తెగుళ్లతో మిర్చి రైతుల బెంబేలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:52 PM
మిర్చి రైతులను పలు రకాల తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పైర్లు పచ్చగా ఉండి పూత పిందె దశకు చేరుకున్న తరుణంలో తెగుళ్లు సోకి పాడు చేస్తున్నాయి. తెగుళ్ల నుంచి పైర్లను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చేతికి అందివచ్చిన పంట తెగుళ్లబారినపడుతుండడంతో ఏమి చేయాలో అని తలలు పట్టుకుంటున్నారు. బొబ్బర, నల్లి తెగుళ్ల బాధ వెంటాడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్చూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : మిర్చి రైతులను పలు రకాల తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పైర్లు పచ్చగా ఉండి పూత పిందె దశకు చేరుకున్న తరుణంలో తెగుళ్లు సోకి పాడు చేస్తున్నాయి. తెగుళ్ల నుంచి పైర్లను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చేతికి అందివచ్చిన పంట తెగుళ్లబారినపడుతుండడంతో ఏమి చేయాలో అని తలలు పట్టుకుంటున్నారు. బొబ్బర, నల్లి తెగుళ్ల బాధ వెంటాడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి కౌలు, వ్యవసాయ పెట్టుబడులు కలుపుకొని రూ. లక్ష వరకు ఖర్చు అయిందని, పైర్లను చూస్తుంటే పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనపడడం లేదని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. పర్చూరు వ్యవసాయ సబ్‌డివిజన్ పరిఽధిలోని కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి మండలాల్లో దాదాపు 15 వేల ఎకరాలకు పైగానే రైతులు మిర్చి పైరును సాగు చేస్తున్నారు. గత ఏడాది మిర్చి ధర దిగజారడం, పెట్టుబడులు అధికంగా ఉండడంతో ఈ ఏడాది సాగును తగ్గించారు. అయితే ఈ ఏడాది అయినా ధర ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో వ్యవప్రయాశలు పడి సాగు చేసిన రైతులకు తెగుళ్లు దాడి చేస్తున్నాయి. తెగుళ్ల తీవ్రతతో ఇప్పటికే వందల ఎకరాల్లో పైర్లు తొలగించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే గులాబీ తెగులుతో తెల్లబంగారం (పత్తి) నష్టపోయినట్లుగానే మిర్చి రైతులూ నష్టపోవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు.