్టి పూర్తి శాతం పనులు చేశారని వారికి కూడా ఇంత వరకు నగదు రాలేదని వారు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే చేసిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:27 PM