భూ అక్రమాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:46 AM
జిల్లాలో భూ అక్రమాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీసీఎల్‌ఏ) ఆర్‌పీ సిసోడియా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో ఆర్డీవోలు, తహసీల్దార్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వచ్చిన రెవెన్యూ సంబంధ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు.

చట్టానికి ఎవరూ అతీతం కాదు
సిబ్బంది అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలి
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ అక్రమాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీసీఎల్‌ఏ) ఆర్‌పీ సిసోడియా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో ఆర్డీవోలు, తహసీల్దార్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వచ్చిన రెవెన్యూ సంబంధ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ వివరించారు. అనంతరం సిసోడియా మాట్లాడుతూ ఎన్నికలు, ప్రకృతి విపత్తుల సమయాల్లో రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధి, అంకితభావంతో సమర్థవంతంగా పనిచేస్తారనే గుర్తింపు ఉందన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో కూడా అదేవిధంగా పనిచేయాలన్నారు. శాఖ ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరైనా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రధానంగా గ్రీవెన్స్‌లో 60శాతం వరకు రెవెన్యూకు సంబంధించిన సమస్యలనే ప్రజలు ప్రస్తావిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తమ స్థాయిలో పరిష్కరించలేని సమస్యలైతే అదే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై తహసీల్దార్లకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి
చట్టానికి ఎవరు అతీతులు కాదని, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సిసోడియా ఆదేశించారు. కేవలం వీఆర్వో నివేదికపైనే ఆధారపడకుండా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు నిత్యం క్షేత్రస్థాయిలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు కూడా ఎప్పుడూ మండలకేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. సర్వే శాఖలో తగినంత సిబ్బంది ఉన్నందున విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 120 డ్రోన్ల ద్వారా రీసర్వేను వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు భూములను 22(ఏ) జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేయడం తగదని హితవు పలికారు. ఇలాంటి భూముల కేసులను జిల్లా స్థాయి కమిటీలో చర్చించాలని సూచించారు. ప్రభుత్వ భూములు మాత్రం అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందన్నారు. గ్రామ స్థాయిలోని వీఆర్వోలు ఈవిషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కోర్టు కేసులు, లోక్ ఆదాలత్ కేసులను పర్యవేక్షిస్తూ సత్వరమే పరిష్కారానికి అవసరమైన పిటిషన్లు వేయాలని సిసోడియా ఆదేశించారు.
మార్చి మొదటివారం నాటికి పరిష్కరిస్తాం
కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ గ్రీవెన్స్ అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను మార్చి మొదటి వారం నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. సీసీఎల్‌ఏ ఆదేశాలు, సూచనల మేరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేషు, ఆర్డీవోలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్థన్‌రెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ పుష్పలత, జిల్లా రిజిస్ర్టార్ బాలాంజనేయులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్‌బాషా, హౌసింగ్ పీడీ శ్రీనివాసప్రసాద్, అసిస్టెంట్ ఫారెస్టు కన్జర్వేటర్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.