వ్యవసాయ రంగంపై కుట్ర
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:21 PM
దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయమార్కెటింగ్ చట్టాన్ని తీసుకువచ్చిందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ఆరోపించారు.

కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం పావులు
అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య
ఒంగోలు కలెక్టరేట్, పిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయమార్కెటింగ్ చట్టాన్ని తీసుకువచ్చిందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ఆరోపించారు. స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెబుతూ మూడు నల్లచట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా ఇచ్చిన హామీని మరిచి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కొత్త వ్యవసాయ మార్కెటింగ్‌చట్టాలను తీసుకురావడం దుర్మార్గంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే స్వామినాఽథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. ప్రస్తుతం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మద్దతు ధరలకోసం మార్చి 5నుంచి 10 వతేదీ వరకు నిరవధిక ధర్నాలు, నిరాహారదీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మిర్చిక్వింటాకు రూ. 20వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు చంద్రబాబు ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని కోరారు. ఏప్రిల్ 15నుంచి మూడు రోజుల పాటు అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే వీరారెడ్డి, వడ్డే హనుమారెడ్డి, ఉప్పుటూరి ప్రకాశరావు, కరవది సుబ్బారావు, శివారెడ్డి తదితరులు ఉన్నారు.