కిక్కిరిశాయి!
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:58 AM
భూముల విలువ శనివారం నుంచి పెరగనుండటంతో క్రయవిక్రయదారులతో రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు రిజిస్ర్టేషన్లు కొనసాగాయి. గత రెండు రోజుల్లోనే జిల్లావ్యాప్తంగా 1,300కుపైగా దస్తావేజులను రిజిస్టర్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా రాష్ట్రవాప్తంగా అన్ని కార్యాలయాలలో ఒకేసారి భారీసంఖ్యలో కంప్యూటర్లు పనిచేయడం కారణంగా శుక్రవారం సర్వర్ డౌన్ అయ్యింది.
భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు
నేటి నుంచి పెరగనున్న భూ విలువలు
సర్వర్ డౌన్‌తో క్రయవిక్రయదారుల అవస్థలు
రాత్రి పొద్దుపోయే వరకు కార్యాలయాల వద్ద రద్దీ
ఒంగోలుక్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : భూముల విలువ శనివారం నుంచి పెరగనుండటంతో క్రయవిక్రయదారులతో రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు రిజిస్ర్టేషన్లు కొనసాగాయి. గత రెండు రోజుల్లోనే జిల్లావ్యాప్తంగా 1,300కుపైగా దస్తావేజులను రిజిస్టర్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా రాష్ట్రవాప్తంగా అన్ని కార్యాలయాలలో ఒకేసారి భారీసంఖ్యలో కంప్యూటర్లు పనిచేయడం కారణంగా శుక్రవారం సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో మందకొడిగా రిజిస్ట్రేషన్ ప్రకియ జరిగింది. జిల్లాలో 12 రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా కనిగిరి, దర్శి, మార్కాపురం, ఒంగోలు, సింగరాయకొండ, పొదిలి ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో క్రయవిక్రయదారులు తమ ఆస్తులను రిజిస్టరు చేయించుకున్నారు. సాధారణ రివిజన్ అన్ని ప్రాంతాలలో జరిగి నాలుగేళ్లు కావడంతో బహిరంగ మార్కెట్‌కు సమాంతరంగా భూవిలువలను పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఆమేరకు విలువల పెంపునకు శ్రీకారం చుట్టింది. 10 నుంచి 20శాతం పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో పాత ధరలతో ఇప్పటికే క్రయవిక్రయాలు జరిగిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంబంధిత కార్యాలయాల వద్ద ప్రజలు కిక్కిరిసిపోయారు.
సర్వర్ డౌన్‌తో పడిగాపులు
ఒకేసారి రాష్ట్రమంతా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలతో సర్వర్ డౌన్ అయింది. దీంతో ప్రక్రియ మందకొడిగా సాగింది. క్రయ, విక్రయదారులు ఉదయం నుంచి కార్యాలయాల వద్ద అవస్థలు పడ్డారు. అదేక్రమంలో రోజు మారితే చార్జీలు అదనంగా చెల్లించాలనే భయంతో తమ దస్తావేజులను రిజిస్టర్ చేయించుకునేందుకు ఎక్కవ మంది అధికారులకు సిఫార్సులు కూడా చేయించుకున్నారు. సర్వర్ డౌన్ కారణంగా రాత్రి పొద్దుపోయే వరకు ప్రక్రియ కొనసాగింది.
నేటి నుంచి పెరగనున్న భూముల విలువ
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సామాన్యులపై భారం పడకుండా రియల్ ఎస్టేట్ వ్యపారాలు ఉన్న ప్రాంతంలో 10 నుంచి 20శాతం ధరలు పెంచారు. ఇప్పటికే ఎక్కువ ధరలు ఉన్న చోట ప్రస్తుత అలాగే ఉంచారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి పెరిగిన ఽవిలువలు అమలులోకి వస్తాయి.
రెండు రోజులలో భారీగా రిజిస్ట్రేషన్లు
జిల్లాలో 12 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలలో గురు, శుక్రవారాల్లో 1,300కుపైగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం సింగరాయకొండలో 69, ఒంగోలులో 87, అమ్మనబ్రోలులో 17, కనిగిరిలో 106, సంతనూతలపాడులో 25, పొదిలిలో 62, యర్రగొండపాలెంలో 23, చీమకుర్తిలో 36, గిద్దలూరులో 33, మార్కాపురంలో 95, దర్శిలో 105, కంభంలో 24 దస్తావేజులు పూర్తయ్యాయి. అందిన సమాచారం మేరకు శుక్రవారం ఒంగోలులో 70, మార్కాపురంలో 59, దర్శిలో 80, కనిగిరిలో 75 జరిగాయి.