Share News

పంట కాలువకు.. ప్రైవేటు సోకులు!

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:11 AM

మార్కాపురంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేయడం, అమాయకులను మోసం చేయడం ఇక్కడ పరిపాటైంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన మోసాలను నేటికీ కొనసాగిస్తున్నారు.

పంట కాలువకు.. ప్రైవేటు సోకులు!
అక్రమంగా జరుగుతున్న పంట కాలువ లైనింగ్‌ పనులు

ఇరిగేషన్‌ శాఖ అనుమతులు లేకుండానే ఆధునికీకరణ

కాలువను కుదించి కొంతమేర వెంచర్‌లో కలిపేసుకున్న వైసీపీ వ్యాపారులు

అక్కడ అన్నీ అక్రమాలే..

మార్కాపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మార్కాపురంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేయడం, అమాయకులను మోసం చేయడం ఇక్కడ పరిపాటైంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన మోసాలను నేటికీ కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతులు లేని లేఅవుట్‌లను తొలగిస్తామని రెండు మాసాల క్రితం మునిసిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం చాలా మందికి నోటీసులు ఇచ్చింది. అయినా రియల్‌ వ్యాపారులకు చీమకుట్టినట్లైనా లేదు. అనుమతులు లేకుండా లేఅవుట్‌లు వేయడమేకాక చివరికి ఇరిగేషన్‌ పంట కాలువలను కూడా వదలడం లేదు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు తెలియకుండా పంట కాలువను కొంతమేర వెంచర్‌లో కలిపేసుకుని పైకి మాత్రం ఆధునికీకరణ కలరింగ్‌ ఇస్తున్నారు. వెంచర్‌ సిండికేట్‌లో మొత్తం వైసీపీకి చెందిన వాళ్లే ఉన్నా ఓ టీడీపీ నాయకుడికి కూడా కొంతమేర వాటా ఉండటంతో అధికార యంత్రాంగం ఆ వైపు కన్నెత్తిచూసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. ఇదే వెంచర్‌లో రూ.15కోట్ల విలువైన స్థలాన్ని ఇప్పటికే దొంగ రిజిస్ట్రేషన్‌లతో కొట్టేశారు. ప్లాట్లను త్వరగా అమ్ముకుని బయట పడేందుకే అనుమతులు లేకుండానే పంట కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది.

అక్రమాలమయం ఆవెంచర్‌

స్థానిక ఎస్‌వీకేపీ డిగ్రీ కళాశాల ఎదు రుగా 889 సర్వే నెంబర్‌లో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు కొందరు ఓ వెంచర్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. తొలుత ఆర్‌అండ్‌బీ స్థలంలో దశాబ్దాలుగా తలదాచుకుంటున్న వారిని అన్నిరకాల ప్రలోభాలకు గురిచేసి తరిమేశారు. ఎదురు తిరిగిన కొందరు మైనారిటీలను బెదిరించి మరీ రోడ్డున పడేశారు. ఆర్‌అండ్‌బీ రహ దారిని ఆనుకుని ఉన్న 206 సర్వే నెంబర్‌లోని కాలువ పోరంబోకును కూడా పూర్తిగా ఆక్రమించేశారు. అంతేకాక ఓ వ్యక్తికి చెందిన వారసులు ఎవరూ లేకపోవడంతో సుమారు రూ.15 కోట్ల విలువ చేసే 31సెంట్ల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్‌తో కలిపేసు కున్నారు. ఈ లోపు ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు చేయరాని అన్ని పనులు చేసిన రియల్‌ వ్యాపారుల సిండికేట్‌ టీడీపీకి చెందిన ఓ కీలక నాయకునికి వాటా ఇచ్చింది. దానికి ప్రతిఫలంగా తొలుత ఆ వెంచ ర్‌ వెనుకనే ఉన్న టీడీపీ నాయకుని వెంచర్‌లోకి రహదారిని నిర్మించుకునేందుకు అనుమతిచ్చారు. ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి నేరుగా టీడీపీ నాయకుని వెంచర్‌లోకి పోయేందుకు మార్గం సుగమం కావడంతో ధరలు రెట్టింపయ్యాయి. కాలువ పోరంబోకు ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్‌ల గురించి ఓ వ్యక్తి స్థానిక అఽధికారుల నుంచి హైకోర్టు వరకు వెళ్లి వైసీపీ రియల్‌ వ్యాపారులపై పోరాడుతున్నా పట్టించుకున్న నాథుడే లేకపోవడం విడ్డూరం.

ఎందుకీ ఆధునికీకరణ పనులు

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల అక్రమాలకు పాల్పడిన ఆ పార్టీ వర్గీయుల సిండికేట్‌.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా తీరు మార్చుకోలేదు. టీడీపీలో కీలక నాయకుడిని జత కలుపుకొని మరిన్ని అక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. సదరు వెంచర్‌కు పడ మర వైపున ఉన్న పంట కాలువలో కొంతమేర కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశారు. అనుకున్నదే తడవుగా అనుమతులు లేకుండానే పంట కాలువ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. అటు, ఇటు బర్మ్స్‌తో కలుపుకొని సుమారు 3 మీటర్లు వెడల్పు ఉండాల్సిన కాలువను 2 మీటర్లకు కుదించి లైనింగ్‌ పను లు చేపట్టారు. ప్రస్తుతం ఆ వెంచర్‌లో గజం విలువ రూ.50వేలతో అమ్మకాలు జరుగుతున్నాయి. కాలువ లైనింగ్‌ పనుల మాటున ఎంతలేదన్నా 250 గజాలకు పైగానే స్థలాన్ని వెంచర్‌లో కలుపుకోవడంతో ఇంచుమించు రూ. కోటికిపైన అక్రమ ఆదాయం సమకూరనుంది.

Updated Date - Feb 15 , 2025 | 01:11 AM