నాడు ఆర్భాటంగా జగనన్న కాలనీలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:51 PM
కొత్త కాలనీలు కాదు.. కొత్తగా ఊర్లే ఏర్పడుతున్నాయి... వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్క నేత నుంచి వచ్చిన మాటలు... అయితే ఇప్పుడు ఆయా కాలనీలలో పరిస్థితులు గమనిస్తే కనీసం చిట్టడవులను తలపించేలా ఆయా కాలనీలు ఉన్నాయి. నాయకుల మాటలు నమ్మి ఇళ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారుల బిక్కుబిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన జగనన్నకాలనీలు... అప్పటి అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఇళ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

కనీస వసతులు కల్పించని వైసీపీ ప్రభుత్వం
లబ్ధిదారులకు శాపంగా మారిన వైనం
లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలు
ఉండలేక.. వెళ్లలేక.. సతమతం
అద్దంకి, ఫిబ్రవరి 13 (ఆంద్రజ్యోతి) : కొత్త కాలనీలు కాదు.. కొత్తగా ఊర్లే ఏర్పడుతున్నాయి... వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్క నేత నుంచి వచ్చిన మాటలు... అయితే ఇప్పుడు ఆయా కాలనీలలో పరిస్థితులు గమనిస్తే కనీసం చిట్టడవులను తలపించేలా ఆయా కాలనీలు ఉన్నాయి. నాయకుల మాటలు నమ్మి ఇళ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారుల బిక్కుబిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన జగనన్నకాలనీలు... అప్పటి అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఇళ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ళ నిర్మాణం చేసుకున్న లబ్దిదారులు కనీస వసతులు కూడా లేకపోవటం తో అక్కడ ఉండలేక... అక్కడ ఇంటిని వదిలి మరలా అద్దంకి పట్టణంలోకి వచ్చి అద్దె ఇళ్లల్లోకి రాలేక సతమతమవుతున్నారు. అప్పట్లో అధికారులు, ప్రజా ప్రతినిధుల మాటలు నమ్మి నిలువునా మోస పోయామని లబ్దిదారులు లబోదిబో అంటున్నారు. అన్ని వసతులు కల్పన పూర్తయిన తరువాతనే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం, గృహ ప్రవేశాలు జరుగుతాయని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పారు. ఆచరణలో మాత్రం పరిస్థితి వేరుగా మారింది. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక లబ్ధిదారులు హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. అద్దంకి పట్టణంలో సుమారు 2వేల మంది లబ్ధిదారులకు బొమ్మనంపాడు రోడ్డు, వేలమూరిపాడు రోడ్డు, నాగులపాడు రోడ్డులలో లే అవుట్‌లు వేసి ఇళ్ల స్థలాలు కేటాయించారు. బొమ్మనంపాడు రోడ్డులో ఉన్న లేఅవుట్ అద్దంకి పట్టణానికి సుమారు 4కి.మీ దూరంలో ఉంది. సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించారు. కనీస రవాణా వసతి కూడా లేదు. వర్షం పడితే కాలనీకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో ప్రస్తుతం 20 మంది లబ్ధిదారులు మాత్రమే నివాసం ఉంటున్నారు. దీంతో రాత్రి సమయంలో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. అక్కడ ఉండలేక.... ఖాళీ చేసి రాలేక సతమతమవుతున్నారు. ఇక వేలమూరిపాడు, నాగులపాడు రోడ్డు లలో ఉన్న లేఅవుట్‌లో ఎక్కువ మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నా కనీస వసతులు కల్పించలేదు. విద్యుత్ సౌకర్యం మినహా మిగిలిన ఎలాంటి కనీస వసతుల కల్పన జరగలేదు. కనీసం గ్రావెల్ రోడ్లు, సీసీ డ్రైన్‌లు, తాగునీటి వసతుల కల్పన కూడా లేకపోవడంతో నివాసం ఉంటున్న లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. చిన్న పాటి వర్షం పడ్డా కాలనీలలో నడిచే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. కనీసం సైడ్ డ్రైన్‌లు కూడా లేకపోవడంతో మురుగు ఇళ్ల ముందు నిలిచి పోతుంది. ఇక ఆయా కాలనీలకు వెళ్లే రోడ్లు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. నాడు వైసీపీ పాలకులు చేసిన నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపంగా మారి ఇప్పటికీ నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త గ్రామాలు కాస్తా చిట్టడవులుగా మారాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత
ఎన్టీఆర్ కాలనీలుగా మార్పుతో సరి
సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓటమి చెంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల పేర్లనును ఎన్‌టీఆర్ కాలనీలుగా మార్పు చేశారు. అయితే ఆయా కాలనీలలో వసతుల కల్పనపై మాత్రం కూటమి ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. అందులో ప్రభుత్వం నుంచి 1.80 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. మిగిలిన డబ్బులు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి కట్టుకున్న ఇంటిని వదిలి రాలేక, వసతుల లేమి మధ్య ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కనీసం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమైనా ఆయా కాలనీలలో కనీస వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.